Site icon NTV Telugu

Off The Record: దేవినేని ఉమా పార్టీ మారబోతున్నారా..?

Devineni Uma

Devineni Uma

Off The Record: టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా పార్టీ మారతారన్న ప్రచారం ఇప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో హాట్‌ హాట్‌గా నడుస్తోంది. పార్టీ మారతారన్నది ఒక ఎత్తయితే…. ఏకంగా వైసీపీలో చేరబోతున్నారంటూ సోషల్‌ మీడియాలో ఊదరగొట్టడం కలకలం రేపుతోంది. ఆ ప్రచారానికి ఉక్కిరి బిక్కిరయిన ఉమా… చివరికి స్పందించి ఖండించాల్సి వచ్చిందంటే… పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. టీడీపీకి అత్యంత లాయల్‌ అన్న పేరుంది దేవినేనికి. 2014-19 మధ్య చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా కూడా పనిచేశారాయన. 2019 ఎన్నికల్లో తొలిసారి ఓటమి చవిచూసిన ఉమా 2024లో టీడీపీ టికెట్ కూడా తెచ్చుకోలేకపోయారు. 2019లో వైసీపీ తరపున పోటీచేసి తనపై గెలిచిన వసంత కృష్ణ ప్రసాద్‌కే 24లో తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వడంతో దేవినేని ఉమా పరిస్థితి దారుణంగా మారిపోయిందని చెప్పుకుంటారు.

Read Also: Iran-Israel War : ట్రంప్ వార్నింగ్.. దాడులు ఆపేస్తున్నట్టు ఇజ్రాయెల్ ప్రకటన..

ఎన్నికలకు ముందు కాస్త అసమ్మతి గళం వినిపించిన ఉమా… ఆ తర్వాత పార్టీ అధికారంలోకి రావడంతో బహిరంగంగా ఎక్కడా నోరు తెరిచే సాహసం చేయడం లేదు. ఎలాగూ అధికారంలో ఉన్నాం కాబట్టి ఏదోఒక నామినేటెడ్‌ పదవి దక్కుతుందని భావించారట ఆయన. కానీ… జిల్లాలో పలువురికి పదవులు దక్కుతున్నా… ఉమా ఊసే రావడం లేదు. ఒక దశలో ఎమ్మెల్సీ వస్తుందని గట్టిగా ప్రచారం జరిగినా… చివరికి అది కూడా దక్కలేదు. మరోవైపు మైలవరం టీడీపీ శాసనసభ్యుడిగా వసంత కృష్ణ ప్రసాద్ ఉన్నప్పటికీ….ఉమా జోక్యం మాత్రం తగ్గడంలేదన్నది ఎమ్మెల్యే వర్గం మాట. నియోజక వర్గంలో అనేక విషయాల్లో ఉమా జోక్యం చేసుకోవడం ఎమ్మెల్యే వర్గాన్ని ఇరిటేట్ చేస్తోందట. ఇద్దరు నేతల మధ్య ఏ మాత్రం సఖ్యత లేదన్నది ఇక్కడ బహిరంగంగా చెప్పుకునే మాటే. ఈ పరిస్థితుల్లో ఉమా కూడా నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారట. గతంలో తనతో పాటు పనిచేసి ప్రస్తుతం వసంత దగ్గరకు వెళ్లిన వాళ్లు కాకుండా… మిగతా వాళ్ళతో కలిసి మైలవరం రాజకీయాలు చెక్కబెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యే వసంత దగ్గరకు వెళ్లి కొన్ని కారణాలతో అసంతృప్తికి గురైన వారిని కూడా ఉమా దగ్గరకు తీసే ప్రయత్నాలు చేస్తున్నారనేది లోకల్ టాక్. ఇవాళ కాకపోతే రేపైనా తనకు పార్టీలో గుర్తింపు దక్కుతుందని, పదవి వస్తుందన్న ఆశతో ఉమా పని చేస్తున్నారన్నది ఆయన అనుచరుల మాట.ఇలాంటి సమయంలో మాజీ మంత్రి టిడిపిని వీడి వైసీపీలో చేరతారన్న ప్రచారం మొదలవడంతో ఆయన వర్గానికి దిమ్మ తిరిగిపోయినట్టు సమాచారం.

Read Also: Rammohan Naidu : బ్లాక్ బాక్స్ పై ఇండియాలోనే విచారణ : రామ్మోహన్ నాయుడు

అటు ఉమా కూడా ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారట. అసలీ ప్రచారం ఎక్కడి నుంచి మొదలైందని ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ నిర్ణయాలపై పెద్ద ఎత్తున విమర్శలు చేసి ఆందోళనలు నిర్వహించిన ఉమా… ఇప్పుడు ఆ పార్టీలోకి వెళ్తారన్న సోషల్ మీడియా ప్రచారం రాజకీయ వర్గాల్లో కూడా తీవ్ర చర్చనీయాంశం అయింది. పరిస్థితి చేయి దాటిపోతోందని గ్రహించిన ఉమా వెంటనే స్పందించి వైసీపీ దిగజారుడు రాజకీయాలతో ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేస్తోందంటూ ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. తన పార్టీ మార్పు ప్రచారం వెనక వైసీపీ ఉన్నట్టు ఎక్స్‌ మెసేజ్‌లో పెట్టినా…దీని వెనక సొంత పార్టీ వాళ్ళ ప్రమేయం కూడా ఉందని అనుమానిస్తున్నారట ఎక్స్‌ మినిస్టర్‌. ఆయన అనుమానం ప్రధానంగా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వర్గం మీద ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో అసత్య ప్రచారంపై విచారణ జరపాలని పోలీసులకు ఫిర్యాదు చేసే వరకు వెళ్లారు దేవినేని. అటు ఎమ్మెల్యే వసంత వర్గం మాత్రం… తమకు ఆ అవసరం లేదని, అటెన్షన్‌ కోసమే ఉమా అలా ఆరోపిస్తున్నారేమోనని కామెంట్‌ చేస్తోందట. ఈ వ్యవహారం ఎంతదాకా వెళ్తుందోనని గమనిస్తున్నాయి రాజకీయవర్గాలు.

Exit mobile version