Site icon NTV Telugu

Off The Record: సీఎం రేవంత్‌ సొంత పార్టీ నేతలకే సీరియస్ వార్నింగ్ ఇచ్చారా?

Revanth

Revanth

Off The Record: తెలంగాణ కాంగ్రెస్‌ హెడ్‌ క్వార్టర్స్‌ గాంధీభవన్‌లోకి ఏకంగా గొర్రెల్ని తోలుకొచ్చి ధర్నా చేశారు గొల్ల కురుమలు. గంటకు పైగా గాంధీ భవన్‌లో నానా హంగామా జరిగింది. గొల్ల కురుమల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఆందోళకారులు. సమస్యలు చెప్పుకోవడం… వాటి పరిష్కారం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే కార్యక్రమాలు చేయడం వరకు ఓకేగానీ…. ఇలా ఏకంగా పార్టీ ఆఫీస్‌లోకి గొర్రెల్ని తీసుకు రావడం… అదీ సొంత పార్టీ నేతలే కావడాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారట పార్టీ పెద్దలు. మంత్రి పదవి ఆశిస్తున్న వాళ్ళు ఎవరో వెనకుండి ఈ తంతు నడిపించి ఉంటారన్న అనుమానాలు పార్టీ నేతల్లో బలంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవలి మంత్రివర్గ విస్తరణలో మాదిగ సామాజికవర్గానికి అనవకాశం దక్కిన విధానాన్ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని ఉండవచ్చని కూడా అంచనా వేస్తున్నారట.

Read Also: Off The Record: ఆ టీడీపీ ఎమ్మెల్యేలపై చంద్రబాబు వేటు వేయనున్నారా..?

కేబినెట్‌ బెర్త్‌ కోసం… హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ దాకా… వివిధ వర్గాల పెద్దల్ని కలిసి వత్తిడి పెంచడం వల్లే… మాదిగలకు అవకాశం దక్కిందన్న అభిప్రాయంతో ఉన్నారట మిగతా సామాజికవర్గాల నాయకులు. అందుకే మలి విస్తరణలో ఛాన్స్‌ కోసం ఇప్పటి నుంచే వత్తిడి పెంచే ప్లాన్‌లో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. అయితే… పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్‌, అధిష్టానం పెద్దల్ని కలిసి మంత్రి పదవి కోరటం, ఇతరత్రా పదవుల్ని ఆశించడంలో తప్పులేదుగానీ… సొంత పార్టీ కార్యాలయం ముందే ధర్నాలు చేయించడం క్రమశిక్షణ రాహిత్యమేగాక…. పూర్తి బాధ్యతారాహిత్యమని భావిస్తున్నారట సీఎం రేవంత్‌రెడ్డి. ఆ క్రమంలోనే…. పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో గొల్ల కురుమల ధర్నా వ్యవహారంపై సీరియస్ అయినట్టు సమాచారం. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తామంటూ కటువుగానే తేల్చి చెప్పారాయన.

Read Also: SBI PO 2025: బ్యాంక్ జాబ్ కావాలా?.. ఎస్బీఐలో 541 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు రెడీ.. మీరూ ట్రై చేయండి

ఇటీవల కార్పొరేషన్ పదవులు, పార్టీ కమిటీలు వేసినందున… అందులో యాదవులకు పూర్తిస్థాయి ప్రాధాన్యత ఇవ్వలేదని ఫీలింగ్‌లో ఉన్నారు ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు. వాళ్ళంతా… ప్రత్యేక సమావేశాలు పెట్టుకోవడం, నాయకుల దగ్గర యాదవులకు గుర్తింపు లేదా అని మాట్లాడటం లాంటి అంశాలన్నిటినీ పరిగణనలోకి తీసుకుని సీఎం మాట్లాడినట్టు తెలుస్తోంది. గాంధీభవన్‌ ఘటన వెనక సొంత పార్టీ నాయకులు ఉన్నారన్న అనుమానాలు బలంగా ఉన్నట్టు తెలుస్తోంది. పదవులు ఆశిస్తున్న నాయకుల్లో ఎవరో ఒకరు అలా చేసి ఉంటారని అనుమానిస్తున్నారట. కారణం ఏదైనా జరుగుతున్న పరిణామాలపై మాత్రం సీఎం కాస్త సీరియస్‌గానే ఉన్నట్టు సమాచారం. పదవులు ఆశించడం, తమ సామాజిక వర్గానికి న్యాయం జరగాలని కోరుకోవడంలో తప్పులేదు కానీ… పార్టీ కార్యాలయాల ముందు ధర్నాలు చేయించడమంటే… సొంత, అధికార పార్టీని అవమానించినట్టే కదా అన్నది కాంగ్రెస్‌ పెద్దల భావన అట. తాజా హెచ్చరిక ద్వారా అలాంటి వాళ్ల మీద తానో కన్నేసి ఉంచానన్న సంకేతం కూడా ముఖ్యమంత్రి పంపి ఉండవచ్చని అంచనా వేస్తున్నాయి రాజకీయ వర్గాలు.

Exit mobile version