NTV Telugu Site icon

Off The Record: కంటోన్మెంట్‌ సీటుపై నేతల ఆశలు..! పోటీకి ఆ ముగ్గురు తహతహ..!

Cantonment

Cantonment

Off The Record: అనారోగ్యంతో సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూశారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే కాలం చేసినా.. ఈ నియోజకవర్గానికి ప్రస్తుతం ఉపఎన్నిక వచ్చే అవకాశం లేదు. ఈ ఏడాది చివర్లో షెడ్యులు ప్రకారం అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో సాంకేతికంగా కంటోన్మెంట్ కు ఉపఎన్నిక నిర్వహించే ఛాన్స్ లేదు. అయినప్పటికీ ఎస్సీ రిజర్డ్వ్‌ అయిన ఈ సీటుపై చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. సాయన్న ఉండగానే అనేక మంది తమ స్థాయిలో లాబీయింగ్‌ చేసిన ఉదంతాలు ఉన్నాయి. సాయన్న కుమార్తె లాస్య నందిత ఓసారి GHMC కార్పొరేటర్‌గా పనిచేశారు. తర్వాత రాజకీయంగా తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నారామె. తన ప్లేస్‌లో కుమార్తెకు సాయన్న అసెంబ్లీ సీటు అడగొచ్చనే చర్చ కూడా ఎమ్మెల్యే బతికున్న సమయంలో సాగింది. ఇప్పుడేం జరుగుతుంది అనేది ప్రశ్న.

Read Also: Off The Record: గతంలో తీవ్ర విమర్శలు..! టీడీపీలో కన్నా ఇమడగలరా?

తెలంగాణ ఉద్యమ సమయంలో క్రియశీలక పాత్ర పోషించిన ఎర్రోళ్ల శ్రీనివాస్ కొంతకాలంగా సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌పై దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఎర్రోళ్ల నజర్‌ జహీరాబాద్‌పై ఉందట. తెలంగాణ ఉద్యమం నుంచీ యాక్టివ్‌గా ఉన్న పార్టీ నేత గజ్జెల నగేష్‌ సైతం కంటోన్మెంట్‌లో సొంత గ్రూప్‌ను నడిపిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్నారు నగేష్‌. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి పోటీ చేయాలన్నది నగేష్‌ ఆలోచన. ఇదే సీటుపై మరో బీఆర్‌ఎస్‌ నేత మన్నె క్రిశాంక్ సైతం ఆశలు పెట్టుకున్నారు. వీరిద్దరూ కాకుండా సాయన్న కుమార్తె లాస్య కూడా రేస్‌లో ఉంటారని టాక్‌.

Read Also: Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

గతంలో ఎమ్మెల్యేలు అనారోగ్యంతో కన్నుమూస్తే వాళ్ల కుటుంబ సభ్యులకే ఉపఎన్నికల్లో అవకాశం ఇస్తూ వస్తోంది BRS. దుబ్బాక, నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో ఆ సాంప్రదాయాన్ని కొనసాగించింది. ఇప్పుడు సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌కు ఉపఎన్నిక రాకపోయినా.. సాధారణ ఎలక్షన్స్‌లో అధికారపార్టీ ఏం చేస్తుంది అనేది ప్రశ్న. అలాగే సాయన్న కుటుంబం పూర్తిస్థాయిలో క్రియశీలక రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతుందా అనేది మరికొందరి డౌట్‌. మొత్తంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ గులాబీ రాజకీయాలపై వాడీవేడీ చర్చ మొదలైంది. పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది? వచ్చే ఎన్నికల్లో అధికారపార్టీ నుంచి అభ్యర్ధి ఎవరు? అనేలా ఆరా తీస్తున్నారు కొందరు.