Off The Record: సి.రామచంద్రయ్య…. సీనియర్ పొలిటీషియన్. ఒకప్పుడు వైసీపీలో కీలకంగా ఉన్నారు ఈ ఎమ్మెల్సీ. అయితే… గత ఎన్నికల సమయంలో ఆ పార్టీ మీదే నిప్పులు చెరిగి… మెల్లిగా టీడీపీకి దగ్గరయ్యారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైసీపీ తరపున వచ్చిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు సీఆర్. కూటమి సర్కార్ కూడా వెంటనే ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చేసింది. తాను రాజీనామా చేసిన పదవికే నోటిఫికేషన్ రావడంతో… మరో ఆలోచన లేకుండా ఈ సారి టీడీపీ తరపున అదే సీటు ఇచ్చేశారు. ఆ విధంగా ఈసారి ఏపీలో కూటమి అధికారం చేపట్టాక నామినేటెడ్ పదవి పొందిన తొలి నాయకుడు అయ్యారాయన. సరే… అంతవరకు ఓకే అనుకున్నా… పదవి వచ్చాక టీడీపీతో కూడా టచ్ మీ నాట్ అంటున్నారట. అది ఎంతలా అంటే… ఇప్పుడసలు ఎమ్మెల్సీ పార్టీలో ఉన్నారా? లేదా? అన్న అనుమానాలు ఆయన సొంత జిల్లా కడప నేతలకే వస్తున్నాయి. ఇప్పటిదాకా పార్టీకి సంబంధించిన ఏ ముఖ్యమైన కార్యక్రమంలో పాల్గొనలేదాయన. చివరికి ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు.
Read Also: Off The Record: కవిత లేకుండా తొలిసారి బీఆర్ఎస్ బతుకమ్మ సంబరాలు..
సబ్జెక్ట్ ఏదైనాసరే… డైరెక్ట్‌గా మాట్లాడతారని పేరున్న సీఆర్ ఎందుకు మౌన వ్రతం పాటిస్తున్నారు? పార్టీ వ్యవహారాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారన్న చర్చ జరుగుతోంది టీడీపీ సర్కిల్స్‌లో. ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు సీఎం ప్రోగ్రామ్స్‌కు కూడా దూరంగా ఉంటున్నారు రామచంద్రయ్య. పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే మహానాడు తన సొంత జిల్లాలో జరిగినా అధికార హోదాలో ఉన్న నాయకుడు అస్సలు కనిపించకపోవడం ఏంటన్న చర్చ జరుగుతోంది. రాయలసీమలో బలమైన బలిజ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ రామచంద్రయ్యను వరుసగా పదవులు వరిస్తున్నాయి. గతంలో తెలుగుదేశం పార్టీలో చాలా కీలకంగా పని చేశారాయన. ఆ తరువాత ప్రజారాజ్యం పార్టీ మీదుగా వైసీపీలో తేలారు. ఆయన సీనియారిటీని గౌరవిస్తూ… ఎమ్మెల్సీ ఇచ్చింది ఫ్యాన్ అధిష్టానం. కానీ… అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీ అధిష్టానం మీదే తీవ్ర ఆరోపణలు చేస్తూ తిరిగి టీడీపీకి దగ్గరయ్యారు. చివరికి ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నారా? లేదా అన్న అనుమానాలు రావడానికి కూడా బలమైన కారణమే ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. తన కొడుక్కి కడప ఎమ్మెల్యే టికెట్ కావాలని ఎలక్షన్ టైంలో టీడీపీ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చారట రామచంద్రయ్య. అలా కుదరదని చెప్పేయడంతో… నేను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తాను…. ఆ పదవినైనా కుమారుడికి ఇవ్వాలని పట్టుబట్టినా వర్కౌట్ అవలేదు. ఇక అప్పట్నుంచి అలక పాన్పు ఎక్కేసినట్టు సమాచారం.
టీడీపీ ఆవిర్భావం తర్వాత మొట్ట మొదటి సారిగా కడపలో మహానాడు జరిగింది. లీడర్స్, కేడర్ టాప్ టు బాటమ్ తరలి వచ్చిన పార్టీ పండక్కి డుమ్మా కొట్టారాయన. అంతేకాదు…ఈసారి అధికారంలోకి వచ్చాక ఇప్పటికి మూడు సార్లు ఉమ్మడి కడప జిల్లాలో పర్యటించారు సీఎం చంద్రబాబు. అయినా… ఏ టూర్‌లోనూ రామచంద్రయ్య జాడే లేదు. మంత్రి లోకేష్ రెండు రోజుల పాటు జిల్లాలో పర్యటించినా… నో అటెండెన్స్. ఈ వైఖరిపైనే విస్మయం వ్యక్తం చేస్తున్నాయి జిల్లా పార్టీ శ్రేణులు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం నానా కష్టాలు పడ్డవాళ్ళని కూడా కాదని, అధికారంలోకి వచ్చిన వెంటనే ఫస్ట్ పోస్ట్ ఆయనకు ఇస్తే… ఇలా చేస్తారా? పెద్దలకు కూడా బాగా బుద్ధి చెప్పారంటూ గుసగుసలాడుకుంటున్నాయి టీడీపీ శ్రేణులు. అయితే… ఇక్కడ మరో వాదనా వినిపిస్తోంది కడప సర్కిల్స్‌లో. సి.రామచంద్రయ్య ఏ కొడుకునైతే….. రాజకీయంగా నిలబెట్టడం కోసం పాకులాడి సీటు ప్రయత్నాలు చేశారో…. అదే కొడుకు కూటమి ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజులకే చనిపోయారని, ఆ తర్వాత ఆయన డీలా పడినట్టు కనిపిస్తోందని అంటున్నారు. కారణం ఏదైనా… ఎమ్మెల్సీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. అయితే… తాజాగా మొదలైన మండలి సమావేశాలకు ఆయన అటెండ్ అవడం కొసమెరుపు. అంటే… పదవిలో ఉంటూ పార్టీకి మాత్రం దూరమయ్యారా అన్న చర్చలు మొదలయ్యాయి.