Off The Record: బీసీ రిజర్వేషన్స్ బిల్లు విషయమై తెలంగాణ బీజేపీ తడబడిందన్న వాదన బలపడుతోంది రాష్ట్ర రాజకీయవర్గాల్లో. దీనిపై కాస్త గట్టి చర్చే జరుగుతోందట. ముస్లింలకు బీసీ రిజర్వేషన్లు అమలు చేయడంపై అభ్యంతరం చెబుతూ వస్తోంది కాషాయ దళం. తాము అధికారంలోకి వస్తే…. ఆ కోటాను ఎత్తేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేసిన కుల గణనలో బీసీ ముస్లింలు అన్న కాలమ్ పెట్టడాన్ని కూడా తప్పు పట్టింది బీజేపీ. అస్సలు ముస్లింలను బీసీల్లో కలపవద్దని చెప్పింది. అంతవరకు ఓకే… అది ఆ పార్టీ స్టాండ్ అని అనుకున్నా… తాజాగా అసెంబ్లీలో వ్యవహరించిన తీరు అందుకు భిన్నంగా కనిపించిందట. బీసీ రిజర్వేషన్ బిల్లును సభలో పెట్టినప్పుడు కమలం పార్టీ మద్దతు ఇచ్చింది. బిల్లుని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంలో… ముస్లింలను బీసీల్లో కలిపితే ఒప్పుకోబోమన్న తమ పార్టీ స్టాండ్ గురించి బీజేపీ సభ్యులెవరూ మాట్లాడలేదట. ఇక్కడే కొత్త చర్చ మొదలైంది. పార్టీ స్టాండ్ మారిందా, లేక ఆ సంగతిని బీజేపీ సభ్యులు మర్చిపోయారా అన్న ప్రశ్నలు వస్తున్నాయట పొలిటికల్ సర్కిల్స్‌లో..
అయితే బిల్లు విషయంలో స్పష్టత కోరుతూ ప్రభుత్వానికి ఉత్తరం రాస్తే స్పందన లేదని అంటున్నారు కాషాయ ఎమ్మెల్యేలు. బీసీ కులగణన, రిజర్వేషన్‌పై పూర్తి విషయాలను సభ ముందు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ముస్లిం రిజర్వేషన్స్‌పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఇప్పుడు అడుగుతున్నారు. మతపరమైన రిజర్వేషన్లకు మేం వ్యతిరేకమని అంటూ… బీసీలో ముస్లిం రిజర్వేషన్ శాతం ఎంతో చెప్పాలని బిల్లు ఆమోదం పొందాక అడగడం ఏంటో అర్ధం కావడం లేదంటున్నారు పరిశీలకులు. బీసీ రిజర్వేషన్స్‌పై కాంగ్రెస్ కుట్ర చేస్తోందనీ, ఓవైపు వెనుకబడిన కులాలకు 42 శాతం రిజర్వేషన్లు అంటూనే… మరోవైపు ముస్లింలకు 10 శాతం అని చెబుతున్నారని, దీనిపై స్పష్టత ఇవ్వాలని, లేదంటే…. బీసీ సమాజం మొత్తం ప్రభుత్వం మీద తిరగబడాలని పిలుపునిస్తున్నారు. సరే…. అంతా బాగానే ఉందిగానీ…. ఈ డౌట్స్ అన్నీ అప్పుడు ఎందుకు రాలేదు? సభలో ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించిన రోజు ఈ వివరణలు ఎందుకు అడగలేదు? పార్టీ ఎమ్మెల్యేలంతా ఏం చేస్తున్నారంటే సమాధానం లేదు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు ఎక్కడో తడబడ్డారన్న మాట పార్టీ వర్గాల నుంచే వినిపిస్తోంది. అసెంబ్లీలో బిల్లు పెట్టిన రోజు సరిగా కసరత్తు చేయకుండానే తలూపేశారా అని కూడా మాట్లాడుకుంటున్నారట. ప్రధానికి ముఖ్యమంత్రి లేఖ రాయడం, బీజేపీ సహా అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉన్న అన్ని పార్టీల ప్రతినిధుల్ని ఈ బిల్లుల విషయంలో కలుస్తామని అడగడంతో అసలేం జరుగుతోందంటూ… రాష్ట్ర బీజేపీని కేంద్ర పార్టీ నేతలు ఆరా తీశారట. అటు రాష్ట్ర నాయకులు కేంద్ర మంత్రి అమిత్ షా ను కలిసినప్పుడు కూడా ఈ అంశం చర్చకు వచ్చినట్టు తెలిసింది. బీసీ రిజర్వేషన్స్‌కి మనం వ్యతిరేకం కాదని చెబుతూనే… ఆ కోటా పరిధిలోని ముస్లింలను తీసుకు రావడానికి మాత్రం వ్యతిరేకమని చెప్పారట షా. మతం ఆధారంగా రిజర్వేషన్స్‌ని ఎట్టి పరిస్థితిలో ఒప్పుకునేది లేదని అన్నారట. అదే సమయంలో అసెంబ్లీలో బీసీ బిల్లు ప్రస్తావన కూడా వచ్చినట్టు తెలిసింది.
అందుకు రాష్ట్ర నాయకులు స్పష్టమైన సమాధానం చెప్పకుండా దాటవేత ధోరణిలో నసిగారట. తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లులో ముస్లిం కోటా ఉన్న సంగతిని అమిత్‌షాకు స్పష్టంగా చెప్పకుండా… తప్పించుకునే వ్యవహరించారని రాష్ట్ర పార్టీ వర్గాలే చెప్పుకుంటున్నాయి. బయట మాట్లాడామని, బిల్లును వ్యతిరేకించామని ఏదేదో… డొంక తిరుగుడుగా మాట్లాడారు తప్ప… షాతో మేటర్‌ని సూటిగా, సుత్తిలేకుండా చెప్పలేకపోయారని అంటున్నారు. ఇలా… బిల్లు విషయంలో సరైన కసరత్తు చేయకుండా, క్లారిటీ లేకుండా తెలంగాణ బీజేపీ నాయకులు కేంద్ర నాయకత్వం దగ్గర నీళ్ళు నమిలినట్టు తెలుస్తోంది. ముందు ముందు ఈ విషయంలో ఆ పార్టీ వైఖరి ఎలా ఉంటుందో చూడాలి మరి.