NTV Telugu Site icon

Off The Record about BJP Focus on bhadrachalam: రాముడి సెంటిమెంట్‌పై ఆశలు..! భద్రాచలంపై బీజేపీ ఫోకస్‌..!

Bhadrachalam

Bhadrachalam

Off The Record about BJP Focus on bhadrachalam: దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో పాగా వేయాలని చూస్తోంది బీజేపీ. తెలంగాణలో పార్టీ కదలికలు పెరిగిన ప్రభావం ఈ నియోజకవర్గంపైనా ఉంటుందని ఆశిస్తున్నారు కమలనాథులు. ఈ నియోజకవర్గంలో కమ్యూనిస్టులు.. కాంగ్రెస్‌ పార్టీ ఓటు బ్యాంకు ఎక్కువ. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇక్కడ గులాబీ జెండా రెపరెపలాడించేందుకు చూస్తోంది బీఆర్‌ఎస్‌. ఈ మూడు పక్షాలను కాదని బీజేపీ పుంజుకోవాలి అంటే ఏదో అద్భుతం జరగాల్సిందే. తమ విషయంలో ఆ అద్భుతాన్ని భద్రాచలం రాముడు చేస్తాడనేది కాషాయ పార్టీ నేతల విశ్వాసమో ఏమో.. వారి కదలికలపై అవే సందేహాలు కలుగుతున్నాయట.

Read Also: Off The Record about Narasaraopet MP: ఎంపీ సిట్టింగ్‌ సీటుకు ఎసరు..? సీటు మార్చే పనిలో వైసీపీ..!

భద్రాచలం ఆలయానికి శతాబ్ధాల ఘనచరిత్ర ఉన్నప్పటికీ సరైన అభివృద్ధికి నోచుకోలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించేది. చివరకు ఆలయ భూములకు కూడా రక్షణ లేకుండా పోయింది. రాష్ట్ర విభజన తర్వాత ఈ ప్రాంతం.. భద్రాచలం నియోజకవర్గం ముక్క చెక్కలైంది. మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ప్రధాన పార్టీలు క్రమంగా గేరప్‌ అవుతున్నాయి. ఆ క్రమంలోనే బీజేపీ కూడా ప్రతి నియోజకవర్గాన్ని బలోపేతం చేసుకునే పనిలో పడింది. భద్రాచలం విషయంలో మాత్రం కమలనాథుల కదలికలు.. బీజేపీ ప్లాన్‌ను చెప్పకనే చెబుతున్నాయని చెవులు కొరుక్కుంటున్నారు. భద్రాచలం ఆలయాన్ని కేంద్ర ప్రభుత్వ ప్రసాద్‌ పథకంలో చేర్చింది. అభివృద్ధికి వందకోట్ల నిధులు ఇస్తున్నట్టు తెలియజేసింది. ఆ మొత్తంలో 41 కోట్లను రిలీజ్‌ చేశారు. ఆగమేఘాలపై నిధుల విడుదల… పనుల ప్రారంభం చూస్తుంటే.. బీజేపీ మాటలు.. పనులకు అర్థాలే వేరని గుసగుసలు వినిపిస్తున్నాయి.

భద్రాచలంలో ఎత్తుగడలు.. వ్యూహాలు రాజకీయంగా బీజేపీకి ఎంతవరకు కలిసి వస్తాయో కానీ.. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, కమ్యూనిస్ట్‌ పార్టీలను క్రాస్‌ చేసి రేస్‌లో ముందు నిలబడటం అంత తేలిక కాదు. బీజేపీకి ఈ నియోజకవర్గంలో ఆదరణ అంతంత మాత్రమే అనేది గత ఎన్నికల గణాంకాలు చెబుతున్నాయి. ఇంత వరకు బీజేపీకి భద్రాచలంలో డిపాజిట్‌ దక్కలేదు. 2009లో భద్రాచలంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలిచిన కుంజా సత్యవతి.. ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. కుంజా సత్యవతి 2018లో బీజేపీ నుంచి పోటీ చేస్తే వచ్చిన ఓట్లు 18వందల 24. నియోజకవర్గంలో మొత్తం ఒక లక్షా 25 వేల ఓట్లు ఉంటే.. అందులో 2 వేల ఓట్లు కూడా రాలేదు. 2009లో బీజేపీ అభ్యర్థికి 3 వేల 5వందల 74 ఓట్లు పోలయ్యాయి. 2014లో బీజేపీ భద్రాచలంలో పోటీ చేయలేదు. భద్రాచలంలో బీజేపీ సంఖ్యాశాస్త్రం చెబుతున్న లెక్కలు ఈ విధంగా ఉంటే.. కమలనాథుల ఆశలు మాత్రం ఎక్కడో ఉన్నాయి. రామా నీవే దిక్కు అంటూ నిధులు కుమ్మరిస్తున్నారు. ఇందులో రాజకీయ ఉద్దేశం లేదని బీజేపీ నేతలు చెబుతున్నా.. పొలిటికల్‌ సర్కిళ్లలో జరుగుతున్న చర్చ వేరు. మరి.. బీజేపీ ఆశలపై రాముడి కరుణా కటాక్షాలు ఉంటాయో లేదో కాలమే చెప్పాలి.