NTV Telugu Site icon

Off The Record: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు లేనట్టేనా..?

Tg

Tg

Off The Record: అధికారంలోకి వస్తే.. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్‌. ఇప్పుడు రాష్ట్రంలో ఆ పార్టీనే అధికారంలో ఉంది. కొత్త ఏడాదిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిపేందుకు సిద్ధమవుతోంది. కానీ.. చెప్పిన ప్రకారం బీసీ రిజర్వేషన్ల పెంపు ఉంటుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. జనవరిలో షెడ్యూల్ ప్రకటించి, ఫిబ్రవరిలో ఎన్నికలు పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరిపేందుకు కార్యాచరణ రూపొందుతోందట. అందుకే ఇప్పుడు రిజర్వేషన్స్‌ వ్యవహారం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయింది. రిజర్వేషన్లు పెంచేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందని చెబుతూనే… అందుకు అనుగుణంగా రాష్ట్రంలో కుల గణన నిర్వహిస్తోంది ప్రభుత్వం. అయితే మొదట బీసీ కమిషన్‌ ఆధ్వర్యంలో కుల గణన చేసేలా షెడ్యూల్ ప్రిపేర్ చేయగా… కొంత మంది కోర్ట్‌కు వెళ్ళారు. దీంతో కులగణన కోసం డెడికేటెడ్‌ కమిషన్ ను ఏర్పాటు చేసి రిజర్వేషన్లు ఖరారు చేయాలని ఆదేశించింది కోర్ట్‌. ఆ ప్రకారమే కమిషన్‌ ఏర్పాటవగా… డిసెంబర్ 30 నాటికి నివేదిక సమర్పించే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

Read Also: Maharashtra CM Post: షిండే వర్గం సంచలన నిర్ణయం!

రాష్ట్రంలో మొత్తం 12వేల 941 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. పంచాయతీ ఎన్నికల్లో ప్రతి వార్డుకు ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాల్సి ఉన్నందున సిబ్బంది లభ్యత దృష్ట్యా మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నారట. అయితే…గతంలో ఉన్న గ్రామాలు, వార్డులు పెరిగినందున ఈసారి రిజర్వేషన్లు మారబోతున్నాయి. బీసీ వార్డులు ఓసీకి, ఓసీ వార్డులు మరో కులానికి… ఇలా… వార్డు, పంచాయితీ రిజర్వేషన్స్‌ మారతాయి తప్ప…సామాజికవర్గాల లెక్కల్లో బీసీ రిజర్వేషన్లు పెంచేందుకు ప్రభుత్వం సుముఖంగా లేనట్టు తెలుస్తోంది. అందులో కొన్ని సాంకేతిక సమస్యలు కూడా ఉన్నట్టు చెబుతున్నాయి ప్రభుత్వ వర్గాలు. అయితే… అదే సమయంలో మారో మాట కూడా వినిపిస్తోంది. ఒకవేళ హామీ ఇచ్చినట్టుగా ప్రభుత్వ పరంగా బీసీ రిజర్వేషన్స్‌ పెంచడానికి వీలవకుంటే… పార్టీ పరంగా ఆ చర్యలు తీసుకోవాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. అంటే.. పంచాయితీ ఎన్నికల్లో 42 శాతం సీట్లు డెడికేటెడ్‌గా బీసీలకే ఇచ్చి… మాట నిలబెట్టుకున్నామని అనిపించుకోవాలనుకుంటున్నారట కాంగ్రెస్‌ నాయకులు. ఇప్పటికే ఉన్న 22 శాతం రిజర్వేషన్ ప్రకారం ఆ సీట్లు బీసీలకు ఇస్తూనే…జనరల్ స్థానాల నుంచి మరో 20 శాతం సీట్లు బీసీ కోటాలో చేర్చేలా ఆలోచిస్తున్నారట కాంగ్రెస్‌ పెద్దలు.

Read Also: Shalibanda PS: శాలిబండ పోలీస్ స్టేషన్‌కు జాతీయ స్థాయి గుర్తింపు.. డీజీపీ అభినందనలు

దీంతో సాంకేతిక కారణాల వల్ల ప్రభుత్వ పరంగా ఇవ్వడానికి సాధ్యం కాకున్నా… పార్టీ పరంగా ఎక్కువ సీట్లు బీసీలకు ఇచ్చామని చెప్పుకోవాలన్నది హస్తం పెద్దల ఆలోచనగా తెలుస్తోంది. ముందు తాము ఇవ్వడం ద్వారా మిగిలిన రాజకీయ పక్షాలు కూడా బీసీలకు సీట్లు పెంచేలా వత్తిడి తెచ్చే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ప్రభుత్వ పరంగా రిజర్వేషన్లు పెంచాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందని… కేంద్రంలో తమ ప్రభుత్వం లేదు కాబట్టి ఇప్పుడు అది సాధ్యం కాదని ప్రజలకు చెప్పాలనుకుంటోందట కాంగ్రెస్‌. తమ పరిధిలో ఉన్న అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని బీసీలకు న్యాయం చేస్తామని చెబుతూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో కూడా పెద్దపీట వేస్తామని ఎన్నికల ముందు ప్రకటించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అవసరం అయితే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపే మార్గాలను కూడా వెదుకుతోందట తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే రైతు రుణమాఫీ, రైతు భరోసాను అమలు చేసేలా అధికారులకు సూచనలు ఇచ్చింది రేవంత్‌ సర్కార్‌. వాటికి తోడు బీసీ రిజర్వేషన్స్‌ని పార్టీ పరంగానైనా అమలు చేస్తున్నామని గట్టిగా చెప్పుకోగదలిగితే స్థానిక సంస్థల్లో తిరుగుండదని కాంగ్రెస్‌ పెద్దలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఆలోచనలు, ప్లాన్స్‌ని బీసీలు ఎలా తీసుకుంటారో చూడాలి మరి.

Show comments