Off The Record: గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా.. తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి గెలిచారు బండి సంజయ్. ఆపై సమీకరణాలు కలిసొచ్చి.. ఏకంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడయ్యారు. బీజేపీ అగ్రనాయకత్వం కూడా సంజయ్‌ను ప్రోత్సహిస్తూ వస్తోంది. ప్రస్తుత కమలనాధుల దృష్టంతా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఉంది. ఇదే సమయంలో కీలక నాయకులు అసెంబ్లీకి పోటీ చేసే స్థానాలపైనా కాషాయ శిబిరంలో చర్చ సాగుతోంది. ఆ క్రమంలోనే బండి సంజయ్ అసెంబ్లీకి ఎక్కడ నుంచి పోటీ చేస్తారు? ఆయన ఎక్కడ ఫోకస్ పెట్టారు? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నాయి పార్టీ శ్రేణులు.
Read Also: Off The Record: అశ్వారావుపేట అధికారపార్టీలో హీట్
కొద్దిరోజులుగా వేములవాడ నుంచి బండి సంజయ్ పోటీ చేస్తారని బీజేపీ వర్గాల్లో చర్చ ఉంది. కాదు సిరిసిల్ల నుంచి బరిలో ఉంటారని కూడా చెవులు కొరుక్కుంటున్నారు. మధ్యలో హుస్నాబాద్, ముథోల్ నుంచి పోటీ చేస్తారని ప్రచారం సాగింది. ఆయా ప్రాంతాల్లో సంజయ్ పర్యటనలు కూడా ఆ ప్రచారాలకు ఊతం ఇచ్చినట్టు అయ్యింది. అయితే ఇప్పుడు కొత్త చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. గత ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసిన కరీంనగర్ నుంచే బరిలో ఉండాలని కేడర్ ఆయనపై ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. మొన్నటి ఎన్నికల్లోనే సంజయ్ కరీంనగర్ నుంచి గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతారని బీజేపీ శ్రేణులు ఆశించాయి. కానీ.. తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా గెలిచారు సంజయ్. ఇప్పుడు మళ్లీ కరీంనగర్‌నే బ్యాటిల్ గ్రౌండ్‌గా చేసుకుంటారని తెలుస్తోంది. ఈ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై సర్వే కూడా చేశారని టాక్.
Read Also: Off The Record: అధికారపార్టీలో ఎమ్మెల్యే కోటంరెడ్డి వ్యాఖ్యల కలకలం
తాజాగా నిర్వహించిన సర్వేలో సంజయ్ గెలుస్తారని తేల్చారట. అప్పటి నుంచి సంజయ్ కూడా కరీంనగర్ అసెంబ్లీపై ఎక్కువ ఫోకస్ పెట్టారట. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన సెంటిమెంట్ కూడా కలిసి వస్తుందని లెక్కలేస్తున్నారట. రాష్ట్ర బీజేపీ చీఫ్‌గా తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూనే.. వీలు చిక్కితే కరీంనగర్‌కే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. తాజాగా సన్నిహితులు.. పార్టీలోని ముఖ్య అనుచరులతో నిర్వహించిన ఆంతరంగిక సమావేశంలోనూ కరీంనగర్ నుంచి అసెంబ్లీకి పోటీపై సంజయ్ సానుకూల సంకేతాలు ఇచ్చినట్టు సమాచారం. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలకంటే ముందుగానే అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తాయి. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని బీజేపీ అగ్రనాయకత్వం కరీంనగర్ అసెంబ్లీకి పోటీ చేసేందుకు సంజయ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం కరీంనగర్ ఎమ్మెల్యేగా అధికారపార్టీ BRSకు చెందిన గంగుల కమలాకర్ ఉన్నారు. కమలాకర్ కేబినెట్ మంత్రి కూడా. కమలాకర్‌ను ఢీకొట్టాలంటే సంజయ్‌ను పోటీకి దింపడమే సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయట.