Off The Record: విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. 2014, 2019 ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆయన ఆశించిన పదవులు దక్కలేదు. దీంతో కోటంరెడ్డిలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. పలు సందర్భాలలో తనలోని అసంతృప్తిని వ్యక్తం చేశారు కూడా. నెల్లూరు జిల్లాలో జగన్ ఓదార్పు యాత్ర ప్రారంభించినప్పటి నుంచీ ఆయన వెన్నంటి నిలిచినా తనకు గుర్తింపు లేదని పలుమార్లు పార్టీ నేతలు, సన్నిహితులతో చెప్పి వాపోయేవారు. ఇటీవల అధికారుల పనితీరుపై ఆయన చేసిన కామెంట్స్ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారాయి. తాజాగా తన ఫోన్‌ను ఇంటెలిజెన్స్ అధికారులు ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించి సంచలనం రేపారు కోటంరెడ్డి. వేర్వేరు సిమ్‌కార్డులు ఉపయోగించి ఫోన్‌లో మాట్లాడుతున్నానని ఎమ్మెల్యే చెప్పారు. తనపై నిఘా కోసం ఓ IPS అధికారిని నియమించుకోవచ్చునని వ్యంగ్యాస్త్రం సంధించారు. దీంతో కోటంరెడ్డికి ఏమైంది? ఆయన ఎందుకలా మాట్లాడుతున్నారు? అనే చర్చ జరుగుతోంది.
Read Also: Off The Record: టచ్ చేయొద్దంటున్న గోపీనాథ్
ఈ మధ్య కోటంరెడ్డిని సీఎం జగన్ పిలిపించుకుని మాట్లాడారు. నియోజకవర్గానికి సంబంధించి ఎలాంటి పనులు ఉన్నా.. తన కార్యాలయ కార్యదర్శితో చర్చించాలని సీఎం సూచించారు. దీంతో సమస్య సమసిపోయిందని అంతా భావించారు కూడా. కానీ.. కోటంరెడ్డి తాజా కామెంట్స్ చూశాక.. ఆయన ఇంకా అసంతృప్తితోనే ఉన్నారని అర్థం అవుతోంది. తనకు పదవులు రాకుండా జిల్లాలోని పెద్దరెడ్లు అడ్డుకున్నారని.. ఇకపై వారి ఆటలు సాగబోవన్నారు కోటంరెడ్డి. ఓట్లు.. సీట్లు ..ఎమ్మెల్యే.. ఎంపీ.. మంత్రి పదవులు అన్నీ తమకేనని కూడా MLA వెల్లడించారు. ఆ తర్వాత తన ఫోన్‌ను ఇంటెలిజెన్స్ అధికారులు ట్యాపింగ్ చేస్తున్నారని ఆయన విరుచుకుపడ్డారు.
కోటంరెడ్డి తాజా వ్యాఖ్యలు జిల్లా రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్నాయి. 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత టిడిపి ..బిజెపి నేతలతో సన్నిహితంగా మెలుగుతూ వచ్చారు కోటంరెడ్డి. ఎవరిపైనా విమర్శలు చేయకుండా తన పనులు సజావుగా జరిగేలా చూసుకున్నారు. 2019లో పార్టీ అధికారంలోకి వచ్చాక మంత్రి పదవి రాకపోయినా.. కేబినెట్ హోదాలో నామినేటెడ్ పదవైనా వస్తుందని ఆశించారు. చివరకు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవి తనకే వస్తుందని సన్నిహితులతోనూ ఆయన చెప్పుకొన్నారు. ఆ పదవీ రాకపోవడంతో ఎమ్మెల్యేలో అసంతృప్తి మరింత ఎక్కువైంది. దీంతో నియోజకవర్గ అభివృద్ధి పనులను సాకుగా చూపించి అవకాశం వచ్చినప్పుడల్లా ప్రభుత్వ తీరుపై విమర్శలు చేస్తూ వస్తున్నారు.
ముందస్తు అజెండాతోనే కోటంరెడ్డి ఈ విధంగా వ్యవహరిస్తున్నారనే వాదన ఉంది. అందుకే ఇంటలిజెన్స్ ద్వారా ఎమ్మెల్యే కదలికలపై నిఘా ఉంచినట్టు సమాచారం. ఎవరెవరితో ఏం మాట్లాడుతున్నారు? ఆరా తీస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో కోటంరెడ్డి టీడీపీలోకి వెళ్తారనే ప్రచారం జరుగుతోంది. రెండుసార్లు ఫ్యాన్ గుర్తుకు ఓటేశామని.. ఈసారి సైకిల్‌కి వేయాల్సి వస్తుందేమో అని కోటంరెడ్డి అనుచరులు చెవులు కొరుక్కుంటున్నారట. తాజా ఎపిసోడ్ తర్వాత కోటంరెడ్డి కామెంట్స్‌పై ఏ విధంగా స్పందించాలనే దానిపై పార్టీలో చర్చ జరుగుతోందట. జిల్లా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో పాటు జిల్లా వైసీపీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పార్టీ పెద్దలు చర్చించారట. ఆ చర్చల సారాంశాన్ని సీఎం జగన్ దగ్గర పెట్టి తుది నిర్ణయం తీసుకుంటారని టాక్. నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి కూడా వైసీపీ అదనపు సమన్వయకర్తను నియమించే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరి.. కోటంరెడ్డి ఎపిసోడ్‌కు ఎండ్ కార్డు ఎలా పడుతుందో చూడాలి.