Off The Record: ఎమ్మెల్యేలూ…. మీరు మారాలి. పనితీరు మార్చుకోవాలి. ఏపీ సీఎం చంద్రబాబు టీడీపీ శాసనసభ్యులతో పదే పదే చెబుతున్న మాటలివి. కొందరికి జనరల్‌గా చెప్పారు. ఇంకొందర్ని ప్రత్యేకంగా పిలిపించి క్లాస్ పీకారు. మీరు మారకుంటే… నేను మారిపోతానని కూడా వార్నింగ్ ఇచ్చేశారు. అయితే… అంత చెప్పినా ఇప్పటికీ ఇంకొందరిలో మార్పు రాలేదట. ఆ…. ఏముందిలే…. ఆయన అలాగే చెబుతుంటారు. మనం చేసేవి చేసుకుంటూ పోదామని భావిస్తున్న ఎమ్మెల్యేలకు ఇప్పడిక షాకులివ్వడం మొదలైపోయిందట. నేను 95 సీఎంని అవుతానంటూ ఇప్పటికే పలుమార్లు చెప్పిన చంద్రబాబు ఇప్పుడు నిజంగానే… యాక్షన్‌లోకి దిగినట్టు చెప్పుకుంటున్నాయి టీడీపీ వర్గాలు. బోర్డర్‌లైన్ దాటుతున్న వారికి ఇప్పటి వరకు మాటలతోనే సరిపెట్టిన టీడీపీ అధ్యక్షుడు ఇప్పుడిక కత్తికి పదును పెడుతున్నారట. ఆ దెబ్బకు కొంతమంది ఎమ్మెల్యేల పవర్ కట్ అవుతోందని, కొందరికి ఆ విషయం తెలియకుండానే కత్తిరింపులు జరిగిపోతున్నాయని గుసగుసలాడుకుంటున్నారు పార్టీ లీడర్స్. పార్టీ శాసనసభ్యులు పెడసరంగా ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో ఆల్రెడీ యాక్షన్ స్టార్ట్ అయిపోయిందట. అలాంటి చోట్ల ఎమ్మెల్యే ప్రమేయం లేకుండానే టీడీపీ మండల కమిటీల్ని నియమించేస్తున్నట్టు తెలుస్తోంది.
అలాగే ప్రతి విషయంలోనూ సదరు శాసనసభ్యుడిని నామమాత్రం చేసే కార్యక్రమం కూడా గట్టిగానే జరుగుతున్నట్టు చెబుతున్నారు. ఇక మాటల్లేవ్… మాట్లాడుకోవడాల్లేవ్… అన్నట్టు కామ్‌గా జరిగిపోతున్న ఈ వ్యవహారాలతో ఎమ్మెల్యే పవర్ ఆటోమేటిక్‌గా కట్ అయిపోతుందని, కేకలు పెట్టాల్సిన అవసరం లేదని మాట్లాడుకుంటున్నాయి టీడీపీ వర్గాలు. కృష్ణా జిల్లాలో అత్యంత వివాదాస్పదంగా మారిన ఓ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి ఇప్పటికే పవర్ కట్ మొదలయిందట. కమిటీ నియామకంలో ఆయన మాట చెల్లుబాటవకపోవడం, వేరే ఇన్ఛార్జ్‌ని నియమించడం, నియోజకవర్గంలో కొత్త ఇన్ఛార్జ్ చెప్పిన మాట చెల్లుబాటు అయ్యేలా చూడడం లాంటి కార్యక్రమాలతో మాట వినని వాళ్ళని ఉత్స విగ్రహాల్లాగే మిగల్చబోతున్నట్టు సమాచారం. అలాగే… అధికార వర్గాల్లో సైతం ఆ ఎమ్మెల్యే మాట చెల్లుబాటవకుండా, ఇన్ఛార్జ్ మాట మాత్రమే ఆఫీసర్స్ వినేలా అనధికారిక ఆదేశాలు సైతం ఉంటాయట. ఇన్ని చర్యలు తీసుకున్నా…. దారికి రానివారి విషయంలో చర్యలు ఇంకొంచెం ఎక్కువగానే ఉండవచ్చన్నది టీడీపీ వర్గాల టాక్. ఇప్పటికే ఎమ్మెల్యేల పనితీరుపై రోజు వారీ నివేదికలు సిద్ధమవుతున్నాయి. అందుకోసం ప్రత్యేక నిఘా వ్యవస్థ ఏర్పాటైందట.దాంతో పాటు ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ కూడా పని చేస్తున్నట్టు తెలిసింది. ఎమ్మెల్యేలు ఎవరెవరు అవినీతి కార్యక్రమాల్లో బాగా…. బిజీగా ఉన్నారు. ఎవరు మాఫియాలు నడుపుతున్నారన్న వాటికి సంబంధించి పార్టీ పెద్దల దగ్గర డిటైల్డ్ రిపోర్ట్స్ ఉన్నట్టు చెప్పుకుంటున్నాయి టీడీపీ వర్గాలు.
ఇక మాటల పార్ట్ అయిపోయిందని, పదే పదే చెప్పడం కన్నా… నివేదికల ఆధారంగా యాక్షన్‌లోకి దిగడం మంచిదని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది. తొలిగా… మరీ అడ్డగోలు వ్యవహారాల్లో మునిగి తేలుతున్న వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే… మిగతా వాళ్ళు ఆటోమేటిక్‌గా సెట్ అవుతారని, అలా అవ్వని వాళ్ళను ఉపేక్షించకుండా నెక్స్ట్ లెవల్‌లో చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం 20 మంది టీడీపీ ఎమ్మెల్యేలు విపరీతమైన దందాల్లో మునిగి తేలుతున్నారన్నారన్న నివేదికలతో వాళ్ళని రెడ్ జోన్‌లో పెట్టి యాక్షన్ మొదలుపెట్టబోతున్నట్టు తెలిసింది. చర్యల దిశగా ఇస్తున్న లీకులు, జరుగుతున్న చర్చలతోనైనా డేంజర్ జోన్‌లోని వాళ్ళు మారతారా? లేక అలాగే ఉండిపోతారా అన్న పరీక్ష ప్రస్తుతం జరుగుతోందట. ఈ టెస్ట్‌లో పాసైన వాళ్ళ మీద యాక్షన్ ఆగుతుందని, లైట్ తీసుకున్నవాళ్ళ మీద నెక్స్ట్ లెవల్ ఉంటుందని చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యేల్ని ఇలాగే ఉపేక్షిస్తే… మొత్తం ప్రభుత్వానికే చెడ్డపేరు వచ్చి మొదటికే మోసం జరుగుతుందని గ్రహించిన సీఎం…పూర్తి ప్రక్షాళన దిశగా అడుగులేస్తున్నారన్నది టీడీపీ వాయిస్.