Off The Record: అనకాపల్లి జిల్లా కూటమి ఎమ్మెల్యేల్లో అసంతృప్తి అగ్నిపర్వతంలా మారుతోంది. అధికారంలోకి వచ్చిన మొదట్లో ఫుల్ జోష్‌గా కనిపించిన శాసనసభ్యుల్లో మెల్లిగా నిర్లిప్తత పెరుగుతున్నట్టు కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. జిల్లాలో తమ మాట చెల్లక…ఆవేదన చెప్పుకునే మార్గం కనిపించక, సీనియర్ ఎమ్మెల్యేలంతా మౌనమే బెటర్ అన్న అభిప్రాయానికి వస్తున్నారట. ఒకప్పుడు జిల్లా అంతటా ఏం జరుగుతోందో ఆరా తీసి పెద్దలుగా పార్టీల పటిష్టానికి తమ సలహాలు ఇచ్చినవాళ్ళు కూడా ఇప్పుడు గిరి గీసుకుని నియోజకవర్గ హద్దు దాటడం లేదు. ఫలితంగా… టీడీపీ, జనసేన కేడర్‌లో గతంలో కనిపించిన ఉత్సాహం మిస్ అయ్యిందన్న టాక్ బలపడుతోంది. సీనియర్ శాసనసభ్యుల్లో గూడుకట్టుకుపోతున్న ఆవేదనే అందుకు కారణంగా చెప్పుకుంటున్నారు. ఓ వైపు అధికారం వుండి కూడా రాజకీయ ఉక్కపోతను ఎదుర్కొంటుండగా… మరోవైపు మంత్రుల వైఖరి ఇంకా మంటెక్కిస్తోందట.
అనకాపల్లి జిల్లా మొత్తం కూటమి చేతుల్లోనే వుంది. ఎంపీ స్ధానాన్ని బీజేపీ గెలుచుకుంటే…. జనసేనకు ముగ్గురు, టీడీపీకి నలుగురు ఎమ్మెల్యేలు వున్నారు. నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు స్పీకర్ కాగా… పాయకరావుపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వంగలపూడి అనిత హోం మంత్రి. మిగిలిన ఎమ్మెల్యేలు కూడా పొలిటికల్ ఎక్స్‌పీరియెన్స్ ఉన్నవాళ్ళే. మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి, అనకాపల్లి శాసనసభ్యుడు కొణతాల రామకృష్ణ ఉమ్మడి రాష్ట్రంలోనే మంత్రులుగా పనిచేశారు. చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల చట్టసభకు ఎన్నికవడం ఇది మూడోసారి. హుందాగా రాజకీయాలు చేస్తారన్న పేరు కూడా ఉంది. అయితే…. ఇప్పుడు ఈ సీనియర్స్ అంతా… జిల్లాకు చెందిన, వచ్చి పోతున్న మంత్రుల వ్యవహారశైలిపై తీవ్ర అసహనంతో రగిలిపోతున్నట్టు తెలుస్తోంది. తమ మాటకు విలువ దక్కడం లేదని, కనీసం ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరయ్యేప్పుడైనా కలుపుకుని వెళ్దామన్న ఆలోచన మంత్రులకు లేకుండా పోతోందంటూ సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఏదో… ప్రోటోకాల్ ఇవ్వాలి కాబట్టి జిల్లా యంత్రాంగం నుంచి ఒక మెస్సేజ్ పెడుతున్నారుతప్ప… కాస్త సుహృద్బావ వాతావరణం, కలుపుకుని పోవడం లాంటి వ్యవహారాలేవీ మంత్రుల్లో ఉండటం లేదన్నది సీనియర్ ఎమ్మెల్యేల ఆవేజన. జిల్లా ఇన్చార్జ్ మంత్రి సహా ఎవరైనా అమాత్యుల పర్యటనలు వున్నప్పుడు సంబంధిత జిల్లాలో ఉన్న సీనియర్స్‌కు సమాచారం ఇవ్వడం, వ్యక్తిగతంగా మాట్లాడటం వంటి సాంప్రయాలు గతంలో వుండేవి. పర్యటనల ప్రారంభానికి ముందు అందరు కలిసి మాట్లాడుకోవడం… కలిసే ప్రోగ్రామ్‌కు వెళ్ళడం లాంటివి జరుగుతుండేవి.
కానీ… ఇప్పుడు మంత్రుల పర్యటనలు, కార్యక్రమాలకు ప్రోటోకాల్ పిలుపులు తప్ప… ఆత్మీయ ఆహ్వానాలు అందడం లేదట. వాళ్ళిష్టం వస్తే వస్తారు, లేకుంటే లేదనే ధోరణి కారణంగా ఇటీవల సీనియర్ శాసనసభ్యులు చిన్నబుచ్చుకుంటున్నట్టు తెలుస్తోంది. కొత్త సంవత్సరంలో జరిగిన రెండు ఘటనల్నే ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. ఒకటి అడ్డరోడ్ జంక్షన్‌లో కొత్త రెవెన్యూ సబ్ డివిజన్ ఏర్పాటు అయితే మరొకటి అనకాపల్లి ఆర్డీవో కార్యాలయ నూతన భవన ప్రారంభోత్సవం. ఇందులో అనకాపల్లి ఆఫీస్ ఓపెనింగ్‌కు మంత్రులు అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, అనిత హాజరయ్యారు. అంతకు ముందు అడ్డరోడ్ ఆర్డీవో ఆఫీసును మంత్రులు విజిట్ చేశారు. జిల్లా అభివ్రుద్ధికి సహకరిస్తున్నందుకు మంత్రులకు అభినందన సభలు జరిగాయి. కానీ అక్కడ ఎమ్మెల్యేల అటెండెన్స్ లేదు. అడ్డరోడ్డు ఆర్డీవో పరిధిలోకి యలమంచిలి నియోజకవర్గంలోని కీలక మండలాల్ని తీసుకురావడాన్ని వ్యతిరేకించిన ఎమ్మెల్యే విజయ్ కుమార్ ముందు నుంచి టచ్ మీ నాట్ అన్నట్టుగానే ఉన్నారు. ఇక అనకాపల్లి ఆర్డీవో పరిధి మాడుగుల, పెందుర్తి, చోడవరం, యలమంచిలి, అనకాపల్లి సెగ్మెంట్స్‌లో ఉండగా… కార్యాలయ ప్రారంభోత్సవానికి మంత్రులతో పాటు వెళ్ళింది ఒక్క కొణతాల రామకృష్ణ మాత్రమే. మిలిగిన ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో ఉండి కూడా ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. ఇన్చార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా మంత్రి అనిత కూడా సాంప్రదాయాలకు తిలోదకాలు ఇవ్వడం ఖచ్చితంగా నెగెటివిటీని పెంచుతుందంటూ కోపంగా ఉన్నారట సీనియర్స్. వాళ్ళంతా కూడబలుక్కునే కార్యక్రమాన్ని బహిష్కరించారన్న చర్చ సైతం ఉంది.
అలాగే… ఇటీవల జరిగిన జిల్లా పార్టీ అధ్యక్షుడి నియామకం, అంతకు ముందు ఎదుర్కొన్న వ్యక్తిగత ఇబ్బందుల్ని కూడా ఇప్పుడు తెర మీదికి తెస్తున్నారు సీనియర్స్. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా తాతయ్య బాబును తిరిగి నియమించడం ఎమ్మెల్యే కేఎస్ఎన్ ఎస్ రాజుకు ఇష్టం లేదు. ఇక సీఐ పోస్టింగ్ వ్యవహారంలో మాట చెల్లనందుకు గన్ మెన్‌ను సరెండర్ చేశారు పెందుర్తి ఎమ్మెల్యే రమేష్ బాబు. ఇవన్నీ బయటపడిన వ్యవహారాలు….ఇవి కాకుండా నియోజకవర్గ స్ధాయిలో అంతర్గత సమస్య లు…, పరిష్కారం మార్గం దొరకని ఇష్యూస్ చాలానే వుంటున్నాయట. అసలే పరపతి పనిచేయలేదని మథనపడుతుంటే ఇప్పుడు మంత్రులు కూడా పట్టీపట్టనట్టు వ్యవహరిస్తుండటంతో ఎమ్మెల్యేలు చింతనిప్పులు తొక్కినట్టు కనిపిస్తున్నారన్నది అనకాపల్లి వాయిస్. అందుకే మీరు మాకెంత దూరమో….మేం మీకూ అంతే దూరమంటూ….అర్ధమయ్యేలా చెప్పేందుకు అధికారిక కార్యక్రమాలకు హాజరవ్వడ మానేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఈ పెద్దోళ్ళ వేదనకు అధినాయకత్వం ఎలాంటి పరిష్కారం చూపిస్తుందో మరి.