కాంగ్రెస్‌కు తాము దూరంగా ఉన్నామని చెప్పడానికి TRS నానా తంటాలు పడుతోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల కూటమి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకి మద్దతు ఇచ్చిన TRS… అదే కూటమిలో ఉన్న కాంగ్రెస్‌కి తాను దూరమని ఒకటికి పదిసార్లు చెబుతోంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ దగ్గరనే భావన రాబోయే ఎన్నికల్లో చేటు చేస్తుందని గులాబీ నేతల అంచనా. లోలోపల ఎలాంటి సంబంధాలున్నా.. పైకి మాత్రం బీజేపీ, కాంగ్రెస్ రెండూ తమకు ఒకటే అనే వాదన వినిపిస్తోంది టీఆర్‌ఎస్. అసెంబ్లీ ఎన్నికల వరకు ఇదే వాదన ఉంటుందేమో?
బీజేపీయేతర, కాంగ్రెస్ యేతర ప్రత్యామ్నాయం అన్నది సీఎం కేసీఆర్ స్లోగన్. జాతీయ పార్టీ ప్రకటన కోసం ఏర్పాట్లు చేసుకుంటున్న టిఆర్ఎస్… ఆ రెండు పార్టీలపై దూకుడుగా అటాక్ చేస్తోంది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్ తోపాటు మెజార్టీ విపక్షాలు ప్రత్యామ్నాయ అజెండాలో కాంగ్రెస్ ఉన్నా అభ్యంతరం లేదనే అభిప్రాయంతో ఉన్నాయి. టిఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం కాంగ్రెస్ లేని…బిజెపి లేని రాజకీయ ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారు.
పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేశారు. 22 పార్టీల అధ్యక్షులు, ముఖ్యమంత్రులను సమావేశానికి ఆహ్వానించారు. కాంగ్రెస్‌ను కూడా పిలిచారన్న కారణంతో ఈ సమావేశానికి వెళ్లడం లేదని కేసియార్ ప్రకటించారు. పార్టీ నుంచి కనీసం ప్రతినిధిని కూడా పంపలేదు. తమను చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరికాదని తప్పుపట్టారు. తెలంగాణలో కాంగ్రెస్ తమకు ప్రధానపోటీ అని…రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి తమ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేశారని ఆరోపించారు. అందుకే తాము మమతా బెనర్జీ సమావేశానికి వెళ్ల లేదని ప్రకటించారు.
యశ్వంత్ సిన్హాను విపక్షాల అభ్యర్థిగా నిర్ణయించిన రోజు టీఆర్ఎస్ కూడా మద్దతు ఇస్తుందని శరద్ పవార్ ప్రకటించారు. తాను కేసీఆర్‌తో మాట్లాడానని.. మద్దతు ఇస్తున్నట్టు చెప్పారు. ఆ తర్వాత ఇప్పటిదాకా టీఆర్‌ఎస్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. సియం కేసియార్ ఆ నామినేషన్ కార్యక్రమానికి వెళ్లకుండా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కొందరు పార్టీ ఎంపీలను పంపారు. నామినేషన్ సమయంలో రాహూల్ గాంధీకి వీలైనంత దూరంగా ఉండే ప్రయత్నం చేశారు టిఆర్ఎస్ నేతలు. ఆ తర్వాత విపక్షాల మీడియా సమావేశంలో కూడా టీఆర్‌ఎస్ కనిపించలేదు. ప్రత్యేకంగా మీడియాతో మాట్లాడిన కేటీఆర్ అటు బిజెపి ఇటు కాంగ్రెస్ పై అంతేస్థాయిలో ఆరోపణలు గుప్పించారు.
ఇలాంటి సమయంలో చేతులు కలిపితే అసలుకే ఎసరు వస్తుందని టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు ఆందోళన చెందుతున్నాయి. జాతీయ ప్రయోజనాల కోసం భవిష్యత్తులో ఏం జరిగినా … ఇప్పటి మాత్రం కాంగ్రెస్ లేని ప్రత్యామ్నాయమే తమ అజెండా అంటోంది టీఆర్ఎస్ . తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు ఇద్దరినీ సమాన ప్రత్యర్థులుగా ప్రొజెక్ట్ చేస్తేనే ఎన్నికల్లో ఓట్లు చీలిక సాధ్యమవుతుందని టీఆర్‌ఎస్ భావిస్తోంది.