Munugode By Elections :Congress Leaders are ready for by-election candidate in Munugodu..?
మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థి వేట మొదలు పెట్టిందా..? సొంత పార్టీలోని నాయకులు బరిలో ఉంటారా..? లేక పక్కపార్టీ నుంచి నాయకులను తీసుకొస్తారా..? అసలు… కాంగ్రెస్ లెక్క ఏంటి..!?
తెలంగాణ కాంగ్రెస్‌కి మునుగోడు ఉపఎన్నికల సవాల్ గా నిలవనుంది. ఇన్నాళ్లు జరిగిన ఉపఎన్నికలు ఒక ఎత్తు అయితే .. మునుగోడులో ఉపఎన్నిక వస్తే మరింత సవాల్‌గా మారనుంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి మునుగోడు ఎన్నిక పెద్ద సవాల్. రేవంత్‌కే కాదు… కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసరనుంది. రాజగోపాల్ రెడ్డి వ్యవహారం రెండు రోజుల్లో సెట్ చేయాలని డిసైడ్ అయ్యింది. ఓవైపు దారి లోకి తెచ్చే ప్రయత్నం.. ఇంకొకటి పార్టీని సెట్ చేసుకునే పని. పీసీసీ ఇప్పటికే సర్వే చేస్తున్నట్టు సమాచారం. పార్టీకి బలమైన అభ్యర్దిని వెతికే పనిలో పడ్డారు. జిల్లా నాయకులు… పార్టీ బలంగా ఉందని చెప్పినా… ఇప్పుడు మునుగోడు ఉపఎన్నికపై ఎవరు ముందుకు వచ్చే పరిస్థితి లేదట. సీనియర్ నేతలు జిల్లాలో ఉన్నా… జానారెడ్డికి అందరినీ కో ఆర్డినేట్ చేసి పని అప్పగించారు.
మునుగోడు ఉపఎన్నిక వేస్తే బీజేపీ నుంచి రాజగోపాల్‌రెడ్డి, టీఆర్ఎస్ నుంచి రెడ్డి సామాజికవర్గం అభ్యర్థే బరిలో ఉంటారని.. కాంగ్రెస్ అభిప్రాయ పడుతోంది. అదే జరిగితే బీసీ అభ్యర్థిని పోటీలో పెట్టాలని కాంగ్రెస్ ఆలోచిస్తోందట. బీసీ ఓటు బ్యాంక్ మునుగోడులో ఎక్కువ. కానీ రెడ్డి సామాజికవర్గం డామినేషన్ ఉంటుంది. కాంగ్రెస్‌లో ఉన్న బీసీ నాయకులలో ఎవరి బలం ఎంతో లెక్క తీస్తోందట. కాంగ్రెస్‌లో బీసీ సామాజిక వర్గం నుండి… టీఆర్ఎస్, బీజేపీలను ఎదుర్కొనే నాయకుడు ఉన్నారా..? ఆర్థికంగానూ సత్తా చాటగలరా? అనేది ప్రశ్న. కాంగ్రెస్‌లో ఉన్న నాయకుల పేర్లను పరిశీలించడంతో పాటుగా… ఇతర పార్టీలలో ఉన్న బీసీ నాయకుల కోసం వేట మొదలు పెట్టినట్టు సమాచారం.
సొంత పార్టీ లో జర్నలిస్ట్ నాయకుడు పల్లె రవి, అధికార ప్రతినిధి కైలాష్ నేతలు ఉన్నారు.. వీరికి తోడుగా మునుగోడు నియోజక వర్గంలో అధికార పార్టీ కి చెందిన ఇద్దరు బీసీ నాయకులతో కాంగ్రెస్ నాయకత్వం టచ్ లో ఉందట. ఇందులో ఒకరు మునుగోడు నియోజకవర్గం నాయకుడు కాగా… ఇంకొకరు గౌడ సామాజిక వర్గానికి చెందిన నేత. ఆ ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేసే అవకాశం ఉందట.
అయితే సొంత పార్టీలో నాయకులను కాదని … పొరుగుపార్టీ నాయకులను తెచ్చుకుంటారా..? కాంగ్రెస్‌లో చేరడానికి అధికార పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారా..? అనేది తేలాలి. మరి.. కాంగ్రెస్ అభ్యర్థి వేటలో ఎలాంటి వైఖరి అనుసరిస్తుందో చూడాలి.