Munugode By Election :
మునుగోడులో టిఆర్ఎస్ ఆశావహుల సంఖ్య పెరుగుతోందా?టికెట్లు ఆశించి భంగపడిన వారిని పార్టీ ఎలా బుజ్జగించబోతోంది?హైకమాండ్ ఆదేశాలకు అసంతృప్త నేతలు కట్టుబడి ఉంటారా?
మునుగోడు ఉపఎన్నిక కోసం టిఆర్ఎస్ కసరత్తు మొదలు పెట్టింది. ఒకవైపు నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని అంచనా వేసి…గెలుపు కోసం ఏం చేయాలో దృష్టి పెట్టింది. అభ్యర్థి ఎంపికపైనా కసరత్తు మొదలు పెట్టిన గులాబీ పార్టీ…త్వరలో నిర్ణయం ప్రకటించడమే మిగిలి ఉన్నట్టుగా తెలుస్తోంది.
మునుగోడు ఉప ఎన్నికలో పోటీ కోసం పలువురు ఆశావహులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరి స్థాయిలో వారు టికెట్ కోసం లాబీయింగ్ చేస్తున్నారు. ఒక వేళ ఇందులో ఒకరికి అవకాశం ఇస్తే మిగిలిన వారి విషయంలో టిఆర్ఎస్ ఏం చేస్తుంది అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
మునుగోడు ఉపఎన్నిక అభ్యర్థి ఎంపికపై టిఆర్ఎస్ ఒక అభిప్రాయానికి వస్తున్నట్టు తెలుస్తోంది.కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి నివేదికలు అనుకూలంగా ఉన్నాయని టిఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకవేళ అదే జరిగితే…మిగిలిన ఆశావహులను ఎలా బుజ్జగిస్తారా?లేక లైట్ తీసుకుంటారా?అనే చర్చ జరుగుతోంది. హుజురాబాద్ ఉపఎన్నిక సమయంలో రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవుల భర్తీ చేపట్టింది టిఆర్ఎస్.ఆశావహుల్లో ముగ్గురు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. మరొకరు కంచర్ల భూపాల్ రెడ్డి సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు. మాజీ ఎమ్మెల్సీ ప్రభాకర్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, కర్నాటి విద్యాసాగర్ టికెట్ కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మరి ఈ నేతల విషయంలో టిఆర్ఎస్ ఎలాంటి వైఖరి తీసుకుంటుందన్నదే ఆసక్తికరంగా మారింది. కేవలం వీరందరినీ బుజ్జగించి వదిలేస్తారా?లేక ఏవైనా పదవులు కట్టబెడతారా?అన్నది చూడాల్సి ఉంది.
అభ్యర్థి ప్రకటనకు ముందే ఆశావహులను టిఆర్ఎస్ బుజ్జగిస్తుందా?పరిస్థితిని బట్టి ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటుందా? అనేది చూడాల్సి ఉంది.