సుబ్రహ్మణ్యం మృతి కేసులో ఎమ్మెల్సీ అనంత బాబు హంతకుడని వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. రాష్ట్రమంతా ఈ వ్యవహారం గందరగోళంగా మారినా, ఎమ్మెల్సీ లైట్ తీసుకున్నారు. ఆందోళనలు మరింత తీవ్రమయ్యాయి. చివరకు ఆయన మెడకే ఉచ్చు బిగుస్తోంది. అయితే, ఇప్పుడు దీని వెనక ఆసక్తికర చర్చ జరుగుతోందట.
ఘటన జరిగినప్పుడు అనంతబాబు ద్వారంపూడిని కాంటాక్ట్ అయ్యారా?అనంత బాబు రెండు పదవులు రావడంలో ద్వారంపూడి కీ రోల్?సమస్య పరిష్కారమైందని అనంతబాబు ఊహించారా?ఎవరూ ఏమి చేయలేని స్థాయికి పరిస్థితులు
ఎమ్మెల్సీ అనంత బాబుకు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడితో మంచి సంబంధాలున్నాయి. ప్రతి చిన్న విషయానికి ఆయన సలహాలు సూచనలు తీసుకుంటూ ఉంటారు. ఈ ఘటన జరిగినప్పుడు కూడా ఎమ్మెల్సీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ని కాంటాక్ట్ అయ్యారట. దానికి ఎమ్మెల్యే కూడా తన స్థాయిలో ప్రయత్నాలు చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ద్వారంపూడికి వైసిపి పెద్దలతో మంచి ర్యాపో ఉంటుంది. బయటకు వచ్చి బహిరంగంగా మాట్లాడలేను గాని ఏం చేయాలో అది చేస్తానని భరోసా ఇచ్చారట.
అనంత బాబు గతంలో డిసిసిబి చైర్మన్ గా పని చేశారు. 2021 లో ఆయన ఎమ్మెల్సీ అయ్యారు. రెండు పదవులు రావడంలో చంద్రశేఖర్ రెడ్డి చక్రం తిప్పారనే ప్రచారం అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. ఇంకేముంది అధిష్టానం దగ్గరి వ్యక్తి అంత ధైర్యం ఇవ్వడంతో అనంత బాబు సైతం ఊపిరిపీల్చుకున్నారట. ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్లేనని ఖుషి అయిపోయారట. తీరా సీన్ మొత్తం రివర్స్ అయింది. ఆయన కూడా ఏమి చేయలేని స్థాయికి పరిస్థితులు వెళ్ళిపోయాయి. ఆందోళనలు, నిరసనలు పెరుగుతున్నా, అనంత బాబు మాత్రం పెళ్లిళ్లు పేరంటాలకు తిరిగారు.
సుబ్రహ్మణ్యం మృతి చెందిన తర్వాత రోజు అనంతబాబు ప్రెస్ మీట్ పెట్టడానికి సిద్ధమయ్యారు. తనపై వచ్చేవి కేవలం ఆరోపణలేనని క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చెయ్యాలనుకున్నారట. కానీ దానికి ద్వారంపూడి ససేమిరా అన్నారట. మృతదేహం అక్కడ ఉండగా ఇలా నువ్వు బయటికి రావడం మంచిది కాదని, హితబోధ చేశారట. అయినా తాను అట్నుంచి నరుక్కు వస్తుంటే, నువ్వు ఎందుకు గాబరా పడతావని చెప్పారట ఎమ్మెల్యే. దాంతో ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేసుకున్నారట అనంత బాబు..
ద్వారంపూడి మాటలను లెక్క చెయ్యని అధిష్టానం?పార్టీ కంటే ఎవరూ ముఖ్యం కాదని హైకమాండ్ తేల్చి చెప్పిందా?
తన పరిధి దాటి పోయిందని ద్వారంపూడి చేతులెత్తేశారా?
ఈ మొత్తం ఎపిసోడ్ ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకుని వెళ్ళడానికి ద్వారంపూడి ప్రయత్నాలు చేశారట. కానీ పార్టీ అధినాయకత్వం మాత్రం చంద్రశేఖర్ రెడ్డి చెప్పిన వాటిని పట్టించుకోలేదట. అక్కడితో ఊరుకుంటే పర్లేదు. మీరు కూడా బహిరంగంగా ఎటువంటి కామెంట్స్ చేయొద్దని చెప్పారట. పార్టీ కంటే ఎవరూ ముఖ్యం కాదని తేల్చి చెప్పారట. పార్టీ బాగుంటేనే అందరూ బాగుంటారని, వ్యక్తుల కోసం వ్యవస్థను నాశనం చేయలేమని అన్నారట. అయినా ఈ విషయంలో పార్టీకి ఒక లైన్ ఉందని అనవసరంగా లేనిపోని తలనొప్పులు తెచ్చి పెట్టొద్దని అన్నారట. దాంతో ద్వారంపూడి సైలెంట్ అయిపోయారట. ఏమైనా ఉంటే వ్యక్తిగతంగా చేయగలను గాని, తన పరిధి దాటి పోయిందని చేతులెత్తేసారట ద్వారంపూడి. ఏదో జరుగుతుంది అనుకున్న అనంత బాబు చివరకు నిరాశ చెందారట.