ఎంపీ కేశినేని నాని వ్యవహారం సెట్ అయినట్టేనా? టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన ఆయన.. చంద్రబాబు దీక్షకు వెళ్లి.. ఎలాంటి సంకేతాలు ఇచ్చారు? మళ్లీ పార్టీలో యాక్టివ్ అవుతారా? అలకలు ఎలా దూరం అయ్యాయి? తెరవెనక ఏం జరిగింది?
కేశినేని నాని వ్యవహారం సెట్ అయిందా?
బెజవాడ టీడీపీలో ఎంపీ కేశినేని నాని అలక కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తోంది. 2024 ఎన్నికల్లో పోటీ చేయను.. టీడీపీ కార్యక్రమాలకు.. అధినేత పర్యటనకు దూరంగా ఉంటానని చెప్పి చర్చగా మారారు. వారం క్రితమే తన ఆఫీస్‌లో ఒక ఫొటో మార్పు రచ్చ రచ్చ అయింది. ఇంతలోనే చంద్రబాబు దీక్ష దగ్గరకు వెళ్లి అధికార పక్షానికి సవాళ్లు విసిరారు కేశినేని. వారంలోనే ఈ మార్పు ఏంటి? నాని వ్యవహారం పార్టీలో సెట్ అయినట్టేనా అని టీడీపీ వర్గాల్లో చర్చగా మారింది.
టీడీపీ చేస్తున్న యుద్ధానికి అండగా ఉంటానని ప్రకటన..!
విజయవాడ టీడీపీలో కుమ్ములాటలకు చెక్ పెట్టడానికి చాలా రోజులుగా అధిష్ఠానం ప్రయత్నించినా పెద్దగా ఫలితం ఇవ్వలేదు. సోషల్ మీడియాలో ఓ వర్గం చేసిన తప్పుడు ప్రచారంతో వివాదం మరింత పెద్దది అయ్యింది. తాజాగా టీడీపీ ఆఫీస్‌పై దాడి విషయంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్న కేశినేని నాని ముందుగా స్పందించడానికి అంగీకరించలేదట. తిరుమలలో మీడియా కదిలించినా.. ఆలయం దగ్గర రాజకీయాలు ఎందుకు అని తప్పించుకున్నారు. ఆ తర్వాత నాని నుంచి ప్రకటన కానీ.. స్పందన కానీ రాలేదు. సడెన్‌గా చంద్రబాబు దీక్ష దగ్గర ప్రత్యక్షమయ్యారు కేశినేని. అధినేతతో మాటలు కలిపారు. పదునైన వ్యాఖ్యలతో వైసీపీపై విరుచుకుపడి.. టీడీపీ చేస్తున్న యుద్ధానికి అండగా ఉంటానని తేల్చి చెప్పారు.
ఓ మాజీ ఎమ్మెల్యే.. మరో ముఖ్యనేత మంతనాలు ఫలించాయా?
కేశినేని నాని ఎలా కూల్ అయ్యారన్నది ఇప్పుడు ప్రశ్న. గుంటూరు జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యేతోపాటు.. పార్టీ కార్యాలయ వ్యవహారాలు పర్యవేక్షిస్తూ ముఖ్య నేతగా ఉన్న మరో నాయకుడు ఎంపీ నానితో జరిపిన మంతనాలు ఫలించినట్టు తెలుస్తోంది. అన్నీ సమసిపోవాలంటే బాబు దీక్షా వేదికే కరెక్ట్ అని ఆ నాయకులు చెప్పడంతో నాని కదిలినట్టు సమాచారం. అన్నీ తర్వాత మాట్లాడుకుందాం.. ముందు దీక్షకు రావాలని గట్టిగా కోరడంతో నాని కాదనలేకపోయారట. పార్టీ నుంచి ప్రత్యేకంగా ఒక బృందం చర్చించడం.. సీనియర్ నేతల చర్చల ఫలితంగానే ఇది సాధ్యమైనట్టు పార్టీవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
టీడీపీలోని నాని ప్రత్యర్థివర్గం స్పందన ఏంటి?
కేవలం చంద్రబాబు దీక్షకు వచ్చి సైలెంట్ కాకుండా.. మరుసటి రోజు జరిగిన టీడీపీ ముఖ్యనేతల మీటింగ్‌కు కూడా వచ్చారు కేశినేని నాని. దాంతో నాని అంశం సెటిల్ అయిందని అనుకుంటున్నారట. మరి.. 2024 ఎన్నికల్లో పోటీ చేస్తారో లేదో కానీ.. పార్టీ కార్యక్రమాల్లో ఇకపై చురుకుగా పాల్గొంటారని సమాచారం. అయితే ఇప్పుడు బెజవాడ టీడీపీలోని నాని ప్రత్యర్థివర్గం ఏం చేస్తుందా అన్నది ఉత్కంఠగా మారింది. అందరి దృష్టీ బుద్దా వెంకన్న, బొండా ఉమాలపై నెలకొంది. మరి.. ఏం జరుగుతుందో చూడాలి.