తెలంగాణలో సీనియర్ పొలిటీషియన్లలో ఆయనొకరు..నాలుగుసార్లు అసెంబ్లీకి వెళ్లినా,ఆయనకు దక్కిన పదవులు మాత్రం పెద్దగా లేవనే చెప్పాలి.ఎప్పటికప్పుడు ఆ పదవి, ఈ పదవి అని ఊహాగానాలు తప్ప ఒరుగుతున్నదేమీలేదు..ఆఖరికి ఇంత హైప్ మీద కారెక్కిన తర్వాత..ఇంకా వెయిటింగ్ లిస్టు తప్పదా అనే టాక్ నడుస్తోంది.
మోత్కుపల్లి నర్సింహులు తెలంగాణలో సీనియర్ రాజకీయ నాయకుల్లో ఒకరు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు రాజకీయాల్లో దక్కిన పదవులు మాత్రం పెద్దగా లేవనే చెప్పాలి. ఎనభైల్లోనే పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చి, ఆలేరు నుండి పోటీ చేసి చిన్న వయస్సులోనే ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఆ తర్వాత కాంగ్రెస్ లో మళ్లీ టిడిపిలో చేరారు. రాష్ట్ర విభజన తర్వాత పరిణామాల్లో టిడిపి నుండి బిజెపి లో చేరిన ఆయన్ని అక్కడా ఎవరూ పట్టించుకోలేదు.
అంతకుముందు ఏపీలో టిడిపి సర్కారు ఉన్న సమయంలో మోత్కుపల్లికి గవర్నర్ పదవి రానుందనే ప్రచారం ముమ్మరంగా నడించింది. కానీ, అదీ జరగలేదు. ఓ దశలో మోత్కుపల్లి టిడిపి, బిజెపిల్లో ఉన్నా తెలంగాణ సర్కారు గురించి పాజిటివ్ కామెంట్స్ చేస్తూ వచ్చారు. దళిత బంధు పథకం అమలుపై, కెసీఆర్ పై అపారమైన నమ్మకాన్ని ప్రదర్శిస్తూ వచ్చిన అయిన, చివరికి హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో కేసీఆర్ సమక్షంలో గులాబి కండువా కప్పుకున్నారు. మోత్కుపల్లికి తెలంగాణ రాజకీయాల్లో చాలా అనుభవం ఉందని, ఆయన సేవలు పార్టీకి వినియోగించుకుంటామని కూడా కెసీఆర్ చెప్పారు. అప్పటి నుంచి టిఆర్ఎస్ పార్టీ మోత్కుపల్లి నర్సింహులుకు ఏదో ఒక పదవి కట్టబెడుతుందన్న చర్చ జరిగింది . ఆ పదవి ఆయన సీనియారిటీకి తగ్గట్టుగా పదవి ఉంటుందా అన్న చర్చ గులాబి వర్గాల్లో జరిగింది.
అయితే అనుకున్న అంచనాలు రివర్సయ్యాయా? టిఆర్ఎస్ లో చేరిన మోత్కుపల్లి నర్సింహులుకు పదవి యోగం ఉందా ? లేదా? అధికార పార్టీలోకి వచ్చిన తర్వాత ఏదో ఒక పదవి దక్కుతుందన్న వాదనలు ఎందుకు నిజం కాలేదు ? మోత్కుపల్లి తన నంబర్ కోసం ఇంకా వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉందా ? అనే ప్రశ్నలు టియ్యారెస్ శ్రేణుల్లో వినిపిస్తున్నాయి.
టిఆర్ఎస్ లో చేరిన మోత్కుపల్లి నర్సింహులు ఆ తర్వాత పలుమార్లు సీఎం కేసీఆర్ కార్యక్రమాల్లో కనిపించారు. మోత్కుపల్లికి పదవిపై తరచు చర్చ జరుగుతూనే ఉంది. అటు నర్సింహులు సన్నిహితులు కూడా తమ నేతకు
మంచి పదవే దక్కుతుందన్న ఆశతోనే ఉన్నారట. తాజాగా ప్రగతి భవన్ లో జరిగిన అంబేద్కర్ జయంతి సందర్భంగా అక్కడ జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు మోత్కుపల్లి నర్సింహులు. దీనితో మరోసారి ఆయన రాజకీయ భవిష్యత్ పై మరొకసారి చర్చ మొదలైంది. అదే సమయంలో కేసీఆర్ తో మోత్కుపల్లి భేటీ అయ్యారన్న చర్చ గులాబి వర్గాల్లో జరుగుతోంది.
ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి సుదీర్ఘ కాలంలో రాజకీయాల్లో ఉన్న మోత్కుపల్లికి పదవిపై ఎప్పటికప్పుడు ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి. దళిత బంధు కార్యక్రమం అమలు కోసం చైర్మన్ పదవి అని కొంతకాలం, ఆ తర్వాత యాదాద్రి టెంపుల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ అని మరికొంత కాలం చర్చ జరిగింది. అయితే కాలయాపన జరగటమే తప్ప, ఆయనకు ఏ పదవి దక్కింది మాత్రం లేదు. ఇప్పుడు మళ్లీ ఆయన విషయం తెరపైకి వచ్చింది. అయితే, ప్రస్తుతం ఇప్పటికిప్పుడు రాజ్యసభ మినహా వేరే పదవులు ఏవి ఖాళీగా లేవు. దీంతో నరసింహులుకు అసలు పదవి యోగం ఉందా లేదా అనే డిస్కషన్ కూడా మొదలైంది.
Watch Here :https://youtu.be/I7vcK6gYxss