ఆయనో సీనియర్ నాయకుడు. ఆ జిల్లాలో ఒకానొక సమయంలో చక్రం తిప్పారు కూడా. భవిష్యత్ మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. రాజకీయ జీవితమే క్వశ్చన్ మార్క్‌గా మారిపోయింది. ఉన్నచోట ఇమడలేక.. పాతగూటికి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్టు చర్చ జరుగుతోంది. ఇంతకీ ఎవరా నాయకుడు? ఏమా కథ?
పార్టీ మార్పుపై మరోసారి దృష్టిపెట్టారా?
కొత్తపల్లి సుబ్బారాయుడు. ఉమ్మడి ఏపీలో టీడీపీలో ఓ వెలుగు వెలిగిన నాయకుడు. కౌన్సిలర్ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా.. మంత్రిగా.. ఎంపీగా ఎదిగిన సుబ్బారాయుడు.. ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారో ఆరా తీయాల్సిన పరిస్థితి. తరచూ ఆయన పార్టీలు మారడమే దానికి కారణం. ఒకప్పుడు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పేరు చెబితే కొత్తపల్లి సుబ్బారాయుడు పేరు గుర్తొచ్చేది. అలాంటిది.. అదే నరసాపురంలో ఉనికి కోసం పోరాటం చేయాల్సిన క్లిష్ట పరిస్థితి ఆయనది. ఇప్పుడు సడెన్‌గా చర్చల్లోకి రావడానికి కారణం కూడా.. ఆయన మరోసారి పార్టీ మార్పుపై దృష్టిపెట్టడమేనని సమాచారం.
1989, 1994, 1999, 2004లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపు
1989లో తొలిసారి నరసాపురంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సుబ్బారాయుడు.. 1994, 1999, 2004, ఎన్నికల్లో సీటును నిలబెట్టుకున్నారు. మధ్యలో 1996లో నరసాపురం లోకసభకు పోటీ చేసి ఎంపీ కావడంతో.. ఆ సమయంలో అసెంబ్లీకి జరిగిన ఉపఎన్నికలో తన తమ్ముడు కొత్తపల్లి జానకిరామ్‌ను ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. 2009లో ప్రజారాజ్యంలోకి వెళ్లిన తర్వాత సుబ్బారాయుడు మారని పార్టీలు లేవన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. 2009లో పీఆర్పీ నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2012లో జరిగిన ఉపఎన్నికలో అదే నరసాపురం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి తిరిగి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో వైసీపీ నుంచి బరిలో దిగి.. టీడీపీ చేతిలో ఓడిపోయారు. టీడీపీ అధికారంలోకి రావడంతో వైసీపీని వీడి సొంత గూటికి వచ్చేశారు. కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అయ్యారు. ఇక 2019 ఎన్నికల సమయంలో మరోసారి జంప్ చేశారు సుబ్బారాయుడు. టీడీపీకి గుడ్‌బై చెప్పి వైసీపీలో చేరారు. ప్రస్తుతం వైసీపీలోనే ఉన్నారు. అయితే అక్కడ సరైన గుర్తింపు లేదనే ఆవేదనలో ఉన్నారట మాజీ మంత్రి.
సుబ్బారాయుడును వైసీపీలో పట్టించుకోవడం లేదట!
ప్రస్తుతం నరసాపురం ఎమ్మెల్యేగా వైసీపీకి చెందిన ప్రసాదరాజు ఉన్నారు. ఒకప్పుడు ఆయన చేతిలోనే సుబ్బారాయుడు ఓడిపోయారు. ఆ సమయంలో ప్రసాదరాజు కాంగ్రెస్ నుంచి గెలిచారు. ఇప్పుడు ఇద్దరూ ఒకే పార్టీలోఉన్నా.. పాత రాజకీయ వైషమ్యాలు మర్చిపోలేకపోతున్నారో.. లేక కలిసి నడవలేకపోతున్నారో కానీ పొసగడం లేదన్నది ఓపెన్ టాక్. సుబ్బారాయుడు మాటను వైసీపీలో పట్టించుకునేవారే లేరట. రెండుసార్లు మంత్రిగా చేసిన తాను.. ఇప్పుడు మున్సిపాలిటీలో అనుచరుడికి ఒక కోఆప్షన్ పదవి కూడా ఇప్పించుకోలేకపోతున్నానని వాపోతున్నారట. ఒకప్పుడు కనుసైగతో శాసించిన ఆయనకు.. ఈ పరిస్థితులు మింగుడు పడటం లేదని సమాచారం.
టీడీపీలోకి వెళ్లిపోదామని అనుచరుల నుంచి ఒత్తిడి?
సీనియర్ నేత అయిన తనను వైసీపీ పక్కన పెట్టేసిందనే బాధలో ఉన్నారట కొత్తపల్లి సుబ్బారాయుడు. ఇదే విషయాన్ని ఈ మధ్య సన్నిహితుల దగ్గర పదే పదే ప్రస్తావిస్తూ బాధపడుతున్నారట. దీంతో ఆయన బాధను చూసిన అనుచరులు గౌరవం, గుర్తింపు లేని చోట ఉండటం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారట. తిరిగి టీడీపీకి వెళ్లిపోదామని చెబుతున్నట్టు సమాచారం. రాజకీయ భవిష్యత్ ఇచ్చిన టీడీపీనే సరైన వేదిక అని.. అక్కడే గుర్తింపు లభిస్తుందని అదేపనిగా సూచిస్తున్నారట. మరి.. అనుచరుల మాట విని కొత్తపల్లి మళ్లీ కండువా మారుస్తారా? కొత్తదారి వెతుక్కుంటారో చూడాలి.