అక్కడ అధికార పార్టీలోనే కుంపట్లు రాజుకున్నాయి. రెండు వర్గాలు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ.. రాజకీయాన్ని రక్తికట్టిస్తున్నాయి. ఎవరు పైచెయ్యి సాధిస్తారో కానీ.. ఢీ అంటే ఢీ అనేలా సొంత పార్టీ నేతల మధ్య పొలిటికల్ సెగలు రేగుతున్నాయి. అదెక్కడో ఈ స్టోరీలో చూద్దాం.
కోదాడ టీఆర్ఎస్ పాలిటిక్స్‌లో ఉన్నట్టుండి వేడి రాజుకుంది. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌కు.. అక్కడ పార్టీ సీనియర్లకు అస్సలు పడటం లేదు. ఎమ్మెల్యేకు మున్సిపల్ ఛైర్పర్సన్ శిరీష దంపతులకు మధ్య తాజాగా ఓ రేంజ్లో ఆధిపత్య పోరాటం మొదలైంది. అంతా టీఆర్ఎస్ నాయకులే అయినప్పటికీ వైరిపక్షాల మాదిరి రాజకీయాలు చేస్తున్నారు. రోజులు గడిచేకొద్ది సమస్య శ్రుతిమించుతుందే తప్ప.. వెనక్కి తగ్గేందుకు ఎవరూ ఆలోచించడం లేదు. దాంతో రేపటి రోజున ఏం జరుగుతుందో కేడర్‌కు అంతుచిక్కడం లేదట.
ప్రస్తుతం కోదాడ మున్సిపాలిటీ కేంద్రంగా గులాబీ శిబిరంలో అగ్గి రాజుకుంది. నిన్న మొన్నటి వరకు కలిసి సాగిన ఎమ్మెల్యే, మున్సిపల్ ఛైర్పర్సన్ భర్త వననర్తి లక్ష్మీనారాయణకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాను లేని సమయంలో మున్సిపల్ సమావేశం నిర్వహించారని ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ కస్సుమంటున్నారట. కోరం లేకపోయినా.. కాంగ్రెస్ కౌన్సిలర్లను రప్పించి సమావేశం నడిపించారనేది ఎమ్మెల్యే ఆరోపణ. అయితే లక్ష్మీనారాయణ వర్గం వాదన మరోలా ఉంది. మున్సిపల్ సమావేశం ఎప్పుడు నిర్వహించాలో.. ఎలా నిర్వహించాలో.. పురపాలక సంఘం పరిధిలో అభివృద్ధి పనులపై నిర్ణయం ఛైర్పర్సన్ చేతుల్లో ఉంటుందని.. ఎమ్మెల్యే కాదని చెబుతున్నారట. ఈ విషయంలో రెండువర్గాలు మాటల తూటాలు పేల్చుకుంటున్నాయి.
మున్సిపాలిటీలో కామటి పోస్టుల భర్తీపై వచ్చిన ఆరోపణలు.. ఇతరత్రా అంశాల్లో ఎమ్మెల్యేకు.. వనపర్తి వర్గానికి గ్యాప్ వచ్చినట్టు తెలుస్తోంది. కాకపోతే పార్టీకి ఇబ్బంది కలిగించేలా.. ఎమ్మెల్యేను ఇరకాటంలో పెట్టేలా లక్ష్మీనారాయణ బ్యాచ్ తీరు ఉందనేది మల్లయ్య వర్గం వాదన. పైగా ఈ సమస్యను ఇంతటితో వదిలిపెట్టకుండా సొంత పార్టీ ఛైర్పర్సన్పైనే అవిశ్వాసం పెట్టేలా పావులు కదుపుతోందట ఎమ్మెల్యే శిబిరం. ఆ చర్యలకు టీఆర్ఎస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుందని ప్రచారం చేస్తున్నారట. అసలే గ్రూపులు.. ముఠాలు.. వర్గాలు కోదాడ టీఆర్ఎస్ కుంపట్లు రాజేస్తుంటే.. సరిదిద్దాల్సింది పోయి.. కొత్త సమస్యలు తలకెత్తుకుంటున్నారనే చర్చ సాగుతోంది. అభిప్రాయ భేదాలను తొలగించి.. అనుమానాలను నివృత్తి చేయాల్సి చోట తెగేవరకు లాగడం వల్ల ఎవరికి మేలో గుర్తించాలంటోంది కేడర్.
కోదాడ వ్యవహారాలపై టీఆర్ఎస్ అధిష్ఠానం ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న అంశాలపై సమాచారం తెప్పించుకున్నారట. మరి.. నేతల మధ్య తలెత్తిన సమస్యలను సర్దుబాటు చేస్తారో.. లేక కఠిన చర్యల దిశగా అడుగులు వేస్తారో చూడాలి.