Site icon NTV Telugu

Off The Record: బీఆర్‌ఎస్‌ పార్టీలో కేసీఆర్‌ కలుపు తీసే పనిలో బిజీగా ఉన్నారా..?

Bapu

Bapu

Off The Record: బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌… కలుపు తీసే పనిలో బిజీగా ఉన్నారా? ఫామ్‌హౌస్‌లో వ్యవసాయానికి అడ్డుగా ఉన్న కలుపుతో పాటు… తన చుట్టూ కనిపించకుండా ఏపుగా ఎదిగిపోయిన కలుపును నివారించే స్పెషల్‌ ప్రోగ్రామ్‌ పెట్టుకున్నారా? తన ఇలాకాలో, తనకే తెలియకుండా పెరిగిన పొలిటికల్‌ కలుపును క్లియర్‌ చేస్తున్నారా? అసలేంటీ కలుపు గోల? ఫాంహౌస్‌లో కేసీఆర్‌ కొత్తగా ఏం చేస్తున్నారు?

Read Also: Cyber Fraud: సైబర్ కేటుగాళ్ల కొంత పంథా షురూ

అధికారం కోల్పోయాక బీఆర్‌ఎస్‌లో సంక్షోభం.. ఒకవైపు సొంత కూతురు ధిక్కార స్వరం, మరోవైపు మేనల్లుడు హరీష్‌రావు అలక. ఇంకోవైపు కాళేశ్వరం కమిషన్‌ నోటీసులు, కొడుకు కేటీఆర్‌ ఏసీబీ ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు.. ఇలా ఎటు చూసినా కేసీఆర్‌కు ఇబ్బందికర పరిస్థితులే. ఆయనకున్న నమ్మకాల కోణంలో చెప్పాలంటే.. గ్రహాలు కలిసిరాలేదు. అంతా మబ్బులు కమ్ముకున్నట్టే అయ్యింది బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడి పరిస్థితి అన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం. ఆయనకు సంక్షోభాలు, సమస్యలు కొత్త కాకున్నా.. ఇప్పుడు వాటన్నిటికంటే ఎక్కువగా ఓ విషయం బాధపెడుతోందట. కూతురు కవిత ధిక్కార స్వరాన్ని కేసీఆర్‌ జీర్ణించుకోలేకపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. కేసీఆర్ దేవుడు.. ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయంటూ ఆమె రాసిన లేఖ కేసీఆర్‌నే కాకుండా మొత్తం పార్టీనే ఇరకాటంలోకి నెట్టిందన్నది విస్తృతాభిప్రాయం. ఈ క్రమంలోనే.. ఆయన నష్టనివారణ చర్యలకు పూనుకున్నట్టు తెలుస్తోంది.

Read Also: Apache Helicopter : పాక్ సరిహద్దుకు ‘అపాచీ హెలికాప్టర్లు’..!

అయితే, తన ఫామ్‌ హౌజ్‌లో జరుగుతున్న మంతనాలు, ఇతర రాజకీయ చర్చలు, రహస్య వ్యూహాలన్నీ బయటకు వెళ్లడం, వాటిని కోట్‌ చేస్తూ కవిత మాట్లాడటం, హరీష్‌రావు అలకలాంటి వాటిని ఇప్పుడు సీరియస్‌గా పరిగణిస్తున్నారట కేసీఆర్‌. అత్యంత సన్నిహిత వర్గాల నుంచే ఆ లీక్‌లు వెళ్తున్నట్టు ఆయన దృష్టికి వచ్చిందట. ఫామ్‌హౌజ్‌లో ఉంటూ… నిత్యం కేసీఆర్‌ పక్కనే తిరిగే కొంతమంది అదను చూసి ఆయనకు చాడీలు చెప్పడం కూడా పార్టీకి చేటు తెచ్చిందన్న అభిప్రాయం ఉంది కొందరు నాయకుల్లో. అలాంటి చాడీ రాయుళ్ళ వ్యవహారాలవల్లే కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు వచ్చాయన్నది కూడా మరో వెర్షన్‌. కవిత ఎపిసోడ్‌ తర్వాత ఇలాంటి వ్యవహారాలన్నిటి మీద సీరియస్‌గా దృష్టి పెట్టిన కేసీఆర్‌ మూలాలను కనుక్కున్నట్టు సమాచారం. ఇతరుల గురించి, చివరకు కుటుంబ సభ్యుల గురించి తనకు చాడీలు చెప్పడం, తప్పుడు సలహాలు ఇవ్వడం, వాటిని బయట వేరే రకంగా ప్రచారం చేయడం లాంటివి ఎవరు చేస్తున్నారో ఆయన గ్రహించారన్న ప్రచారం జరుగుతోంది. కొందరు తన వెంట ఉంటూనే.. కాంగ్రెస్‌ నేతలు, ప్రధానంగా సీఎం రేవంత్‌ రెడ్డి సన్నిహితులతో టచ్‌లో ఉండటాన్ని గమనించిన కేసీఆర్‌… ఫామ్‌ హౌజ్‌లోని కలుపు మొక్కలను ఏరివేయాలని నిర్ణయించుకున్నారట. ఆలోగా, ఇది వ్యవసాయ సీజన్‌ కావడంతో.. సీరియస్‌గానే వ్యవసాయం పనుల్లో కలుపును ఏరివేసే పనిలో బిజీగా ఉన్నట్టు చెబుతున్నాయి బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడికి అత్యంత సన్నిహిత వర్గాలు.

Read Also: Off The Record: తెలుగు రాష్ట్రాల మధ్య బనకచర్ల పొలిటికల్ హాట్‌

అందుకే ఇప్పుడు సెటైరిక్‌గా పొలంలోని కలుపు మొక్కలతో పాటు…ఏళ్ళ తరబడి తన పక్కనే ఉంటూ ఏపుగా పెరిగి.. పైకి కనిపించని కలుపును కూడా ఏరిపారేసే కార్యక్రమం మొదలు పెట్టారన్న చర్చ జరుగుతోంది పొలిటికల్‌ సర్కిల్స్‌లో. కొంత కాలంగా తనతో ఉంటున్న సమీప బంధువును, ఓ మాజీ ఎమ్మెల్యేను ఇక నుంచి ఫామ్‌ హౌజ్‌ దరిదాపులకు కూడా రావద్దని చెప్పేశారట కేసీఆర్‌. అవసరం ఉంటే తానే కబురు పెడతానని, అప్పటి వరకు రావొద్దని చెప్పినట్టు తెలిసింది. ఇక తాజా ఎమ్మెల్యేను కూడా గ్రౌండ్‌ ఫ్లోర్‌కే పరిమితం చేశారట. తన అనుమతి లేకుండా ఎవరినీ లోపలకు అనుమతించొద్దని మెయిన్‌ గేట్‌ దగ్గర చెప్పేసినట్టు తెలిసింది. మొత్తం మీద మాజీ సీఎం.. ఫామ్‌హౌజ్‌ పంటపొలాల కలుపుతో పాటు, మనుషుల రూపంలో తన చుట్టూ పెరిగిన కలుపును కూడా క్లియర్‌ చేసే పని మొదలుపెట్టారని మాట్లాడుకుంటున్నాయి బీఆర్‌ఎస్‌ శ్రేణులు. కుటుంబ సభ్యులు కూడా ఇది మంచి పరిణామం అని సంబరపడుతున్నట్టు చెప్పుకుంటున్నారు.

https://www.youtube.com/watch?v=q2XR2xZVYj4

Exit mobile version