టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్‌పై చర్చ ఆగడం లేదు. ఏదో ఒక రూపంలో రచ్చ అవుతూనే ఉంది. కుప్పం వేదికగా మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. తాజా పరిణామాలు చంద్రబాబుకు చికాకు తెచ్చిపెట్టాయని.. ఏం జరిగిందో అని ఆయన ఆరా తీశారని తెలియడంతో పార్టీలోనూ అటెన్షన్‌కు కారణమైంది.
కుప్పంలో మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల సందడి
టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన రచ్చ రచ్చ అవుతోంది. అధినేత చంద్రబాబుకు ఈ వ్యవహారం మింగుడు పడటం లేదని చెబుతున్నారు. కుప్పం నియోజకవర్గంలో తాజాగా జరిగిన కొన్ని పరిణామాలే దీనికి కారణంగా పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ఆ మధ్య చంద్రబాబు కుప్పంలో పర్యటిస్తున్న సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్‌కు అనుకూలంగా నినాదాలు మర్మోగాయి. అవి చల్లారాయని భావించినా మరోసారి అలజడి రేపడంతో టీడీపీలో హాట్ టాపిక్‌గా మారింది.
కుప్పంలో ఎన్టీఆర్ ఫ్లెక్సీలపై చంద్రబాబు ఆరా
ఇటీవల కుప్పంలో జూనియర్ ఎన్టీఆర్ జెండాను 40 అడుగుల ఎత్తున ఎగరేశారు. ఏదో జాతరగా ఫ్లెక్సీలు పెట్టి ఊదరగొట్టారు. కేవలం కుప్పంలోనే ఈ విధంగా చేయడంతో.. అది కాస్తా చంద్రబాబు చెవిని పడింది. కుప్పంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ గోల ఏంటని ఆయన ఆరా తీశారట. పార్టీ నేతలకు తెలియకుండా ఇదంతా ఎవరు చేస్తున్నారని చంద్రబాబు మండిపడినట్టు చెబుతున్నారు.
అభిమానులే ఇదంతా చేస్తున్నారా.. వెనక ఎవరైనా ఉన్నారా?
కుప్పంపై ఇప్పటికే వైసీపీ పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టింది. అక్కడ కేడర్‌ను కాపాడుకోవడానికి చంద్రబాబు నానా తంటాలు పడుతున్నారు. ఇదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ పేరుతో జరుగుతున్న హడావిడి బాబుకు కొంత చికాకు కలిగిస్తున్నట్టు టాక్. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులే ఇదంతా చేస్తున్నారా లేక వారి వెనక ఇంకెవరైనా ఉన్నారా అని టీడీపీ చీఫ్ లోకల్ లీడర్స్‌ను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అంతేకాదు.. ఇకపై కుప్పంలో ఏం జరిగినా ఎప్పటికప్పుడు తనకు చెప్పాలని.. ఇప్పటి వరకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసిన హడావిడిపై పూర్తి వివరాలు అందజేయాలని ఆదేశించారట.
గతంలో చంద్రబాబు సమక్షంలోనే ఎన్టీఆర్‌కు అనుకూలంగా నినాదాలు
గత ఏడాది చివర్లో చంద్రబాబు కుప్పంలో పర్యటించారు. బాబు పాల్గొన్న కార్యక్రమాల్లోనే జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ బ్యానర్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. టీడీపీ చీఫ్ సమక్షంలోనే పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఎన్టీఆర్‌ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు కొందరు. ఆ పరిణామాలపై చంద్రబాబు అసనహనం వ్యక్తం చేసినా.. ఎక్కడా బయటపడలేదు. పెదవి విప్పలేదు. తల అటూ ఇటు ఊపి.. ముందుకెళ్లిపోయారు. ఇదే కాదు.. అంతకుముందు సైతం కుప్పంలో ఎన్టీఆర్ అభిమానులు నియోజకవర్గం అంతా ఫ్లెక్సీలు పెట్టారు.
రాజకీయాలపై మాట్లాడేందుకు ఎన్టీఆర్ విముఖం
టీడీపీలో కాక రేపుతోన్న కుప్పం పరిణామాలు
జూనియర్ ఎన్టీఆర్ గతంలో టీడీపీ తరఫున విస్తృతంగా ఎన్నికల్లో ప్రచారం చేశారు. తర్వాత మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా పాల్గొనలేదు. ఆ మధ్య మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే.. రాజకీయాలపై మాట్లాడేందుకు ఇది సమయం.. సందర్భం కాదని లౌక్యంగా చెప్పి తప్పించుకున్నారు. పూర్తిగా సినిమాలపై ఫోకస్ పెట్టారు. అయిన్పపటికీ కొన్నాళ్లపాటు దానిపై చర్చ జరిగింది. టీడీపీ ఆవిర్భావ వేడుకల సమయంలో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి సైతం జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రస్తావించి కలకలం రేపారు. కానీ.. ఆ తర్వాత ఎవరూ మాట్లాడింది లేదు. ఇప్పుడు సడెన్‌గా కుప్పంలో ఎన్టీఆర్ అభిమానుల హడావిడి చర్చకు కారణమైంది. అసలే రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ఈ కొత్త పరిణామాలు.. అందులోనూ కుప్పంలో జరుగుతున్న అంశాలు టీడీపీలో కాక రేపుతున్నాయి. మరి.. వీటిని ఎవరైనా కావాల్సుకుని చేస్తున్నారా లేక వీటి వెనక ఉద్దేశం ఏదైనా ఉందా అన్నది కాలమే చెప్పాలి.