తెలంగాణ కాంగ్రెస్‌లో నల్గొండ జిల్లా నుండే మోస్ట్ సీనియర్స్ ఎక్కువ. కాంగ్రెస్‌కి పట్టున్న జిల్లా కూడా ఇదే. నాయకులు… నాయకత్వం ఎక్కువ ఇక్కడే ఉంది. పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ప్రస్తుతం నల్గొండ ఎంపీగా ఉన్నారు. హుజూర్నగర్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన లోక్‌సభ ఎన్నికల్లో నల్లగొండ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత హుజూర్నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. పీసీసీ చీఫ్ పదవి నుంచి రిలీవ్ అయిన తర్వాత హుజూర్‌నగర్‌పై దృష్టి పెట్టారు ఉత్తమ్. వచ్చే ఎన్నికల్లో హుజూర్నగర్ నుంచి పోటీ చేస్తున్నట్టు ఆయన ప్రకటించేశారు కూడా. అయితే లోక్‌సభ ఎన్నికల్లో నల్లగొండ నుంచి ఎంపీగా పోటీ చేసే కాంగ్రెస్ ఎవరు అన్నది చర్చగా మారింది.
నల్గొండ పార్లమెంట్ పరిధిలోనే నాగార్జునసాగర్ నియోజకవర్గం ఉంది. సీనియర్ నేత జానారెడ్డి… అక్కడ నుంచి గతంలో ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇద్దరు కుమారులను అసెంబ్లీ బరిలో దించే ఆలోచనలో ఉన్నారు మాజీ మంత్రి. జానా కుమారులు రఘువీర్‌రెడ్డి , జయవీర్రెడ్డిలు మిర్యాలగూడ, నాగార్జునసాగర్‌పై కన్నేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే గ్రౌండ్‌వర్క్ చేసుకుంటున్నారు. అయితే ఇప్పటికీ నాగార్జునసాగర్ నుంచే బరిలో ఉండాలన్నది జానారెడ్డి ఆలోచనగా ఉందట. 2018లోనే తనతోపాటు కుమారుడు రఘువీర్‌రెడ్డి టికెట్ కోసం ప్రయత్నించారు జానా. అప్పట్లో ఆ ప్రయత్నాలు వర్కవుట్ కాలేదు. ఇప్పుడు జానా కుటుంబంలో ఇద్దరికి టికెట్స్ వస్తాయా అనేది కాంగ్రెస్‌లో టెక్నికల్ అంశం. ఆ మధ్య గాంధీభవన్‌కి జానారెడ్డి చిన్నకొడుకు జయావీర్ వచ్చినప్పుడు ఓ చర్చ జరిగిందట. పార్టీలో ఓ అగ్రనేత సమక్షంలోనే జరిగిన చర్చలో జానారెడ్డి ఇంట్లో ఇద్దరు ఎమ్మెల్యేలు.. ఒక ఎంపీ ఉన్నారు అని కామెంట్స్ చేశారట. అప్పటి నుంచి ఊహాగానాలు షికారు చేస్తున్నాయి.
పెద్దరికానికి అనుగుణంగా జానారెడ్డిని ఎంపీగా పంపుతారా?
సీఎం కావాలనే ఆశల్లో ఉన్న జానారెడ్డి..!
జిల్లా మొత్తం కాంగ్రెస్‌లో ప్రభావితం చేసే నాయకులు కోమటిరెడ్డి.. జానారెడ్డిలే. కోమటిరెడ్డి ఎలాగూ వచ్చే ఎన్నికల్లో నల్గొండ అసెంబ్లీ నుంచి పోటీకి డిసైడ్ అయ్యారు. ఇక మిగిలింది జానారెడ్డి. పెద్దరికానికి అనుగుణంగా.. ఆయన్ని పార్లమెంట్‌కి పంపించే చర్చ జరుగుతున్నట్టు సమాచారం. పైగా జానా ఇద్దరు కుమారులూ పీసీసీ చీఫ్ రేవంత్‌కు సన్నిహితులు. రేవంత్ పీసీసీ చీఫ్ కావడంతో జానారెడ్డి పాత్ర కూడా కీలకమే. అలాంటి జానారెడ్డిని రేవంత్ పార్లమెంట్‌కి పంపిస్తారా..? నల్లగొండ లోక్‌సభ బరిలో దిగుతారా అనేది ఒక ప్రశ్న. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆధారపడి ఉంటాయి. ఇంత ముందస్తుగా.. ఎవరు పార్లమెంట్.. ఎవరు అసెంబ్లీ అనేది ఒక నిర్ణయానికి రావడం అంత ఈజీనా అనే చర్చ ఉంది. సీఎం కావాలనే ఆశతో ఉన్న జానారెడ్డి.. అసెంబ్లీ కాకుండా.. హస్తినకు వెళ్తారా..? అనేది కూడా ఆసక్తికరమే. పెద్దాయన ఆలోచన ఎలా ఉన్నప్పటికీ.. గాంధీభవన్ పొలిటికల్ సర్కిళ్లలో మాత్రం చర్చ జరిగిపోతుంది. మరి టైం ఏం డిసైడ్ చేస్తుందో చూడాలి..!!!