2019 నుంచి మారిన జమ్మలమడుగు రాజకీయం జమ్మలమడుగు. ఈ నియోజకవర్గంలో ఒకప్పుడు రాజకీయాలు మాజీ మంత్రులు రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డిల చుట్టూనే తిరిగేవి. 2019 ఎన్నికలతో వీరిద్దరికీ చెక్ పడింది. రాజకీయం కూడా మారిపోయింది. కొత్త వ్యక్తి డాక్టర్ సుధీర్‌రెడ్డి భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచారు. హోంశాఖ మాజీ మంత్రి మైసూరారెడ్డికి స్వయాన సోదరుడి కుమారుడే ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి. ఈ బంధుత్వం ఈ తొలిసారి ఎమ్మెల్యేకు ఎన్నికల్లో కలిసొచ్చింది.
గత ఎన్నికల తర్వాత రామసుబ్బారెడ్డి టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్లగా.. ఆదినారాయణరెడ్డి బీజేపీ కండువా కప్పుకొన్నారు. ఈ మూడేళ్ల కాలంలో జమ్మలమడుగులో టీడీపీకి కనీసం ఇంఛార్జ్ కూడా లేకుండా పోయారు. దీనికితోడు ఆది సోదరుడు టీడీపీ ఎమ్మెల్సీ శివనాథ్‌రెడ్డి కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. దీంతో నియోజకవర్గంలో పునాదులు బలపర్చుకున్నారు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి. ఇక్కడ ఏ పని కావాలన్నా ఎమ్మెల్యే అనుమతి కావాల్సిందే అన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయట.
సీన్ కట్ చేస్తే మాజీ మంత్రి ఆది సోదరుడు, మాజీ MLC నారాయణరెడ్డి కుమారుడైన భుపేష్‌రెడ్డి జమ్మలమడుగు యాక్టివ్ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటి అయ్యాక భూపేష్‌రెడ్డిని జమ్మలమడుగు పార్టీ ఇంఛార్జ్‌గా ప్రకటించడంతో రాజకీయం వేడెక్కింది. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన భూపేష్ ప్రజల్లోకి వెళ్తున్నారు. భూపేష్‌కు తండ్రి నారాయణరెడ్డి, చిన్నాన్న శివనాథరెడ్డి సహకారం అందిస్తున్నారు. అటు తమ వర్గం నేతలతోపాటు పార్టీ సానుభూతి పరులను కలుస్తున్నారు టీడీపీ ఇంఛార్జ్. పనిలో పనిగా ఇది ఎమ్మెల్యేకి ఆందోళన కలిగిస్తోందట. నిన్నటి వరకు నేనే రాజు నేనే మంత్రి అన్నట్టుగా ఎమ్మెల్యే సీన్ మార్చేశారు. టీడీపీ ఇంఛార్జ్ వెళ్లగానే.. మర్నాడే అదే ఊరికి వెళ్తున్నారట. ఇదేదో ఎన్నికల ప్రచారాన్ని తలపిస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యేపై సొంత శిబిరంలో అసమ్మతి ఉండటంతో.. దాన్ని ప్రత్యర్థి ఎక్కడ అడ్వాంటేజ్ తీసుకుంటారోననే భయం ఆయనలో ఉందట.
నియోజకవర్గంలో ఎమ్మెల్యే అసమ్మతి వర్గంపై గురిపెట్టి వారినీ కలుస్తున్నారు టీడీపీ ఇంఛార్జ్ భూపేష్‌రెడ్డి. దీంతో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి దిద్దబాటు చర్యలు చేపట్టారట. భూపేష్ వెళ్లిన ప్రాంతాలకు ఎమ్మెల్యే వెళ్లి అసమ్మతి నేతలను, పార్టీ కార్యకర్తలను కలిసి మాట్లాడటం స్థానికంగా చర్చగా మారింది. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. టీడీపీ ఇంఛార్జ్‌గా ఉన్న భూపేష్‌కే సీటు వస్తుందో లేదో ఇంకా తెలియదు. కానీ.. సీటు ఖాళీగా ఉండటంతో ఆయన ప్రయత్నాల్లో ఆయన ఉన్నారు. మొత్తానికి ఒకరు పరిచయాల కోసం.. ఇంకొకరు పట్టుకోసం గ్రామాల్లో చేస్తున్న పర్యటనలు జమ్మలమడుగు రాజకీయాలను రాజేస్తున్నాయి. ఈ క్రమంలో వచ్చే రెండేళ్లపాటు ఉండే పొలిటికల్ హీట్‌ను తలచుకుని ఆసక్తిగా చర్చించుకుంటున్నారు జనం.