పార్టీలు.. జెండాలు ఏవైనా అక్కడ నేతలు మాత్రం పాతవాళ్లేనా? ఆయన చేరికతో పార్టీ బలపడుతుందని భావిస్తే.. అంసతృప్తులు సంఖ్య ఎక్కువ అవుతోందా? తాజా పరిణామాలు ఆ పార్టీకి లాభమా.. నష్టమా? ఇంతకీ ఎవరి వాళ్లు? ఏమా పార్టీ? లెట్స్ వాచ్..!
తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీ కండువా కప్పుకోవడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కలకలం రేగుతోందట. అందరూ మునుగోడు ఉపఎన్నికపై ఫోకస్ పెట్టినా.. కొందరు సీనియర్ నాయకుల శిబిరాల్లో మాత్రం ఏదో తేడా కొడుతున్నట్టు సమాచారం. ముఖ్యంగా కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన వారిలో ఆందోళన ఎక్కువైందట. పైకి చెప్పకపోయినా.. కాషాయ శిబిరంలో ఈ అంశం అలజడి రేపుతున్నట్టు తెలుస్తోంది.
రాష్ట్ర బీజేపీ సంగతి ఎలా ఉన్నా… కనీనం జిల్లా బీజేపీలో అయినా తమకు ప్రాధాన్యం దక్కుతుందో లేదో అని ఆందోళన చెందుతున్నారట. పార్టీ అంతా రాజగోపాల్‌రెడ్డి చేతిలోకి వెళ్లితే.. ఆయన మార్కు రాజకీయాల్లో తమకు చోటు దక్కబోదని లెక్కలేస్తున్నారట. అమిత్ షా సమక్షంలో రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరడంతో .. రానున్న రోజుల్లో ఆయనకు ప్రాధాన్యం పెరుగుతుందనే అంచనాల్లో ఉన్నారట. పార్టీ పదవుల్లో ప్రాధాన్యం ఆయన వర్గానికే దక్కితే తమ పరిస్థితి ఏంటని ఆంతరంగిక సమావేశాల్లో మథన పడుతున్నట్టు తెలుస్తోంది.
రాజగోపాల్‌రెడ్డి ఎంట్రీతో బీజేపీలో కలవర పడుతున్న శిబిరాల్లో ప్రధానంగా ఇద్దరి పేర్లపై చర్చ సాగుతోంది. వారిలో ఒకరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ కాగా.. రెండో నాయకుడు గూడూరు నారాయణరెడ్డి. ఇద్దరూ గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆ సమయంలో కోమటిరెడ్డి బ్రదర్స్‌తో వీళ్లకు పడేది కాదు. కాంగ్రెస్ నుంచి బయటకు రావడానికి కూడా వాళ్లనే బూచిగా చూపించి వచ్చారనే వాదన ఉంది. అలాంటి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితోపాటు భిక్షమయ్యగౌడ్, గూడూరు నారాయణరెడ్డి ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎదురైన అనుభవాలను తలచుకుని.. బీజేపీలోనూ అదే రిపీటైతే రాజకీయ భవిష్యత్ ఏంటి అని దిగులు చెందుతున్నారట.
రాజగోపాల్‌రెడ్డి గతంలో భూవనగిరి ఎంపీగా పనిచేసి ఉండటంతో.. పార్లమెంట్ పరిధిలో తనకు పరిచయం ఉన్న నేతలను బీజేపీలో చేర్పించేందుకు ప్లాన్ వేస్తున్నారట. ఇది కూడా కాంగ్రెస్ నుంచి ముందే బీజేపీలోకి వచ్చిన వారికి రుచించడం లేదట. కాంగ్రెస్‌లో కొనసాగినప్పుడు పదవులు, టికెట్ల విషయంలో రాజగోపాల్‌రెడ్డికి, గూడూరు నారాయణరెడ్డికి మధ్య అనేక సందర్భాలు రచ్చ అయ్యింది. గాంధీభవన్ వేదికగా గొడవలు జరిగాయి. ఆలేరు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్‌కు రాజగోపాల్‌రెడ్డితో అభిప్రాయ భేదాలు ఉన్నాయట. ఆలేరు నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలవకుండా రాజగోపాల్‌రెడ్డి అడ్డుకున్నారని భిక్షమయ్యగౌడ్ బహిరంగ విమర్శలు చేశారు. దీనికితోడు ఆలేరుకు చెందిన మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్‌కు మునుగోడు సభలోనే బీజేపీ కండువా కప్పించారు రాజగోపాల్‌రెడ్డి. దాంతో ఆలేరులో తన పరిస్థితి ఏంటన్నది భిక్షమయ్య గౌడ్‌కు ప్రశ్నగా మారిందట.
అయితే పాత పగలు.. గొడవలు కాంగ్రెస్‌పార్టీతోనే పోయాయని.. ఇప్పుడంతా కమలం గూటిలో కొంగొత్తగా కనిపిస్తున్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. మారిన రాజకీయ పరిస్థితుల్లో అంతా కలిసి పనిచేస్తారనే విశ్వాసంతో ఉన్నారట. మునుగోడు ఉపఎన్నికలో గౌడ సామాజికవర్గం ఓటర్లు కీలకం కావడంతో.. భిక్షమయ్యగౌడ్‌ను రాజగోపాల్‌రెడ్డి చేరదీస్తారనే అభిప్రాయం ఉందట. గూడూరు నారాయణరెడ్డితో ఉన్న సమస్యలు సర్దుబాటు అవుతాయని అనుకుంటున్నారు. మరి.. ఉమ్మడి నల్లగొండ జిల్లా బీజేపీలో ఏం జరుగుతుందో చూడాలి.