తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి వచ్చాక జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులను మారుస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. పార్టీలో గ్రిప్ వచ్చేవరకు ఓపిక పట్టి.. అందరినీ మార్చేయాలని అనుకున్నారట. అయితే.. ఒకదాని వెనక మరో కార్యక్రమం రావడంతో ఆ ప్రక్రియకు కొన్నాళ్లు బ్రేక్ వేసే ఆలోచనలో ఉన్నారట. ఇప్పుడున్న డీసీసీలో దాదాపు 13 మందిని మార్చాలని అనుకున్నట్టు ప్రచారం జరిగింది. జిల్లాల్లో చురుకుగా పనిచేయని వారిని మార్చేయాలని కొంత కసరత్తు చేసినట్టు టాక్. ఇంతలో పార్టీ జాతీయ కమిటీ కూర్పు పూర్తయ్యే వరకు కొత్త నియామకాలు ఉండవని తేల్చేశారు. దీంతో కొంత బ్రేక్ పడింది.
తెలంగాణలో కాంగ్రెస్ సభ్యత్వ నమోదుపై ఆ మధ్య అంతా ఫోకస్ పెట్టారు. తర్వాత రాహుల్‌గాంధీ సభ రావడంతో అందులో బిజీ అయిపోయారు. తాజాగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ చింతన్ శిబిర్ కూడా పూర్తి కావడంతో ఇక DCCల ఎంపికే మిగిలిందని భావించారు పార్టీ నేతలు. కానీ.. దానికి ఇంకా టైమ్ ఉందనే సంకేతాలు ప్రస్తుతం జోరందుకున్నాయి. రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్‌పై పీసీసీ ఫోకస్ పెట్టింది. అదే అజెండాగా జనంలోకి వెళ్లాలని చూస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఈ నెల 21 నుంచి.. వచ్చే నెల 21 వరకు రచ్చబండకు ప్లాన్ చేసుకున్నారు. అది పూర్తయ్యే వరకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులను మార్చబోరనే వాదన ఉంది. సీరియస్‌గా పార్టీ పని నడుస్తున్న సమయంలో కొత్త తలనొప్పులు ఎందుకనే ఉద్దేశంలో పీసీసీ ఉందట.
వాస్తవానికి కొన్నాళ్లుగా రాష్ట్రంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అసంతృప్తిలో ఉన్నారు. రేవంత్ పీసీసీ సారథిగా వచ్చాక.. దళిత గిరిజన దండోరా సభలు.. సభ్యత్వం నమోదు బాధ్యత డీసీసీలకే అప్పగించారు. కానీ… రాహుల్ గాంధీ వచ్చిన వరంగల్ సభలో మాత్రం డీసీసీలు వేదికపైకి వచ్చేందుకు పాస్‌లు ఇవ్వలేదని గుర్రుగా ఉన్నారు. ఆ మధ్య జరిగిన కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో కొందరు డీసీసీలు రేవంత్ ఎదుట ఈ అంశాన్ని లేవనెత్తారు. పార్టీ పనిచేయడానికి తమను విస్తృతంగా వాడేసుకుంటున్నారని.. అగ్రనేతలు వచ్చినప్పుడు అస్సలు గుర్తింపే ఇవ్వడం లేదని ఆవేదన చెందారట.
కాంగ్రెస్‌లో ఉన్న వందల మందిలో ఒకరిగా తమను చూడటం డీసీసీలు జీర్ణించుకోవడం లేదని సమాచారం. పైగా వరంగల్ సభలో జరిగిన సంఘటనలు తమకు జరిగిన అవమానంగా భావిస్తున్నారట. సమస్య తీవ్రత అర్ధం చేసుకున్నారో ఏమో.. డీసీసీలను బుజ్జగించే ప్రయత్నం చేశారు రేవంత్. తాజాగా రైతు డిక్లరేషన్‌ను జనంలోకి తీసుకెళ్లే బాధ్యతను డీసీసీలపై పెట్టడంతో.. ఆ కార్యక్రమం పూర్తయ్యే వరకు జిల్లా అధ్యక్షులను మార్చబోరని తెలుస్తోంది. పార్టీ పదవుల్లో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ కోటాలపై చింతన్ శిబిర్‌లో నిర్ణయం తీసుకోవడంతో దానిపై క్లారిటీ కోసం ఎదురు చూస్తోంది పీసీసీ. అవన్నీ కొలిక్కి వచ్చాకే జిల్లాల్లో మార్పులు చేర్పులు ఉంటాయని సమాచారం.