ఏపీలో వివిధ అంశాలపై పోరాటం చేస్తున్న జనసేనాని పవన్ కల్యాణ్.. సెల్ఫ్‌గోల్స్ వేసుకుంటున్నారా? ఆయన చేపడుతున్న కార్యక్రమాల లింకులు.. తగలాల్సిన వారికి తగలకుండా ఇంకెక్కడో తేలుతున్నాయా? పార్టీ అధినేత దూకుడికి బ్రేక్‌లు పడే పరిస్థితి కనిపిస్తోందా?
జనసేన టేకప్ చేస్తున్న అంశాలే అసలు సమస్య?
2019 ఎన్నికలు ముగిసిన చాలాకాలంపాటు స్తబ్దుగా ఉన్న జనసేన పార్టీ.. ఇప్పుడిప్పుడే గేర్ మార్చుతోంది. ప్రజల్లోకి వెళ్లేలా కార్యక్రమాలు రూపొందిస్తోంది. అదీ అగ్రెసివ్‌గా ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటేనే కచ్చితంగా వచ్చే ఎన్నికల నాటికి సీన్లో ఉంటామని.. లేకపోతే అటుఇటు కాకుండా పోతామనే ఆందోళన జనసేనలో ఉంది. అందుకే పవన్ కల్యాణ్ దూకుడు పెంచినట్టు భావిస్తున్నారు. జనాల రెస్పాన్స్ ఎలా ఉన్నా.. కేడర్‌లో మాత్రం కొంత ధైర్యం కనిపిస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నా.. అసలు సమస్య జనసేన టేకప్ చేస్తున్న అంశాల దగ్గర ఉందట.
కేంద్రాన్ని నిలదీయలేకపోవడం పార్టీకి పెద్ద మైనస్సా..?
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని భుజాన వేసుకునే ప్రయత్నం చేస్తోంది జనసేన. ఉత్తరాంధ్ర వాసుల్లో కాస్తో కూస్తో జనసేన మీద మరింత సాఫ్ట్ కార్నర్ వచ్చేలా ఎత్తుగడలు ఉన్నాయి. అయితే ఇదే సందర్భంలో జనసేన గట్టిగా కేంద్రాన్ని.. బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని నిలదీయలేని సంకట స్థితిలో పడిపోతోంది. ఆ పార్టీకి ఇదే అతిపెద్ద మైనస్‌గా భావిస్తున్నారు విశ్లేషకులు.
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై వైసీపీని నిలదీస్తే లాభం లేదని చర్చ..!
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం పెద్ద వ్యవహారమే. ఈ అంశానికి కర్త, కర్మ, క్రియ అంతా కేంద్రమే. మరి పోరాటం ఎవరిపై చేయాలి? కేంద్రాన్ని వదిలేసి.. రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వాన్ని కార్నర్ చేయడం వల్ల జనంలోకి వెళ్తున్న సంకేతాలపై జనసైనికులు ఆందోళన చెందుతున్నారట. జగన్ సర్కార్ ప్రైవేటీకరణపై గట్టిగా మాట్లాడడం లేదని.. కేంద్రాన్ని నిలదీయడం లేదని విమర్శించినా… పార్లమెంటులో వైసీపీ ఎంపీలు ప్లకార్డులు పట్టుకోవాలని డిజిటల్ క్యాంపెయిన్ చేసినా.. ఆ పోరాటాల వల్ల పెద్దగా ఒనగూరేదేమీ ఉండదు. పొలిటికల్ మైలేజ్ రాదని చర్చ జరుగుతోంది. విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరిస్తే.. ప్లాంటుకు ఏలేరు కాల్వ ద్వారా అందించే నీటిని అడ్డుకుంటామని తూర్పు గోదావరి జిల్లా జనసేన నాయకుడు పంతం నానాజీ హెచ్చరించారు. ఇదే తరహాలో పవన్ కల్యాణ్ లేదా నాదెండ్ల మనోహర్ స్టేట్మెంట్స్ ఇస్తేనే జనాల స్పందన మరోలా ఉంటుందని కేడర్ అనుకుంటోందట.
బీజేపీతో బంధం పెనవేసుకున్న జనసేన..!
ప్రస్తుతం బీజేపీతో జనసేన బంధం పెనవేసుకుని ఉంది. సమీప భవిష్యత్‌లో రెండు పార్టీలు వేర్వేరుగా వెళ్లే దాఖలాలు కన్పించడం లేదు. ఇటీవల పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగాలే దానికి అద్ధం పడుతున్నాయని చెబుతున్నారు. అందుకే కేంద్రంతో లింకున్న అంశాలను టేకప్ చేసి.. అటు సెంట్రల్ గవర్నమెంట్‌ను గట్టిగా నిలదీయలేక.. ఇటు సంబంధం లేని వైసీపీని టార్గెట్ చేసుకుంటే ప్రజల్లో చులకనయ్యే ప్రమాదం లేకపోలేదనే ఆందోళన చెందుతున్నారట.
అమరావతి విషయంలో బీజేపీ వైఖరితో జనసేనకు రిలీఫ్..!
రాజధాని.. ప్రత్యేక హోదా .. పోలవరం నిర్మాణం.. రైల్వే జోన్ తదితర అంశాల్లోనూ జనసేన ఇదేవిధంగా ఇబ్బంది పడుతోంది. ప్రస్తుతానికి రాజధాని విషయంలో బీజేపీ కేంద్ర నాయకత్వం అమరావతికే కట్టుబడి ఉన్నామని చెప్పడంతో జనసేన ఊపిరి పీల్చుకుంది. ఇదే తరహా రిలీఫ్ విశాఖ స్టీల్ ప్లాంట్.. విశాఖ రైల్వే జోన్ విషయంలో వస్తుందని గట్టిగా చెప్పలేని పరిస్థితి. దీంతో ఏదైనా ఇష్యూ టేకప్ చేసే క్రమంలో కొంచెం జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందనే భావన జనసేన వర్గాల్లో వ్యక్తమవుతోందట.