ఏపీలో కొత్త పొత్తులకు బీజం పడిందా? రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు ఆ దిశగానే వెళ్తున్నాయా? బద్వేలు ఉపఎన్నికలో పోటీ విషయమై మిత్రులు భిన్నదారులు వెతుక్కుంటే.. వేర్వేరు దారుల్లో ఉన్నవారు ఏకతాటిపైకి వస్తున్నారా?
బీజేపీ, జనసేన మధ్య గ్యాప్ వచ్చిందా?
ఏపీలో రాజకీయ పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. రిప్లబిక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్ తర్వాత పొలిటికల్ కలర్స్ ఎటెటో వెళ్తున్నాయి. వైసీపీ-జనసేన మధ్య మాటల యుద్ధం ముదిరింది. ఈ క్రమంలో బూతులు.. తిట్ల పంచాంగం పతాకస్థాయికి చేరుకుంది. ఈ మొత్తం ఎపిసోడ్‌లో జనసేన మిత్రపక్షమైన బీజేపీ.. పవన్‌కు మద్దతుగా అంతంత మాత్రంగానే స్పందించింది. ఇది జనసేనకు ఆగ్రహం కలిగించినట్టు టాక్. దీనికి కంటిన్యూనా అన్నట్టు తూర్పుగోదావరి, అనంతపురం జిల్లాల్లోని పర్యటించిన పవన్.. ప్రధాని మోడీ పేరు కానీ.. బీజేపీ పేరు కానీ ఎక్కడా ప్రస్తావించనే లేదు. దీంతోనే ఈ రెండు పార్టీల మధ్య గ్యాప్ వచ్చిందనే చర్చ జోరుగా సాగుతోంది.
బద్వేలులో పోటీపై జనసేన, టీడీపీ ఒకేలా ప్రకటన..!
ఇప్పుడు బద్వేలు ఉపఎన్నిక బీజేపీ-జనసేన మధ్య ఇంకా దూరం పెంచినట్టే కన్పిస్తోంది. బద్వేలు ఉపఎన్నికలో జనసేన పోటీ చేయడం లేదని.. గత సంప్రదాయాలను అనుసరించి పోటీకి దూరంగా ఉంటున్నట్టు జనసేన ప్రకటించింది. ఈ స్టేట్‌మెంట్‌తో బీజేపీ కంగుతింది. దీనిని ఏకపక్ష ప్రకటనగానే భావిస్తున్నారట కమలనాథులు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో బద్వేలు బరిలోకి దిగుతున్నట్టు ప్రకటించింది బీజేపీ. ఇదే సయయంలో రాజకీయంగా మరో కీలక పరిణామం చర్చగా మారింది. బద్వేలు ఉపఎన్నికలో జనసేన ఏ లైన్ అయితే తీసుకుందో అదేలైన్ టీడీపీ ఎంచుకుంది. దీంతో ఏపీ రాజకీయం ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. ఈ రెండు పార్టీలు సంప్రదాయాన్ని పాటించాయని భావించాలా..? లేక ముందస్తు ప్రణాళిక ప్రకారం రెండు పార్టీలు ఓ అండర్ స్టాండింగ్‌తో బద్వేలు ఎన్నికకు దూరం జరిగాయని అనుకోవాలా..? ఈ ప్రశ్నల చుట్టూనే చర్చ జరుగుతోంది.
పరిషత్ ఫలితాల తర్వాత కొన్నిచోట్ల టీడీపీ, జనసేన మధ్య అవగాహన..!
ఈ పరిణామాలు చూసినవారంతా ఏపీలో కొత్త పొత్తులకు బీజం పడిందని భావిస్తున్నాయి. పాత పొత్తులకు బీటలు వచ్చాయని అనుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా టీడీపీ-జనసేన వెళ్తాయని అభిప్రాయ పడుతున్నారు. పరిషత్ ఎన్నికల ఫలితాల తర్వాత పలుచోట్ల ఈ రెండు పార్టీలు ఎంపీపీ, వైస్ ఎంపీపీ పదవులను పంచుకోవడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు విశ్లేషకులు. 2014లో కలిసి పనిచేసిన అనుభవం ఉండటంతో ఇప్పుడు దగ్గర కావడానికి పెద్దగా అడ్డంకులు ఉండబోవన్నది ఒక చర్చ. పైగా రెండు పార్టీలు ఏపీకి సంబంధించి కొన్ని కామన్ అంశాలపై వేర్వేరుగా పోరాడుతున్నాయి. ఆ అంశాలు కూడా వారిని దగ్గర చేస్తున్నట్టు సమాచారం. అయితే అధికారికంగా పొత్తును ఇప్పుడే ఖరారు చేసుకుంటాయా లేదా అన్నది ప్రశ్న. మరి.. ఏం జరుగుతుందో చూడాలి.