ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు అనుకున్న ముచ్చట తీరకుండానే తిరుగు టపా కట్టేశారు. ప్రధాని మోడీ.. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాల అపాయింట్‌మెంట్ దక్కలేదు. ఇంతకాదు.. అంతకాదు అని బెజవాడలో చెప్పిన టీడీపీ బృందం.. హస్తినలో ఏం చేసింది? ఎందుకు అపాయింట్‌మెంట్ దక్కలేదు? ఇప్పుడు అమిత్ షా ఫోన్ చేయడం కలిసొస్తుందా?
అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించినా కరుణించని ఢిల్లీ పెద్దలు?
బోస్‌డీకే పదం సృష్టించిన సంచలనాలతో ఏపీలో రాజకీయాలు చాలా హీటెక్కాయి. ఇప్పటి వరకు టీడీపీ చేయని డిమాండ్.. రాష్ట్రపతి పాలన. చివరకు అది కూడా చేసేసింది. అధికారం కోల్పోయి.. ప్రతిపక్షంలోకి వచ్చాక ఢిల్లీ వెళ్లని చంద్రబాబు హస్తినకు వెళ్లాల్సి వచ్చింది. ఢిల్లీకి వెళ్లే ముందు రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ లభించిందని.. ఆయన్ను కలిసిన తర్వాత ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కలిసి ఫిర్యాదు చేస్తామని టీడీపీ బృందం ప్రకటించింది. రాష్ట్రపతిని కలిసి చెప్పాల్సింది చెప్పేశారు. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని కోరారు. ఆ తర్వాత ప్రధాని మోడీ, అమిత్ షాల అపాయింట్‌మెంట్ కోసం శాయశక్తులా ప్రయత్నించినా.. ఢిల్లీ పెద్దలు కరుణించలేదట. దీంతో నిరాశతోనే తిరుగముఖం పట్టక తప్పలేదు చంద్రబాబు బృందానికి.
లా అండ్ ఆర్డర్ గురించి అయితే అమిత్‌షాను కలవాలన్న పీఎంవో?
ఇంతకీ ఢిల్లీలో ఏం జరిగింది? చంద్రబాబు అండ్ కో ప్రయత్నాలు ఎందుకు బెడిసికొట్టాయనేది ఇప్పుడు చర్చగా మారింది. రాష్ట్రంలో పరిస్థితిని.. విచ్చలవిడిగా డ్రగ్స్ రవాణా జరుగుతోందని ప్రధాని మోడీ, అమిత్‌షాల దృష్టికి తీసుకెళ్లాలని టీడీపీ భావించింది. అదే అంశాన్ని చెప్పి ప్రధాని అపాయింట్‌మెంట్ కోరారట. లా అండ్ ఆర్డర్, డ్రగ్స్ అంశాలే అయితే.. తమను కలవాల్సిన అవసరం లేదని.. అమిత్ షాను కలిస్తే చాలునని PMO నుంచి రిప్లయ్ వచ్చిందట. తాము కూడా అమిత్ షా అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తున్నామని.. ఏపీలో పరిస్థితి తీవ్రంగా ఉండటంతో ప్రధానిని కూడా కలిసి వివరిస్తామని చెప్పారట టీడీపీ నేతలు. అయినప్పటికీ PMO నుంచి మళ్లీ అదే రిప్లయ్ రావడంతో.. అక్కడి గేట్లు మూసుకుపోయాయి.
అమిత్ షా అపాయింట్‌మెంట్‌పై క్లారిటీ లేదా?
టీడీపీ నేతలు ఢిల్లీ వెళ్లిన సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీలోనే లేరు. కశ్మీర్ పర్యటనలో ఉన్నారాయన. కశ్మీర్ నుంచి ఢిల్లీ తిరిగొచ్చాక అమిత్ షా అపాయింట్‌మెంట్ ఇస్తారో లేదో క్లారిటీ ఇవ్వలేదట. ఆయన ఢిల్లీ వచ్చాక ముందుగా ఫిక్స్ చేసిన చాలా కార్యక్రమాలు ఉన్నట్టు సమాధానం వచ్చిందట. అవన్నీ పూర్తయ్యాకే మీ సంగతి అని అమిత్ షా ఆఫీస్ నుంచి టీడీపీ నేతలకు చెప్పినట్టు సమాచారం. దీంతో ఢిల్లీలో పరిస్థితిని అర్థం చేసుకున్న చంద్రబాబు బృందం రాష్ట్రపతికి చేసిన ఫిర్యాదుతో సరిపెట్టుకుని తిరిగి వచ్చేసింది.
ఏపీ గొడవలను చంద్రబాబు కేంద్రం మెడకు చుట్టబోతున్నట్టు అనుమానించారా?
ఇదే సమయంలో మరో చర్చా పార్టీ వర్గాల్లోనే జరుగుతోంది. డ్రగ్స్ రవాణా అని పైకి చెబుతున్నా.. టీడీపీ ఆఫీస్‌పై దాడిని చూపించి.. ఏపీలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిందని చెబుతూ రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేస్తారని ముందుగానే కేంద్ర పెద్దలకు తెలిసింది. అందుకే అమిత్ షా అపాయింట్‌మెంట్ ఇవ్వడానికి సుముఖత చూపలేదని టాక్. రాష్ట్రంలో రెండు పార్టీల మధ్య జరిగిన గొడవను ఢిల్లీకి వరకు తెచ్చిందే కాకుండా.. ఆ అంశాన్ని తమకు.. కేంద్రానికి చుట్టే ప్రయత్నం చేయడం ద్వారా రాష్ట్రంలో పైచెయ్యి సాధించేందుకు చంద్రబాబు వేసిన ఎత్తుగడగా ఢిల్లీ పెద్దలు అనుమానించారట. రాష్ట్రంలో జరిగిన పరిణామాలపై తాము స్పందించాల్సిన అవసరం లేదని అనుకోవడం వల్లే అమిత్ షా అపాయింట్‌మెంట్ దక్కలేదని ప్రచారం జరుగుతోంది.
అనవసరమైన బిల్డప్‌లు ఇచ్చామని టీడీపీలో గుసగుసలు..!
ఢిల్లీ వెళ్లేముందు రాష్ట్రపతిని మాత్రమే కలుస్తామని చెబితే సరిపోయేదని.. ప్రధానిని కలుస్తాం.. అమిత్‌షాను కలుస్తామనే రీతిలో అనవసర బిల్డప్ ఇచ్చి.. ఇప్పుడు విమర్శలకు ఆస్కారం ఇచ్చామని హస్తిన వెళ్లిన టీడీపీ బృందం చెవులు కొరుక్కుంటోందట. మొత్తానికి అంతన్నారు.. ఇంతన్నారు.. చివరకు తిరుగు టపాలో వచ్చారని కేడర్ సైతం గుసగుసలాడుకుంటోందట.