Divya Vani : టీడీపీకి గుడ్‌బై చెప్పి.. సైలెంట్‌గా ఉన్న నటి దివ్యవాణి బీజేపీకి చేరువ అవుతున్నారా? బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో భేటీ అందుకేనా? ఇంతకీ బీజేపీలో రాజకీయ ప్రస్థానం ఏపీలోనా.. తెలంగాణలోనా? లెట్స్ వాచ్..!
బాపు బొమ్మగా వెండితెరపై ఓ వెలుగు వెలిగిన నటి దివ్యవాణి.. పొలిటిక్ స్క్రీప్‌పై అంతగా సక్సెస్ కాలేదు. కాకపోతే.. చర్చల్లో వ్యక్తిగా ఉన్నారు. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు దివ్యవాణి. టీడీపీ అధికార ప్రతినిధిగా అనేకసార్లు మీడియా ముందుకు వచ్చారు. టీడీపీ లైన్లో అధికారపార్టీ వైసీపీపై పదునైన విమర్శలే చేశారు. తర్వాత టీడీపీ నేతలతో వచ్చిన గ్యాప్‌తో ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. ఆ సమయంలో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ఒకరిద్దరు టీడీపీ నేతలను టార్గెట్ చేయడం అప్పట్లో చర్చగా మారింది. ఒక కళాకారుడు పెట్టిన పార్టీలో కళాకారులకు స్థానం లేకుండా పోయిందనేది విమర్శించారు దివ్యవాణి. టీడీపీ కండువా తీసేసిన తర్వాత ఆమె ఏ పార్టీలో చేరతారో అనే చర్చ సాగింది. ఎటువంటి నిర్ణయం ప్రకటించకపోవడం.. మీడియాకు దూరంగా కావడంతో చర్చల్లో లేరు. ఇంతలో తెలంగాణలో ప్రత్యక్షమై.. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో సమావేశం కావడంతో మళ్లీ హాట్ టాపిక్‌గా మారారు దివ్యవాణి.
స్వయంగా ఈటల రాజేందర్ ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు దివ్యవాణి. సమావేశం అజెండా ఏదైనా.. ఆమె బీజేపీలో చేరతారనే ప్రచారం గుప్పుమంటోంది. ఇటీవల కాలంలో సినీ నటులపై బీజేపీ గురిపెట్టడంతో.. ఆ జాబితాలో దివ్యవాణి కూడా చేరారని అనుకుంటున్నారట. ఆ మధ్య హైదరాబాద్ టూర్లో అమిత్ షా.. జూనియర్ ఎన్టీఆర్‌తో సమావేశం కావడం… ఆ తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. మరో హీరో నితిన్‌తో భేటీ కావడంతో తాజా ఊహాగానాలకు బలం చేకూరుతోంది. బీజేపీలో చేరిక గురించే సమావేశం అయ్యి ఉంటే.. దివ్యవాణి ఎప్పుడు చేరతారు? పార్టీ నుంచి ఎలాంటి పదవి ఆశించారు? బీజేపీ ఆమెకిచ్చిన భరోసా ఏంటి? ఇలా పలు ప్రశ్నలు చర్చల్లో ఉన్నాయి.
ఇంతకీ దివ్యవాణి బీజేపీలో చేరాక.. తెలంగాణలో పార్టీ కోసం పనిచేస్తారా? లేక ఏపీలోనా అనే ప్రశ్న ఉంది. ఏపీ కంటే తెలంగాణలో బీజేపీ దూకుడుగా వెళ్తుండటంతో ఆమె ఇక్కడ ఫోకస్ పెట్టారనే వాదన ఉంది. వచ్చే ఎన్నికల్లో గెలిచి తెలంగాణలో అధికారంలోకి రావాలన్నది బీజేపీ పెద్దల ఆలోచన. అందుకు తగ్గట్టుగానే వివిధ రంగాల ప్రముఖులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. పైగా తెలంగాణలో చేరికల కమిటీకి ఈటల రాజేందరే ఛైర్మన్. దీంతో దివ్యవాణి కమలవాణిగా మారడమే మిగిలిందనే వారూ ఉన్నారు.
ఇప్పుడు దివ్యవాణి ఎప్పుడు బీజేపీలో చేరతారు? తెలంగాణ బీజేపీలో ఆమె రోల్ ఏంటీ? ఎన్నికల్లో పోటీ చేస్తారా? కేవలం ప్రచారానికే పరిమితం అవుతారా? అనేది పార్టీ కేడర్‌లోనూ ఆసక్తి రేకెత్తిస్తోందట. టీడీపీలో సరైన గుర్తింపు లేదని ఆ పార్టీ నుంచి బయటకొచ్చిన ఈ బాపుబొమ్మకు కాషాయ శిబిరంలో ఎలాంటి గుర్తింపు లభిస్తుందో చూడాలి.