Site icon NTV Telugu

Off The Record: కురుపాం టీడీపీలో పీక్స్కు చేరిన విభేదాలు..

Kurupam

Kurupam

Off The Record: ఆ.. ఎమ్మెల్యే నియోజకవర్గంలో చేయాల్సిందంతా చేసేసి… పార్టీ పెద్దల దగ్గరికి వెళ్ళి కన్నీళ్ళు పెట్టుకుంటున్నారా? వసూల్‌ రాజా ఆరోపణలు ఓవైపు వెల్లువెత్తుతుంటే…. లోకల్‌ లీజర్స్‌ అంతా కలిసి నన్ను ఒంటరిని చేశారని మొత్తుకుంటున్నారా?.. పార్టీ పదవుల్ని సైతం అమ్ముకుంటున్నారని ఆరోపణలున్న ఆ శాసనసభ్యురాలు ఎవరు? ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి?

Read Also: Cyber Crime: సైబర్ నేరగాళ్ల తోకలు కత్తిరిస్తున్న టీజీ పోలీసులు.. రాష్ట్రం దాటినా వదలట్లే…

మన్యం జిల్లా కురుపాం అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీలో విభేదాలు ఏ రేంజ్‌లో నడుస్తున్నాయట. ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి వర్సెస్‌ అదర్స్‌ అన్నట్టుగా పోరు జరుగుతోందని చెప్పుకుంటున్నారు. పైకి కనిపిస్తూ కొంత… కనిపించకుండా ఎక్కువగా యుద్ధం జరుగుతున్నట్టు చెప్పుకుంటున్నారు నియోజకవర్గంలో. ముఖ్యంగా దందాలు, అక్రమ వసూళ్ళలో ఎమ్మెల్యే మనుషులు చెయ్యి తిరిగిపోయారని, చివరికి సొంత పార్టీ వాళ్ళయినాసరే… చెయ్యి తడపనిదే పనులు జరగడం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ముందే ఉన్న వర్గాల అగ్గికి ఎమ్మెల్యే వైఖరి ఆజ్యం పోస్తోందని అంటున్నాయి టీడీపీ శ్రేణులు. గత అసెంబ్లీ ఎన్నికల్లో.. ఎమ్మెల్యే గెలుపు కోసం పనిచేసిన నాయకుడు వీరేష్ చంద్రదేవ్‌ను పూర్తిగా పక్కన పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది.

Read Also: AI Video: వాస్తవాన్ని తలపించే నకిలీ వీడియో.. వీడియో వైరల్..!

అదే సమయంలో కేడర్‌లో అసంతృప్తి కూడా గణనీయంగా పెరిగిందని, అన్నీ కలగలిసి కురుపాంలో టీడీపీని గందరగోళ పరిస్థితుల్లోకి నెడుతున్నాయన్న విశ్లేషణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలోని సీనియర్ నాయకులు కూడా ఎమ్మెల్యేకి సహకరించడం లేదట. అది నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ పటిష్టతపై ప్రతికూల ప్రభావం చూపుతోందని కేడర్‌లో ఆందోళన పెరుగుతోందట. లబ్దిదారులకు ప్రభుత్వ పథకాలు అందించడం, అధికారుల బదిలీల్లో ఎమ్మెల్యే జగదీశ్వరి ఒక పద్ధతంటూ లేకుండా ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటున్నారన్న విమర్శలు పెరుగుతున్నాయి. ప్రతి పనికి ఒక రేటు ఫిక్స్‌ చేసి కాంట్రాక్ట్‌లు, బదిలీలు అన్నిటిలో వసూళ్ళ పర్వం నడుస్తోందని, స్పెషల్‌ కౌంటర్‌ ఓపెన్‌ చేసేశారన్న ఆరోపణలు నియోజకవర్గం మొత్తం మార్మోగుతున్నాయి. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కీలక పోస్టింగ్స్‌ కోసం డబ్బులు వసూలు చేశారని, ఈ డీల్‌ను కురుపాం లోకల్ నాయకుడే నిర్వహించాడని నియోజకవర్గంలో బహిరంగంగా చెప్పుకుంటున్నారు.

Read Also: Jiiva: బ్లాక్‌ బస్టర్ డైరెక్టర్‌ తో జీవా ప్రయోగం

చివరికి పార్టీ పోస్ట్‌లకు కూడా ఎమ్మెల్యే బేరం పెడుతున్నారన్న ఆరోపణలున్నాయి. టీడీపీ మండల కన్వీనర్ పదవి కావాలంటే.. తనకు మహానాడు కార్యక్రమానికి వెళ్ళిరావడానికి ఫ్లైట్ టికెట్లు, ఇతర ఖర్చులు భరించాలని ఓ నాయకుడుడిని డిమాండ్‌ చేశారన్న అంశంపై అప్పట్లో గట్టి చర్చే జరిగింది కురుపాంలో. ఇలాంటి చర్యల వల్ల పార్టీ కోసం నిజంగా కష్టపడే కార్యకర్తకు అన్యాయం జరుగుతుందన్న ఆవేదన వ్యక్తం అవుతోంది. అలాగే ప్రతి గోకులం షెడ్ నిర్మాణంలో పార్టీకి చెందిన వ్యక్తులే ముందే పర్సంటేజ్‌ తీసుకుంటున్నారన్న ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. అభివృద్ధి పథకాలను కూడా వ్యాపార కోణంలో చూడటం ఏంటన్న మాటలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఎమ్మెల్యే వ్యవహారాలపై స్థానిక నాయకులు.. మంత్రి, పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్‌కు ఫిర్యాదు చేశారట.

Read Also:

కానీ, ఎమ్మెల్యే మాత్రం నియోజకవర్గంలో పరిస్థితులన్నీ తనకు అనుకూలంగా లేవని, నాయకులు వ్యతిరేకంగా పని చేస్తున్నారని కన్నీళ్ళు పెట్టుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై పార్టీ నాయకులే వెటకారాలాడుతున్నారట. కురుపాంలో చేయకూడని అరాచకాలన్నీ చేసేసి పార్టీ పెద్దల దగ్గరికి వెళ్ళి కన్నీళ్ళు పెట్టుకుంటే… ఆ వరదలో అన్నీ కొట్టుకుపోతాయా అంటూ కేడర్‌ చర్చించుకుంటోందట. మొత్తం మీద కురుపాం విషయంలో టీడీపీ అధిష్టానం వెంటనే.. సీరియస్‌గా జోక్యం చేసుకోకుంటే… ఇక్కడ పార్టీ పునాదులే కదిలే ప్రమాదం ఉందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి.

Exit mobile version