నిన్న మొన్నటి వరకు బలం మనదే అనే ధీమా వారిలో కనిపించింది. సీన్ కట్ చేస్తే వెన్నులో ఎక్కడో వణుకు మొదలైంది. ఆదివాసీలు ఒకే స్వరం అందుకోవడం.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థికి మద్దతుగా నిలవడం.. అధికారపార్టీ నేతలకు నిద్రలేకుండా చేస్తోందట.
ఎమ్మెల్సీ ఎన్నికలు.. జిల్లాలో రాజకీయ సెగలు..!
అధికారపార్టీకి కంచుకోటగా ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక్కసారిగా పొలిటికల్ హీట్ రాజేశాయి. టీఆర్ఎస్ అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవం అనుకుంటున్న సమయంలో పోటీగా ఓ ఆదివాసీ మహిళ బరిలో నిలవడం.. ఆమెకు ఆదివాసీ సంఘాలు.. విపక్ష పార్టీలు మద్దతుగా రావడంతో సమీకరణాలు ఆసక్తిగా మారుతున్నాయి. తమకు పూర్తిస్థాయిలో బలం ఉందని నిన్నమొన్నటి వరకు ధీమాగా ఉన్న అధికారపార్టీ నాయకులు.. ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. అదే ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో సెగలు రేపుతోంది.
తుడుందెబ్బ నాయకురాలికి విపక్షాల మద్దతు..!
దండే విఠల్ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి. ఆదివాసీ మహిళ.. తుడుందెబ్బ నాయకురాలు పెందూర్ పుష్పరాణి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. విఠల్ కాకుండా 23 మంది నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల విత్‌డ్రా సమయానికి 22 మంది వెనక్కి తగ్గారు. చివరకు విఠల్, పుష్పరాణి పోటీలో ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతల ఆశీసులతో పోటీకి సిద్ధ పడ్డవారు సైతం నామినేషన్లు విత్‌డ్రా చేసుకోవడంతో.. వాళ్లంతా అమ్ముడుపోయారని ఆరోపిస్తూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీంతో అప్రమత్తమైన విపక్షాలు.. డ్యామేజీ కంట్రోల్లో పడ్డాయి. ప్రెస్‌మీట్స్ పెట్టి మరీ పుష్పరాణికి మద్దతు ప్రకటిస్తున్నాయి.
క్రాస్ ఓటింగ్ లేకుండా అధికారపార్టీ ముందు జాగ్రత్తలు..!
పుష్పరాణికి మద్దతు తెలియజేసే విషయంలో కాంగ్రెస్, బీజేపీ పోటీపడుతున్నాయనే చెప్పాలి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 937 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో అధికారపార్టీకి చెందిన వాళ్లే దాదాపు 7 వందల వరకు ఉంటారు. TRSకే బలం ఎక్కువ. అయితే పుష్పరాణికి విపక్షాలు అండగా ఉండటం.. ఆమె తుడుందెబ్బ నాయకురాలు కావడంతో అధికారపార్టీలో అలజడి మొదలైందట. తమ పార్టీకి చెందిన వాళ్లు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు గులాబీ నేతలు. క్యాంప్‌లకు తెరతీశారు.
ఏకగ్రీవం కాకపోవడంతో జిల్లా టీఆర్ఎస్ నేతలపై పెద్దలు గుర్రు..!
ఇదే సమయంలో అధికారపార్టీ టీఆర్ఎస్‌లో మరో చర్చ జరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో పదిమంది ఎమ్మెల్యేలు, నలుగురు జడ్పీ ఛైర్మన్లు ఉన్నప్పటికీ.. ఆదివాసీ మహిళతో నామినేషన్ విత్‌డ్రా చేయించలేకపోయారని పార్టీ పెద్దలు జిల్లా నాయకత్వంపై గుర్రుగా ఉన్నారట. మరి.. పోలింగ్ నాటికి ఈ సమీకరణాలు.. రాజకీయ ఎత్తుగడలు ఎలాంటి మలుపు తిరుగుతాయో చూడాలి.