ఒకరంటే ఒకరికి పడదు. కానీ.. కలిసి భోజనం చేశారు.. నవ్వులు చిందిస్తూ మాట్లాడేసుకున్నారు. తింటున్నంత సేపూ ఐక్యత రాగం తప్ప మరో మాట లేదు. ఆ సిత్రాలను చూసి కాంగ్రెస్ వర్గాలే ఆశ్చర్యపోతున్న పరిస్థితి. ఇంతకీ వాళ్లంతా కలహాలు పక్కన పెట్టి కలిసి భోజనం చేసినట్టేనా? లేక బయటకు రాగానే వాతాపి జీర్ణం అనేశారా?
తెలంగాణ కాంగ్రెస్‌లో నాయకుల తీరు భలే గమ్మత్తుగా ఉంటుంది. గంట ముందే అంతా మాట్లాడుకున్నా… గంట తర్వాత ఖయ్యానికి సిద్దం అవుతారు. కాంగ్రెస్‌లో అంతర్గత పంచాయితీలు లేకపోతే ఆశ్చర్యపోవాలి. కానీ.. AICC కార్యదర్శులు రాష్ట్రానికి వచ్చాక లెక్కలు మారిపోతున్నాయ్. టీ కాంగ్రెస్ నేతల మధ్య ఐక్యతకు AICC కార్యదర్శులు ప్రయత్నిస్తుంటే.. AICC కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ మహేశ్వర్‌రెడ్డి విందు భేటీ ఏర్పాటు చేశారు. నేతలకు ఒకరంటే ఒకరికి పడకపోయినా.. మహేశ్వర్‌రెడ్డి విందుకు మాత్రం అంతా వచ్చారు.
పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి, మహేశ్వర్‌రెడ్డికి మధ్య గ్యాప్ ఉంది. అది కూడా సమాచార లోపమే అన్నది పార్టీ వర్గాల మాట. పార్టీలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎస్పీ నేత భట్టిలకు సన్నిహితంగా ఉంటారు మహేశ్వర్‌రెడ్డి. అలాగే జానారెడ్డితోనూ మంచి సంబంధాలే ఉన్నాయి. అందుకే సీనియర్లు విందుకు వచ్చారనే చర్చ నడుస్తోంది. ఆ మధ్య ఢిల్లీలో పార్టీ నేతలతో ప్రియాంకగాంధీ సమావేశం నిర్వహించారు. ఆపై నేతల మధ్య ఐక్యత లేదని గుర్తించిన అధిష్ఠానం.. ఆపనిని AICC కార్యదర్శులు నదీం జావెద్, రోహిత్ చౌధురిలకు అప్పగించింది. వారు కూడా ఆ పనిలో పడ్డారు. అసంతృప్తితో ఉన్న నాయకుల్లో కొందరు చల్లబడ్డారు కూడా. పైగా సమస్యలు ఉంటే తనకే నేరుగా చెప్పాలని ప్రియాంకగాంధీ స్పష్టం చేయడంతో సీనియర్లు కూల్ అయినట్టు సమాచారం. కాకపోతే పార్టీలో భిన్నాభిప్రాయాలు అలాగే ఉన్నాయి.
మహేశ్వర్‌రెడ్డి ఏర్పాటు చేసిన విందుకు ఎవరు వస్తారు? ఎవరు రారు అని అనుకున్నారట. కానీ.. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ మంత్రి జానారెడ్డి తదితర సీనియర్లు హాజరయ్యారు. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కూడా వచ్చారు. అంతా కలిసి ఉన్నారనే పిక్చర్ కోసం విందును వాడేసుకున్నారు పార్టీ నేతలు. తొలుత నదీం జావెద్, రోహిత్ చౌధురిలకు ట్రీట్ ఇద్దామని అనుకున్నారట. కానీ అది తప్పుడు సంకేతాలకు ఆస్కారం కల్పిస్తుందని భావించి.. విందు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఆ క్రమంలో మహేశ్వర్‌రెడ్డి చొరవ తీసుకున్నట్టు సమాచారం.
ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా.. విందు పేరుతో సీనియర్లు అంతా ఒకే దగ్గర కలిశారు. మాట్లాడుకున్నారు. ఒకరకంగా చెప్పాలంటే చాలా రోజుల తర్వాత సీనియర్లు ఒకచోట చేరడం ఇదే. ఈ విషయంలో AICC కార్యదర్శులు కొంత సక్సెస్ అయినట్టు కనిపిస్తున్నా.. రాష్ట్ర నేతల తీరు తెలిసిన పార్టీ వర్గాలు మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. విందు అయ్యాక వెళ్లిపోయిన నేతలు వాతాపి జీర్ణం అని అనుకుని ఉంటే.. ఐక్యత ఎండమావే అని తేల్చేసినట్టే. ప్రస్తుతం పార్టీకి మునుగోడు ఉపఎన్నిక పెద్ద పరీక్ష. అందులో పాస్ అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గట్టిగా పోటీ చేయడానికి శక్తి లభిస్తుంది. మరి.. ఇలాంటి విందులు ఏ మేరకు వర్కవుట్ అవుతాయో చూడాలి.