డబ్బు చెల్లిస్తారా? అప్పీల్‌కు వెళ్తారా?
స్మితా సబర్వాల్. తెలంగాణ సీఎంవో కార్యదర్శి. హైకోర్టు ఆదేశాలతో తాజాగా చర్చల్లోకి వచ్చారు ఈ మహిళా ఐఏఎస్. 90 రోజుల్లో ప్రభుత్వానికి ఆమె 15 లక్షలు కట్టాలి. లేకపోతే ప్రభుత్వమే ఆమె నుంచి ఆ మొత్తాన్ని వసులు చేయాలన్నది ధర్మాసనం ఆదేశాలు. దీంతో ఈ కేసు పూర్వాపరాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. హైకోర్టు ఆదేశాల ప్రకారం 15 లక్షలు స్మితా సబర్వాల్ ప్రభుత్వానికి కడతారా? లేక అప్పీలుకు వెళ్తారా? ఈ అంశంలో ప్రభుత్వం ఈ మహిళా ఐఏఎస్‌కు ఏవిధంగా సాయపడుతుంది అనేది అధికార వర్గాల్లో చర్చగా మారింది.
ఒక మ్యాగ్‌జైన్‌లో క్యారీ కేచర్‌తో వచ్చిన న్యూస్ ఐటమ్‌పై అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. అదే సమయంలో పదికోట్లకు పరువు నష్టం దావా వేశారు స్మితా సబర్వాల్. ఇంత వరకు బాగానే ఉన్నా… పరువు నష్టం కేసులో కోర్టు విచారణ కోసం ప్రభుత్వ ఆమెకు 15 లక్షలు మంజూరు చేసింది. వ్యక్తిగత హోదాలో ఒక ఐఏఎస్ వేసిన కేసులో ప్రభుత్వం ఆర్థిక సాయం చేయడంపై అభ్యంతరాలు వచ్చాయి. ఆర్థిక సాయంపై కోర్టు సైతం విస్మయం వ్యక్తం చేసింది. ఆ మొత్తాన్ని స్మితా సబర్వాల్ తిరిగి ప్రభుత్వానికి చెల్లించాలని స్పష్టంగా చెప్పింది ధర్మాసనం. ఇందుకు నిర్ధిష్ట గడువు కూడా విధించడంతో ఈ 90 రోజుల్లో ఏం జరుగుతుంది ? ప్రభుత్వం ఆలోచన ఏంటి అనే చర్చ సాగుతోంది.
స్మితా సబర్వాల్ వేసిన పరువు నష్టం దావా గతంలోనే క్వాష్ అయింది. మ్యాగ్‌జైన్‌లో వచ్చిన కథనంపై ఆ సంస్థ క్షమాపణలు కూడా చెప్పింది. దీంతో అసలు గొడవ పక్కకుపోయి.. ఇప్పుడు 15 లక్షల చెల్లింపు మెయిన్ హెడ్‌లైన్ అయింది. ఒక ఐఏఎస్‌కు 90 రోజుల్లో 15 లక్షలు చెల్లించడం పెద్ద ఇష్యూ కాకపోయినా.. ఆ మొత్తాన్ని అధికారికంగా చూపెట్టాల్సి రావడం ఇబ్బందే అన్నది IAS వర్గాల్లో వినిపిస్తున్న మాట. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తారనే వాదన ఉంది. ప్రభుత్వం నుంచి వచ్చే సంకేతాల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని టాక్. ఏదిఏమైనా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు ఈ సీనియర్ IASను ఇరకాటంలో పెట్టాయని అనుకుంటున్నారు.
నాడే ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సిందని చర్చ..!
మ్యాగ్‌జైన్‌లో కథనం వచ్చినప్పుడు ప్రభుత్వం ఆచితూచి నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేదని కొందరు అధికారులు అభిప్రాయ పడుతున్నారట. ప్రభుత్వం అగ్రసివ్‌గా వెళ్లడం.. తనకు కూడా సర్కార్ అండగా ఉంటుందనే ఉద్దేశంతో స్మితా సబర్వాల్ ధైర్యం చేయడం నాడు చకచకా జరిగిపోయాయి. ఒక్క స్మితా సబర్వాల్ విషయంలోనే కాకుండా.. మిగతా IASల విషయంలోనూ ప్రభుత్వం ఇదే విధంగా ఆర్థిక సాయం చేసేదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరి.. తాజా ఎపిసోడ్‌లో సర్కార్ ఏం చేస్తుందో..? IAS స్మితా సబర్వాల్ న్యాయపరంగా ఎలా ముందుకెళ్తారో చూడాలి.