గుంటూరు జిల్లా పేకాటకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోందా? నేతల అండ.. ఖాకీల ఆశీస్సులు నిర్వాహకులకు కలిసి వస్తున్నాయా? కొండలు.. గుట్టల్నే డెన్లుగా మార్చేస్తున్నారా? రోజుకో చోట సిట్టింగ్ ఏర్పాటు చేసుకుని ఎవరికీ దొరకకుండా షోలు నడిపిస్తున్నారా? వడ్డించేవాడు మనవాడే అయితే చాలన్నట్టుగా వ్యవహారాలు సాగిపోతున్నాయా?
గుంటూరు జిల్లాలో పేకాటలకు లోకల్ ఖాకీల అండ?
గుంటూరు జిల్లాలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో పేకాట కామన్. పోలీసుల దాడులు రొటీన్. కానీ.. ఏదో ఇద్దరిని పట్టుకోవడం.. నాలుగువేలు స్వాధీనం చేసుకోవడం తప్ప పెద్దగా సంచలనాలు ఉండవు. పోలీస్ బాస్‌లు అడిగితే.. పట్టుకున్నాం సార్.. అని చిన్నాచితకా సంఘటనలను రికార్డుల్లో చూపిస్తున్నారు. అయితే ఉన్నతాధికారులకు దొరక్కుండా పేకాట నిర్వహణలో పెద్దోళ్లు.. పెద్దకథే నడిపిస్తున్నారట. వారికి జిల్లాలో పోలీసులు ఎక్కడికక్కడ సహరిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇదే ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.
కొండలు… కోనల్లో పేకాట డెన్‌లు!
పోలీసులకు చిక్కిన వీళ్లంతా అల్లరి చిల్లరగా పేకాట ఆడేవాళ్లే. లక్షలు.. కోట్లలో పేకాట నిర్వహించేవాళ్లు మాత్రం ఖాకీలకు దొరకరు. వాళ్లు ఎక్కడ ఉంటారో.. ఎక్కడ కార్డ్స్ ఆడిస్తున్నారో ఖాకీలకు పూసగుచ్చినట్టు తెలుసని చెబుతారు. ముఖ్యంగా కరోనా వచ్చాక పేకాట రాయుళ్ల చేతులు చాలా దురద పెట్టేస్తున్నాయి. కార్డ్స్ ఆడేందుకు మన దేశంలో గోవాతోపాటు… శ్రీలంకకు వెళ్లేవారు జూదరాయుళ్లు. కరోనా కారణంగా ఎక్కడికి కదలలేని పరిస్థితి. దీంతో నేతల అండ.. ఖాకీల ఆశీస్సులతో కొందరు నిర్వహాకులు కొత్త ఎత్తులు వేస్తున్నారు. లోకల్‌గా పోలీసులతో మాట్లాడుకుని.. లోపాయికారీగా పెద్ద ఎత్తునే పేకాట ఆడించేస్తున్నారు. ముఖ్యంగా జిల్లాల్లోని కొండ కోనళ్లను డెన్‌లుగా చేసుకుని కథ నడిపించేస్తున్నారు. ప్రత్తిపాడు, గుంటూరు రూరల్ ప్రాంతాలు వీటికి అడ్డలుగా మారాయట.
బంగారం తాకట్టు పెట్టుకుని స్పాట్‌లో క్యాష్
పేకాట డెన్‌లకు 5కి.మీ. దూరంలోనే ప్రైవేట్ నిఘా
ప్రత్తిపాడులో అర్ధరాత్రి కొండల్లో పేకాట ఆడుతున్న తీరు చూసి కంగుతిన్నారు పోలీస్ బాస్‌లు. ఇక్కడ పేకాట ఆడుతున్నవారికి డబ్బు కావాలంటే బంగారం తాకట్టు పెట్టించుకుని స్పాట్‌లో క్యాష్ అరేంజ్ చేస్తున్నారు. ఈ డెన్‌పై జిల్లా పోలీస్ అధికారులు నేరుగా ఫోకస్ పెట్టడంతో వెలుగు చూసిందట. ఇక గుంటూరు ఇన్నర్ రింగ్‌రోడ్డ మొదలుకొని జిల్లాలోని ఈదులపాలెం, కొండ్రుపాడు, యనమదల తదితర ప్రాంతాల్లో రోజుకోచోట శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారట. పేకాట ఆడేందుకు ఎవరైనా రావాలంటే నిర్వాహకులు ఏర్పాటు చేసిన వెహికిల్స్‌లోనే వెళ్లాలి. సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుంటారట. పైగా డెన్‌కు వచ్చే మార్గంలో 4-5 కిలోమీటర్ల దూరంలో ప్రవేట్ నిఘా ఉంటుంది. SEB పోలీసులు దాడులకు వస్తున్నారని తెలిస్తే ఇక్కడ కాపు కాస్తున్నవాళ్లు నిర్వాహకులను వెంటనే అలర్ట్ చేస్తారట. దాంతో ఖాకీలు వెళ్లే టైమ్‌కు అంతా సర్దుకుని వెళ్లిపోతున్నారట.
రైడ్ జరిగితే ఏం చేయాలో లోకల్‌గా ఒప్పందాలు!
పేకాటకు సహకరించే పోలీస్ స్టేషన్లకు.. వారాల లెక్కన నిర్వాహకులు పెద్ద మొత్తంలో సంతృప్తి పరుస్తున్నారని ప్రచారం జరుగుతోంది. లోకల్ పోలీసులతో ఉన్న ఒప్పందం ప్రకారం.. రైడ్ జరిగినప్పుడు పదిమంది దొరికితే అందులో ఐదుగురినే కేసులో చూపించాలని.. పలుకుబడి ఉన్నవాళ్లను అరెస్ట్ చేయకూడదని లోపాయికారీ డీల్ చేసుకున్నారట. అందుకే వారెవరూ పట్టించుకోరట.
పేకాటకు సహకరిస్తున్న ఖాకీలపై పోలీస్ బాస్‌ల నిఘా!
జిల్లా ఎస్పీ స్వయంగా ఎంట్రీ ఇస్తేనే డెన్‌లు బయట పడుతున్నాయి. అంతేకాదు.. లోకల్ పోలీసులపై బాస్‌లకు అనుమానాలు వచ్చినట్టు సమాచారం. నిర్వాహకులకు ఎవరెవరు సహకరిస్తున్నారు? రోజుకో ప్రాంతంలో ఏవిధంగా పేకాటలు జరుగుతున్నాయి అన్నదానిపై అధికారులు కూపీ లాగుతున్నారట. అది తెలిసినప్పటి నుంచి పేకాటరాయుళ్లకు సహకరిస్తున్న పోలీసుల్లో గుబులు మొదలైందట. నిర్వాహకులు మాత్రం తమ వెనక ఉన్న నేతల అండ చూసుకుని మనకేం కాదనే దీమా వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం.