అక్కడ మాజీ మంత్రి అనుచరుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందా? ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండటంతో కేడర్ చెల్లాచెదురైందా? చాలా రోజుల తర్వాత కనిపించిన తమ నేతను అనుచరులు ఏం వేడుకున్నారు? మా సంగతేంటి అనే ప్రశ్నకు మాజీ మంత్రి సమాధానం ఏంటి? ఇంతకీ ఎవరా లీడర్? ఏమా కథా? లెట్స్‌వాచ్..!
గల్లా అరుణకుమారి. మాజీ మంత్రి. చంద్రగిరి నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన అరుణకుమారి.. రాష్ట్ర విభజనతో టీడీపీకి జైకొట్టారు. 2014లో టీడీపీ నుంచి అదే చంద్రగిరిలో పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఓటమి కుంగదీసిందో ఏమో.. 2019 ఎన్నికల్లో పోటీ చేయలేదు. తర్వాత క్రమంగా టీడీపీ కార్యక్రమాలకు.. రాజకీయాలకు దూరం అయ్యారు అరుణకుమారి. దాంతో దశాబ్దాలుగా గల్లా ఫ్యామిలీని అనుసరించిన అనుచరులు చంద్రగిరిలో చెల్లాచెదురయ్యారు. కొందరు టీడీపీలోనే ఉండిపోగా.. మరికొందరు రాజకీయ భవిష్యత్‌ను వెతుక్కుంటూ వైసీపీలో చేరిపోయారు.
తన రాజకీయ జీవితం ముగిసిందని.. తాను చేయని పదవి లేదు.. చూడని రాజకీయం లేదు అని చెబుతూ.. అనుచరులకు 2019లోనే ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు గల్లా అరుణకుమారి. ఏ పార్టీలో భవిష్యత్ ఉంటుందో అక్కడికి వెళ్లొచ్చని చెప్పారు. దాంతో కొందరు ఎవరిదారి వారు చూసుకున్నారు. కాకపోతే ఎక్కడా సంతృప్తిగా లేరట. గల్లా నేతృత్వంలో పనిచేసిన సంతృప్తి.. గౌరవం.. ఆదరణ ప్రస్తుతం దక్కడం లేదనే ఆవేదనలో ఉన్నారట. తాజాగా చంద్రగిరిలో జరిగిన ఒక ఫంక్షన్‌కు అరుణకుమారి వచ్చారు. మాజీ మంత్రి రాక గురించి ముందే తెలుసుకున్న పాత నేతలు.. అనుచరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అనుచరులతో దాదాపు రెండు గంటలపాటు మాట్లాడి.. కుశల ప్రశ్నలు వేశారట అరుణకుమారి.
చాలా రోజుల తర్వాత అరుణకుమారి పలకరించడంతో కొందరు అనుచరులు భావోద్వేగానికి లోనయ్యారట. ఎన్నికలకు ముందు వైసీపీలో చేరినా.. ఇప్పుడు పరిస్థితి అంత బాగోలేదని.. పదవులు దక్కినా నాటి సంతోషం లేదని మాజీ మంత్రితో చెప్పుకొచ్చారట కొందరు. టీడీపీలోనే ఉండిపోయినా ప్రాధాన్యం లేదని మరికొందరు తెలిపారట. దాంతో మళ్లీ రాజకీయాల్లోకి రావాలని అరుణకుమారిని కోరారట అనుచరులు. ఒకవేళ మీరు రాకపోతే.. మీ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకర్ని బరిలో దింపాలని కోరినట్టు సమాచారం. అయితే ఆ విన్నపాలకు నవ్వి ఊరుకున్నారట మాజీ మంత్రి.
అనుచరులతో మాజీ మంత్రి గల్లా అరుణకుమారి సమావేశమైన విషయం బయటకు పొక్కడంతో చంద్రగిరి రాజకీయాల్లో చర్చగా మారింది. అనుచరుల మాటను మన్నించి తిరిగి పొలిటికల్ రీఎంట్రీ ఇస్తారా? లేక ఫ్యామిలీ నుంచి ఇంకెవరినైనా చంద్రగిరిలో బరిలో దించుతారా అనే ఆరాలు ఎక్కువయ్యాయి. ఇదే సమయంలో వైసీపీ, టీడీపీలో ఉన్న అరుణకుమారి అనుచరులు ఎందుకు సంతోషంగా లేరు? వారికొచ్చిన కష్టమేంటి? వారిని ఎవరు ఇబ్బంది పెడుతున్నారు? నిజంగా బాధలో ఉన్నారా లేక.. అరుణకుమారిని తిరిగి రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు అలా చెప్పారా అనేది ప్రశ్నగా ఉంది. మొత్తానికి చంద్రగిరి రాజకీయాల్లో చాలా రోజుల తర్వాత గల్లా అరుణకుమారి చుట్టూ రాజకీయం వేడందుకుంది. మరి.. కేడర్ చెప్పిన దానికి మాజీ మంత్రి ఏం చేస్తారో చూడాలి.