Gajuwaka Assembly constituency ఏపీ పాలిటిక్స్‌లో అదో హాట్ సీట్. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ గ్యారెంటీ లేదనే ప్రచారం గట్టిగా జరుగుతోంది. ప్రతిపక్షం ఓట్లను చీల్చేలా అధినాయకత్వం.. అభ్యర్థి ఎంపికలో ఉందట. తాజా పరిణామాలపై ఎమ్మెల్యే స్పందన ఏంటి? హైకమాండ్‌కు ఉన్న లెక్కలేంటి? లెట్స్ వాచ్..!
ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ బలమైన అభ్యర్థుల ఎంపిక కోసం పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. జాగ్రత్తగా ఎత్తులు వేస్తున్నాయి. ఈ దిశగా అధికారపార్టీ ఎక్కువ ఫోకస్ పెట్టిన నియోజకవర్గాల్లో విశాఖజిల్లా గాజువాక ఉందని తెలుస్తోంది. పారిశ్రామిక అభివృద్ధిలో భాగమైన గాజువాక సెగ్మెంట్.. ఎంపీ ఎన్నికలను ప్రభావితం చెయ్యడంలో కీలకం. 2019లో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఇక్కడ నుంచి పోటీ చేయడంతో పోలిటికల్ సర్కిల్స్‌లో మరింత హైప్ వచ్చింది. సుమారు 3 లక్షల 9 వేల ఓటర్లతో జిల్లాలోనే పెద్ద నియోజకవర్గంగా ఉంది. ఇక్కడ కాపు, యాదవ సామాజికవర్గం ఓటర్లు దాదాపుగా సమానంగా ఉంటారు. అందుకే ఈ రెండు వర్గాలకే ప్రధాన పార్టీలు టికెట్స్ ఇస్తుంటాయి. రెడ్డిక, గవర, వెలమ ఇతర బీసీ సామాజికవర్గాలకు ఒక్కొక్క దానికి 20 వేలు వరకు ఓటింగ్ ఉంది. ఈ లెక్కల ఆధారంగానే గత 3 దఫాలుగా ఇక్కడ అభ్యర్థులకు ప్రాధాన్యం లభించింది. పీఆర్పీ నుంచి కాపు సామాజికవర్గానికి చెందిన చింతలపూడి వెంకటరామయ్య గెలిస్తే.. 2014లో యాదవ నేత పల్లా శ్రీనివాస్ ఎమ్మెల్యే అయ్యారు.
2019లో మాత్రం గాజువాక త్రిముఖ పోటీలో వైసీపీ, జనసేన హోరాహోరీగా తలపడ్డాయి. సుమారు 16 వేల ఓట్ల తేడాతో పవన్‌పై నాగిరెడ్డి గెలిచారు. టీడీపీ నుంచి పోటీ చేసిన పల్లాకు 56 వేల ఓట్లు వచ్చాయి. ఇంకో గమ్మత్తు ఏంటంటే.. జనసేన, టీడీపీ మధ్య ఓట్ల గ్యాప్ 15వందలు మాత్రమే. ఆ ఎన్నికల్లో యాదవ, కాపు ఓట్లు చీలిపోగా.. మిగతా బీసీ వర్గాలు వైసీపీకి మద్దతుగా నిలిచాయి. అంతేకాదు.. 2009, 2014 ఎన్నికల్లో ఓడిన తిప్పల నాగిరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. గాజువాకను ఆనుకుని ఉన్న గ్రామీణ ప్రాంతంలో నాగిరెడ్డి కుటుంబానికి ఫిక్స్‌డ్ ఓటు బ్యాంక్ ఉంది. అయినా నాగిరెడ్డికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేందుకు వైసీపీ ఆసక్తిగా లేదనే ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేకు వయోభారం.. ఆయన ఇద్దరు కుమారులు రాజకీయంగా బలమైన ముద్ర వేసుకోకపోవడాన్ని కారణాలుగా చెబుతున్నారట.
మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌కు జనాల్లో సానుభూతి ఉందని.. ఈ సమయంలో టీడీపీ-జనసేన పొత్తు ఖరారైతే నాగిరెడ్డి అక్కడ కరెక్టు కాదనే అభిప్రాయంలో వైసీపీ ఉందట. ఈ మధ్య కాలంలో కీలక నియోజకవర్గాల్లో పోటీకి ఆసక్తిగా ఉన్న నేతలను.. పార్టీ పదవుల్లో ఉన్నవారిని తాడేపల్లికి పిలిచి మాట్లాడుతోంది వైసీపీ. ఆ జాబితాలో గాజువాక కూడా ఉందట. టీడీపీని ఎదుర్కోవడానికి కాపు లేదా యాదవులకు టికెట్ ఇవ్వాలనే ఆలోచనలో వైసీపీ ఉన్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేకు క్లారిటీ ఇవ్వడమే కాకుండా ఆయన కుటుంబం సేవలను పార్టీ ఉపయోగించుకుంటుందనే భరోసా కల్పించారట. టీడీపీ నుంచి పల్లా.. జనసేన నుంచి కాపు అభ్యర్థి పోటీలో ఉంటే.. ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్‌ను పోటీ చేయిస్తారనే చర్చ ఉంది. ఆయన్ని గాజువాకపై ఫోకస్ పెట్టాలని పార్టీ పెద్దలు చెప్పారట.
వైసీపీ నుంచి ఎవరు పోటీ చేసినా.. ఎమ్మెల్యే నాగిరెడ్డి మద్దతు తప్పదు. మరి.. నాగిరెడ్డి సహకరిస్తారో.. లేదో..? ఉత్తరాంధ్రలో రెడ్డి లేదా రెడ్డిక సామాజికవర్గానికి ఉన్న ఏకైక సీటు గాజువాక. ఒకవేళ ఈ సామాజికవర్గం లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే.. మాజీ ఎమ్మెల్యే గురుమూర్తిరెడ్డి తెరపైకి రావొచ్చనే అంచనాలు ఉన్నాయట. మొత్తానికి గాజువాక సీటుపై నేతల్లో అప్పుడే హీటు పెరగడంతో ఇక్కడ ఎన్నికల మూడ్ క్రమేపీ బలపడుతోంది.