ఆయనో మాజీ ఎంపీ. ఎక్కడ ఎన్నికలు జరిగినా జోస్యం చెప్పేస్తారు. ఎవరి బలం ఏంటో ముందే ప్రకటించే ఆయన.. తాను ఏ పార్టీలో ఉన్నారో చెప్పలేకపోతున్నారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయని పార్టీలు అప్రమత్తం అవుతుంటే.. ఆ మాజీ ఎంపీ మాత్రం సైలెంట్. ఎందుకలా? ఎవరా మాజీ ఎంపీ?
కొండాతో కలిసి సాగడానికి సాహసించడం లేదా?
మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి పరిస్థితి గందరగోళంగా మారింది. ఒకసారి కాంగ్రెస్ అధినాయకత్వంపై విమర్శలు చేస్తారు. మరోసారి బీజేపీ పథకాలు, కార్యక్రమాలపై సానుకూలంగా స్పందిస్తారు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా లేదా అనే అనుమానాలు మాజీ ఎంపీ అనుచరుల్లోనే ఉంది. ఉత్తమ్ వర్గం, రేవంత్ వర్గం కాకుండా కొండా వర్గం ఒకటి తయారు చేసుకున్నా.. ఆయనతో కలిసి సాగడానికి ఎవరు సాహసించడం లేదట.
ఉపఎన్నికలో ఈటలకు మద్దతు.. జీవో 317పై కాంగ్రెస్ నిరసనకు హాజరు
కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఏ పార్టీలో చేరతారనే దానిపై స్పష్టత లేదు. అనుచరగణం డైలమాలో ఉంది. క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారాయన. రాజకీయ పునరాగమనంపై ఎలాంటి ప్రకటన చేయడం లేదు. ఇటీవల పండగలు, ఇతర ప్రత్యేక కార్యక్రమాలకు పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలను సొంత ట్రస్టు సభ్యులే ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని నెలల క్రితం జరిగిన హుజూరాబాద్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు మద్దతు ప్రకటించారు విశ్వేశ్వర్‌రెడ్డి. తాజాగా పరిగిలో డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి 317 జీవోకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో తళుక్కుమన్నారు.
మళ్లీ చేతిని అందుకుంటారో లేదో క్లారిటీ లేదు
కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన సమయంలో మూడు నెలల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. రోజులు.. నెలలు గడిచిపోతున్నా తాను ఎటువైపు చూస్తున్నదీ చెప్పడం లేదు. మీడియా ముందుకు వస్తున్నా.. ఆ ముక్క తప్ప అన్నీ మాట్లాడేస్తున్నారు విశ్వేశ్వర్‌రెడ్డి. ఒకప్పుడు ఆయన ప్రెస్‌మీట్ పెడితే.. రాజకీయంగా ఎలాంటి దుమారం రేపుతారా అనే చర్చ జరిగేది. రాజకీయాల్లో తటస్థ వ్యక్తులతో కలిసి నడుస్తారా..? వేరే పార్టీలో చేరతారా..? కొత్తగా పార్టీ పెడతారా..? మళ్లీ చేతిని అందుకుంటారా.. అనేది క్లారిటీ ఇవ్వడం లేదు.
పొలిటికల్‌గా ఎటూ తేల్చుకోలేకపోతున్నారా?
జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఇన్నాళ్లు పెద్ద దిక్కుగా ఉంటూ వచ్చిన కొండా విశ్వశ్వర్‌రెడ్డి.. ఆ పార్టీకి రాజీనామా చేయగానే బీజేపీలో చేరుతారనే చర్చ జరిగింది. అయితే టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా బీజేపీ గట్టిగా పోరాడుతుందా.. లేదా అనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్‌లో కొందరు అమ్ముడుపోయారంటూనే .. పీసీసీ నాయకత్వం మారి.. కేసీఆర్‌తో గట్టిగా పోరాడే నాయకుడొస్తే తిరిగి కాంగ్రెస్‌లో చేరాలో వద్దో ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి వచ్చినా.. కొండా నుంచి స్పష్టత లేదు. పొలిటికల్‌గా ఎటు వెళ్లాలో తేల్చుకోలేక క్రాస్‌రోడ్స్‌లో ఉండిపోయారు. అసలే రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. ఇలాంటి తరుణంలో వైఖరి స్పష్టం చేయకపోతే రాజకీయంగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి నిలబడతారా లేదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరి.. మాజీ ఎంపీ ఏం చేస్తారో చూడాలి.