ఆ వ్యక్తిపై పార్టీకి నమ్మకం లేదా? పార్టీని భుజాన వేసుకుని తిరుగుతున్నా అధిష్ఠానం నమ్మడం లేదా? సొంత కుటుంబం నుంచే ఆ మాజీ మంత్రి రాజకీయ భవిష్యత్ ఇబ్బందిలో పడబోతుందా?
ఎవరూ ఊహించని విధంగా బీజేపీలో చేరిన ఆది
వైసీపీలో గెలిచి టీడీపీలో చేరి.. మంత్రి పదవి పట్టేశారు ఆదినారాయణరెడ్డి. మంత్రి అవడమే జిల్లా మొత్తం పెత్తనం చేశారు. పార్టీ అవసరాలలో భాగంగా ఆగర్భ శత్రువు రామసుబ్బారెడ్డితో రాజీ పడి 2019 ఎన్నికల్లో జమ్మలమడుగు వదిలి కడప ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. టీడీపీలో ఉండగా తాను విమర్శించిన జగన్మోహన్‌రెడ్డి సీఎం కావడంతో ఆదికి భవిష్యత్ కళ్లముందు కనిపించింది. అంతే ఎవరూ ఊహించని విధంగా బీజేపీలో చేరిపోయారు.
కీలక కమిటీలో ఆదికి చోటు కల్పించని బీజేపీ
అగ్రనేతలు లేని బీజేపీ ఆది రాగానే ఆదరించింది. బాధ్యతలు కూడా అప్పగించింది. భవిష్యత్‌లో ఎలా ఉంటారో ఏమో కానీ.. ప్రస్తుతానికి బీజేపీతో కలిసి మెలిసిపోతున్నారు. అంతా బాగుందనుకుంటున్న టైమ్‌లో బీజేపీలో ఆది మీద అనుమానాలు మొదలయ్యాయనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో బీజేపీని సమన్వయ పర్చడానికి ఓ కమిటీని వేసింది పార్టీ హైకమాండ్. ఆదినారాయణరెడ్డితోపాటు టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సుజనా చౌదరి, సీఎం రమేష్‌లకు అందులో చోటుకల్పించారు. కమిటీలో 12 మంది ఉంటే ఆదికి ఒక్కరికే చోటు దొరకలేదు. రెడ్డి సామాజికవర్గం. అదీ సీఎం జగన్ సొంత జిల్లా. అలాంటిచోట ఆది ఉండాలి. ఆయనకు ప్రాధాన్యం దక్కాలి. కానీ హైకమాండ్ ఆయన్ను లైట్ తీసుకుంది. కమిటీలో ప్రాధాన్యం ఇవ్వలేదు.
అన్న కుమారుడు టీడీపీలో ఉండటం వల్లే ఆదికి బీజేపీలో ప్రాధాన్యం తగ్గిందా?
కమిటీలో చోటుదక్కకపోవడానికి కారణం ఆది ఫ్యామిలీనేనట. ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరడంతో తన రాజకీయ వారసుడని ఆయన గతంలో ప్రకటించిన అన్న కొడుకు భూపేష్‌రెడ్డి టీడీపీలో చేరిపోయారు. జమ్మలమడుగు ఇంఛార్జ్ అయిపోయారు. ఒకప్పుడు అన్నదమ్ముల అనుబంధం అంటే ఇలాగే ఉండాలి అన్నట్టు ఉండే ఆది ఫ్యామిలీలో తొలిసారి చీలిక వచ్చింది. తలో పార్టీలో చేరిపోయారు. సొంత అన్న కొడుకు టీడీపీలో ఉండటం వల్లే ఆదికి బీజేపీ ప్రాధాన్యం తగ్గించిందని ప్రచారం జరుగుతోంది.
అటు మొగ్గు చూపుతారనే కమిటీలోకి తీసుకోలేదా?
రక్తసంబంధంతో ఆది అటు మొగ్గితే ప్రమాదం అనుకుందో ఏమో కీలకమైన కమిటీలో చేర్చకుండా బీజేపీ పక్కన పెట్టిందని ఆయన అనుచరులు చెవులు కొరుక్కుంటున్నారు. అందులో ఎంత నిజం ఉందో ఏమో కానీ.. ఫ్యామిలీ వల్లే పదవి రాలేదనే ఫీలింగ్‌లో ఆది అనుచరులు ఉన్నారట.