పవన్ కల్యాణ్ చేస్తున్న కామెంట్స్ టీడీపీని కలవర పెడుతున్నాయా? ఈ మధ్య కాలంలో టీడీపీని జనసేనాని ఎక్కడా విమర్శించకపోయినా.. ఆందోళన ఎందుకు? పవన్ చూపిస్తున్న సింపతీపై తమ్ముళ్ల లెక్కలేంటి? లెట్స్ వాచ్..!
టీడీపీని జనసేనాని తిట్టకపోయినా.. తమ్ముళ్లలో టెన్షన్..!
కొంతకాలంగా జనసేనాని పవన్‌కల్యాణ్ సీఎం జగన్ మీద.. YCP ప్రభుత్వంపైనా విరుచుకుపడుతున్నారు. ఈ విమర్శలకు అధికారపార్టీ నుంచి గట్టి కౌంటర్లే పడుతున్నాయి. అలాగే పవన్ ఏపీకి వచ్చిన ప్రతిసారీ ఇక్కడి రాజకీయం కాస్తో కూస్తో వేడెక్కుతూనే ఉంది. అయితే పవన్ ఏపీ టూర్ పెట్టుకుంటే టీడీపీ నేతలూ భయపడుతున్నారట. టీడీపీని జనసేనాని తిట్టకపోయినా..ఆ భయం వెనక లాజిక్కుపై తమ్ముళ్ల మధ్య జరుగుతున్న చర్చే ఆసక్తిగా ఉందట.
వైసీపీకి జనసేనే ప్రత్యామ్నాయం అనే అర్థం వచ్చేలా పవన్ కామెంట్స్ ఉన్నాయా?
డైరెక్ట్ అటాక్ అంటే అటాక్ అన్నట్టుగా నేరుగా తిట్టేసుకోవచ్చు. మరీ ముదిరితే కొట్టేసుకుంటారు. కానీ.. టీడీపీపై పవన్ చూపించే జాలి.. ఆ సందర్భంగా చేసే కామెంట్స్‌పైనే ఏం చేయాలో అర్థం కావడం లేదట. ఆ మధ్య టీడీపీ ఆఫీస్‌పై దాడి.. ఆ తర్వాత సభలో జరిగిన పరిణామాలను తరచూ తన ప్రసంగాలలో ప్రస్తావిస్తున్నారు పవన్. అదీ టీడీపీ వర్గాలకు విచిత్రంగా కనిపిస్తోందట. చరిత్ర కలిగిన టీడీపీ.. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ వైసీపీ చేసే దాడులను తట్టుకోలేకపోతోందని.. వైసీపీ యాక్షన్ ఆ స్థాయిలో ఉందని పవన్ చెబుతున్నారు. ఈ వ్యాఖ్యలే టీడీపీలో చర్చకు దారితీస్తున్నాయి. ఇవి వేరేరకంగా జనాల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని నేతలు ఆందోళన చెందుతున్నారట. వైసీపీ దూకుడును టీడీపీ తట్టుకోలేకపోతున్నందున రాష్ట్రంలో ఇక జనసేనే ప్రత్యామ్నాయం అనే అర్థం ఆ కామెంట్స్‌లో ధ్వనిస్తోందని.. అదే ప్రజల్లోకి వెళ్తే ఎలా అని కలరవపడుతున్నారట టీడీపీ నేతలు.
జనసేన విషయంలో జరిగితే సీన్ మరోలా ఉండేదా?
ఈ తరహా కామెంట్స్‌ను పవన్ కల్యాణ్ అన్యాపదేశంగా చేస్తున్నారా? లేక జనసేనే ఇక ప్రత్యామ్నాయం అని ప్రజలకు చెబుతున్నారా? అన్నది టీడీపీ వర్గాలకు అంతుచిక్కడం లేదట. బీజేపీ అండ ఉండటంతో జనసేనాని అలాంటి కామెంట్స్ చేసి ఉంటే.. పార్టీపరంగా కచ్చితంగా జాగ్రత్త పడాలన్నది టీడీపీ వర్గాల వాదన. పైగా టీడీపీపై దాడి చేస్తే.. నిరసనలు చేపట్టారే తప్ప.. దూకుడుగా వెళ్లలేదన్నది కొందరు పార్టీ నేతల అభిప్రాయంగా ఉందట. అదే జనసేన విషయంలో జరిగిఉంటే.. సీన్ వేరేలా ఉండేదనే చర్చ తమ్ముళ్ల మధ్య జరుగుతోందట.
కాకినాడ ఘటనను గుర్తు చేస్తున్న టీడీపీ వర్గాలు..!
గతంలో కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ఇంటి మీదకు జనసేన కార్యకర్తలు దూసుకెళ్లిన ఘటనలను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాయి టీడీపీ శ్రేణులు. ఎవరిది పైచెయ్యి అనేదానికంటే.. వైసీపీని ఎదుర్కోవడంలో టీడీపీ కంటే జనసైనికులే మెరుగ్గా ఉన్నారనే అభిప్రాయం తమ్ముళ్లలో ఉందట. టీడీపీలో కిందిస్థాయిలో జరుగుతున్న ఈ చర్చ టీడీపీ అధినాయకత్వం దృష్టిలో ఉందో లేదో కానీ.. పార్టీ శ్రేణుల మధ్య తీవ్రస్థాయిలోనే చర్చ నడుస్తోందట.