ప్రకాశం జిల్లా ఒంగోలు లోక్‌సభ సెగ్మెంట్. ఇప్పటి వరకూ 17సార్లు ఎన్నికలు జరిగాయి. టీడీపీ ఆవిర్భావం తర్వాత జరిగిన పది ఎన్నికల్లో కేవలం రెండుసార్లు మాత్రమే సైకిల్ గెలిచింది. ఒకసారి బెజవాడ పాపిరెడ్డి.. మరోసారి కరణం బలరామ్‌లే టీడీపీ ఎంపీలుగా గెలిచారు. మొదటి నుంచి కాంగ్రెస్‌కు.. తర్వాత వైసీపీకి పెట్టని కోటలా మారింది ఒంగోలు లోక్‌సభ స్థానం. పైగా ఇక్కడ అభ్యర్థిని బరిలో దించాలంటే టీడీపీకి తలకు మించిన భారంగా ఉంటోందట. ఎన్నికల్లో ఎవరో ఒకర్ని నియమించడం.. ఓటమి తర్వాత వారు కనిపించకుండా పోవడం టీడీపీలో కామనైంది.
2014లో టీడీపీలో చేరిన మాగుంట శ్రీనివాసుల రెడ్డి సైకిల్ గుర్తుపై పోటీ చేసి ఓడిపోయారు. అయినప్పటికీ మాగుంటకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది టీడీపీ. గత ఎన్నికల సమయంలో మాగుంట టీడీపీకి గుడ్‌బై చెప్పి వైసీపీలో చేరిపోయారు. మంత్రిగా పనిచేసిన శిద్దా రాఘవరావు ఆ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసినా తెలుగుదేశానికి లక్ కలిసి రాలేదు. ఎన్నికల తర్వాత శిద్దా కూడా వైసీపీలో చేరిపోయారు. అప్పటి నుంచి ఒంగోలు టీడీపీకి పార్లమెంట్ ఇంఛార్జ్ కరువైపోయారు. లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం కొండెపి మాత్రమే టీడీపీ గెల్చుకుంది. జిల్లాల విభజనలో టీడీపీ గెలిచిన అద్దంకి, పర్చూరు, చీరాల నియోజకవర్గాలు బాపట్ల జిల్లా పరిధిలోకి వెళ్లాయి. దీంతో ఒంగోలు లోక్‌సభ పరిధిలో టీడీపీ మరింత వీకైందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
తూర్పు, పశ్చిమ ప్రాంతాల కలయికతో ఉండే ఒంగోలు పార్లమెంట్ సెగ్మెంట్‌లో పశ్చిమ ప్రాంతం గత ఎన్నికల్లో టీడీపీని కోలుకొలేని దెబ్బతీసింది. నాయకులు నిస్తేజంగా ఉన్నా కేడర్ పార్టీ కార్యక్రమాలను నెట్టుకొస్తోంది. జిల్లాల పునర్విభజన టీడీపీకి కష్టాలు తప్పడం లేదు. కేవలం ఒక్క ఎమ్మెల్యే మాత్రమే పార్టీకి మిగలడంతో ఆందోళన చెందుతున్నారట. ఎప్పటిలా లోక్‌సభ విషయంలో కాడి వదిలేసి.. అసెంబ్లీలపై దృష్టి పెట్టాలా అని లెక్కలు వేసుకుంటున్నారట. గతంలోలా ఎన్నికల సమయానికి ఎవరో ఒకరు టీడీపీలోకి వస్తారు.. ఎన్నికల్లో పోటీ చేస్తారు అని సర్ది చెప్పుకొనే పరిస్థితి ఉందట. ఎన్నికల ఖర్చు తడిసి మోపెడు కావడం.. ఎవరైనా పార్టీని వీడి వెళ్లిపోతే మరో నాయకుడిని సిద్ధం చేసుకోకపోవడం పెద్ద మైనస్‌గా ఉందన్నది కేడర్ చెప్పేమాట.
ఎన్నికలకు ముందుగానే లోక్‌సభకు ఒక బలమైన నేతను ప్రకటిస్తే.. అసెంబ్లీ ఇంఛార్జ్‌లను కలుపుకొని వెళ్లి.. టీడీపీని బలోపేతం చేసుకునే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారట పార్టీ నాయకులు. మరి.. టీడీపీ అధిష్ఠానం ఏం చేస్తుందో.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.