Off The record: ఆ మంటలు ఆరవా…? అస్సలు చల్లారవా…? కాస్త చల్లబడిందని అనుకుంటున్నప్పుడల్లా… సదరు కాంగ్రెస్ సీనియర్స్ కాస్త పెట్రోల్ చల్లి మళ్ళీ రాజేస్తుంటారా? ఈసారి ఏకంగా కాంగ్రెస్ రాష్ట్ర పెద్దలకే ఝలక్ ఇచ్చారా? పార్టీని అంతలా ఇరుకున పెడుతున్న ఆ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఎవరు? ఆయన ఎందుకలా చేస్తున్నారు?
Read Also: Ambati Rambabu: ఇదేం పోలీస్ వ్యవస్థ.. వైసీపీ నేతలపై దాడి చేసిన వారిని పట్టించుకోరా..?
జగిత్యాల రాజకీయ జగడం మరోసారి రాజుకుంది. సొంత పార్టీని ఇరుకున పెట్టేలా మోస్ట్ సీనియర్ జీవన్‌రెడ్డి వ్యవహరించిన తీరు హాట్ టాపిక్ అయ్యింది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చేపట్టిన కాంగ్రెస్ జనహిత యాత్ర చొప్పదండిలో జరిగింది. యాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చిందని పార్టీ నేతలు కూడా ఖుషీగా ఉన్నారు. అంతా సాఫీగా సాగిందని హస్తం పార్టీ రాష్ట్ర నేతలు సంబరపడుతున్న టైంలో.. జీవన్‌రెడ్డి ఎపిసోడ్‌తో అంతా రివర్స్ అయినట్టు ఫీలవుతున్నారట. టూర్ ప్రోగ్రామ్‌లో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నేతలు తాజా స్థితిగతులు ప్రతిపక్షాల పరిస్థితిని చెప్పగా.. జగిత్యాల నేతలు మాత్రం ఆత్మస్తుతి- పరనింద అన్నట్టుగా జీవన్‌రెడ్డిని పొగుడుతూ… మిగతా వాళ్ళను విమర్శిస్తూ మాట్లాడారు. వారిని సముదాయించి సమావేశాన్ని ముగించి బయటకు వెళుతున్న టైంలో.. జీవన్‌రెడ్డి సహా జగిత్యాల కార్యకర్తలు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను రౌండప్ చేసి.. తమకు అన్యాయం జరిగిందని నిలదీశారట. అక్కడితో ఆగకుండా.. మీరు ఓట్ చోరీ గురించి మాట్లాడుతున్నారు, జగిత్యాలలో అసలు సీట్ చోరీ జరిగిందనే మాటేంటని నిలదీయడంతో పీసీసీ అధ్యక్షుడు షాకైనట్టు సమాచారం.
పక్కనే ఉన్న జీవన్‌రెడ్డి కూడా కార్యకర్తలను వారించాల్సిందిబోయి.. వారిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడారట. జెండాలు మోసిన మేము అన్యాయం అవుతున్నామని అనడంతో మరింత రెచ్చిపోయారు కార్యకర్తలు.. ఈలోగా ఇతర నేతలు కలగజేసుకున్నా…అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది… జీవన్‌రెడ్డి అనుచరుల సీట్ చోరీ వ్యాఖ్యలు ప్రతిపక్షానికి ఆయుధంగా మారాయి. మీటింగ్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ని టార్గెట్ చేసిన మహేష్ గౌడ్‌కు సొంత పార్టీ నేతల వల్ల సెల్ఫ్ గోల్ చేసుకున్నట్టయిందట. అటు బండి కూడా అదే కామెంట్‌ను బేస్ చేసుకుని పీసీసీ అధ్యక్షుడి మీద అటాక్ చేశారు. దీంతో తమ యాత్ర బాగా జరిగిందన్న సంతోషం లేకుండా చేశఆరంటూ.. జీవన్‌రెడ్డి మీద రగిలిపోతున్నారట రాష్ట్ర కాంగ్రెస్ నేతలు. అయితే జీవన్‌రెడ్డికి ఇలా సొంత పార్టీని ఇరుకున పెట్టడం కొత్తేమీ కాదు.. ఓ రెండు నెలలు మౌనంగా ఉండటం.. ఉన్నట్టుండి… ఒక్కసారిగా ఏదో బాంబు పేల్చడం కామన్‌గా మారిందట పెద్దాయనకు. ఈ మధ్య వీలుచిక్కిన ప్రతీసారీ తన అసంతృప్తిని వెళ్లగక్కుతూ.. నా ఉనికిని గుర్తించండి అన్నట్టుగా అధిష్టానానికి సంకేతాలు ఇస్తున్నారట.
Read Also: Off The record: తెలంగాణ కాంగ్రెస్ ని ఇరకాటంలో పడేస్తున్న ఓట్ చోరీ ఆరోపణలు
సూపర్ సీనియర్ నేతగా పేరున్న జీవన్‌రెడ్డే ఇప్పుడు పార్టీకి తట్టుకోలేని తలనొప్పిగా మారారని చెవులు కొరుక్కుంటున్నారట పార్టీ నాయకులు. అసలే పెద్దమనిషి అప్పట్లో ఎమ్మెల్సీ కాబట్టి పార్టీ నేతలు కూడా మొదట్లో సీరియస్‌గా తీసుకుని పెద్దలు జీవన్‌రెడ్డి గారు అంటూ బుజ్జగింపుల పర్వం స్టార్ట్ చేసి ఆయనకు ఏదో ఒక ప్రామిస్ చేసి కూల్ చేసేవారు. రాను రాను అదే అలవాటుగా మారిపోవడంతో.. కాంగ్రెస్ ముఖ్యులు కూడా లైట్ తీసుకుంటున్నట్టు సమాచారం. దీంతో బహిరంగంగానే ఆక్రోశాన్ని వెల్లగక్కుతున్నారన్న చర్చ జరుగుతోంది. అన్ని విషయాల్లోనూ ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌కే ప్రాధాన్యత దక్కుతుండటంతో ఏం చేయాలంటూ.. దీర్ఘాలోచనలో పడ్డారట జీవన్‌రెడ్డి. అలా వచ్చిన ఆలోచనల నుంచే ఇలా రాష్ట్ర నేతలను ఇరుకున పెట్టాలనే ప్రణాళికలు అమలు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది జగిత్యాలలో.
Read Also: Mahbubnagar: రేబిస్ ఫోబియా.. తల్లి, కూతురుని బలి!
రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఫిరాయింపులపై ఓవైపు హాట్‌హాట్‌గా చర్చ సాగుతున్న తరుణంలో ఈ ఎపిసోడ్ ఎటు దారితీస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అటు లోకల్ బాడీస్ ఎన్నికలకు సిద్ధమవుతున్న క్రమంలో… నియోజకవర్గంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌పై అప్పర్ హ్యాండ్ సాధించేందుకు కూడా జీవన్‌రెడ్డి కొత్త ప్రణాళికలను సిద్దం చేసుకున్నారట. అందులో భాగంగానే సమావేశంలో దృష్టిని తనవైపు మళ్లించుకునేందుకు కార్యకర్తలను ఇలా ప్రయోగించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. సమావేశానికి ఎమ్మెల్యే సంజయ్ దూరంగా ఉన్న విషయాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకుని ప్రత్యర్ధులకు హెచ్చరికలు పంపేందుకు… ఇటు పార్టీలో తనకు ఫాలోయింగ్ ఉందని చెప్పేందుకు ఈ వేదికను వాడుకున్నట్టు చెప్పుకుంటున్నారు. కానీ.. జీవన్‌రెడ్డి తీరుపై రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్, పీసీసీ ఛీఫ్ గుర్రుగా ఉన్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయట.. ఆయన జగిత్యాలలో రాజేసిన మంటలు చల్లార్చేందుకు పార్టీ పెద్దలు ఎలా వ్యవహరిస్తారనేది ఆసక్తిగా మారింది.
