Munugode By-Elections : ఉపఎన్నిక ద్వారా భవిష్యత్ రాజకీయానికి బాట వేసుకోవాలని కామ్రేడ్స్ చూస్తున్నారా? తమ మద్దతు కోరే పార్టీలకు షరతులు పెట్టే ఆలోచనలో వామపక్ష నేతలు ఉన్నారా? మునుగోడు వేదికగా లెఫ్ట్ కొత్త వ్యూహం ఏంటి? లెట్స్ వాచ్..!
మునుగోడు ఉపఎన్నిక సన్నాహాల్లో ప్రధాన పార్టీల ఎత్తుగడలు స్పీడందుకున్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ దూకుడు పెంచాయి. ఒకప్పుడు మునుగోడులో పాగా వేసి.. బలమైన కేడర్ ఉన్న వామపక్ష పార్టీల వైఖరిపై ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. CPI, CPMలు ఉపఎన్నికలో పోటీ చేస్తాయా లేదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు లెఫ్ట్ శిబిరం నుంచి వస్తోన్న సంకేతాల ప్రకారం.. ఇతర పార్టీలకు మద్దతిచ్చే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. బీజేపీ ఓటమే లక్ష్యంగా ఆ లైన్ ఎంచుకుంటారనే చర్చ బలపడుతోంది.
మునుగోడులో గెలిచే పార్టీకే తమ మద్దతు అని వామపక్ష పార్టీల సంకేతాలతో.. టీఆర్ఎస్, కాంగ్రెస్ లెఫ్ట్ ఓటు బ్యాంకుపై ఆశలు పెట్టుకున్నాయి. గతంలో జరిగిన ఉపఎన్నికలో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు అనుసరించిన వైఖరే ఇప్పుడూ రిపీట్ అవుతుందనే లెక్కల్లో టీఆర్ఎస్ ఉంది. అయితే మునుగోడులో మద్దతిచ్చే విషయంలో సీపీఐ, సీపీఎంలు ప్రధాన పార్టీలకు కొన్ని షరతలు పెట్టొచ్చని ప్రచారం జరుగుతోంది. వచ్చే సాధారణ ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒకటి రెండు సీట్లు తమకు కేటాయించాలని టీఆర్ఎస్, కాంగ్రెస్‌లను కోరే అవకాశం ఉందట. దానికి ఎవరైతే ఒప్పుకొంటారో వాళ్లకు మునుగోడులో లెఫ్ట్ పార్టీల మద్దతు లభిస్తుందని టాక్.
ఇప్పటికే కమ్యూనిస్ట్‌లు మునుగోడులో తమ కసరత్తు ప్రారంభించాయి. సీపీఐ, సీపీఎంలు వేర్వేరుగా నియోజకవర్గంలో సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఉపఎన్నికలో పోటీ చేస్తే లాభమా.. కాదా? బీజేపీని ఓడించడానికి తమ శక్తి సామర్థ్యాలు సరిపోతాయా.. లేదా? అనే అంశాలపై నేతలు ఆరా తీశారు. కొందరు పోటీ చేయాలని.. మరికొందరు గెలిచే పార్టీకి మద్దతు ఇవ్వాలని సమావేశాల్లో నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారట. బరిలో దిగితే బీజేపీ వ్యతిరేక ఓటు చీలి.. అది కమలం పార్టీకి మేలు జరుగుతుందనే అంచనాకు వచ్చాయట లెఫ్ట్ పార్టీలు.
2014 ఎన్నికల్లో మునుగోడులో CPM ఒంటరిగా పోటీ చేయగా.. CPI కాంగ్రెస్ జతకలిసి బరిలో దిగాయి. 2018లో సీపీఐ మరోసారి కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేయగా… CPM బహుజన లెఫ్ట్ ఫ్రంట్ పేరుతో పోటీలో నిలిచింది. తాజా పరిస్థితుల్లో ఉపఎన్నికలో పోటీ చేయడంకంటే గెలిచే పార్టీకి మద్దతిచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే అది కాంగ్రెస్‌కా.. టీఆర్ఎస్‌కా అనేది వడపోసే పనిలో ఉన్నాయి వామపక్షాలు. కమ్యూనిస్ట్ పార్టీలతో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మంతనాలు సాగిస్తోంది. గత ఎన్నికల్లో CPI మద్దతిచ్చిన అంశాన్ని గుర్తు చేస్తూనే.. CPMని కూడా కలుపుకొని వెళ్లాలని లెక్కలేస్తున్నారట. మునుగోడులో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలకు 30 వేలకు పైగా ఓటు బ్యాంక్ ఉందని అంచనా. ఆ మొత్తం గంపగుత్తగా పడే అవకాశం ఉండటంతో టీఆర్‌ఎస్ కూడా వ్యూహాలకు పదును పెడుతోంది. ఇలా కాంగ్రెస్, టీఆర్ఎస్‌ల నుంచి వస్తోన్న డిమాండ్స్‌ను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్ రాజకీయాలకు బాట వేసుకుంటున్నారు వామపక్ష నేతలు. మరి.. మునుగోడులో లెఫ్ట్ అడుగులు ఎటు పడతాయో చూడాలి.