ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే. వైరా టీఆర్‌ఎస్‌లో గత మూడేళ్లుగా కనిపిస్తున్న సీన్. ఇప్పుడు కేసులు పెట్టుకునే వరకు వెళ్లింది ఆధిపత్యపోరు. సీఎం కేసీఆర్ బర్త్‌డే వేడుకలు నిర్వహించిన వారిపై కేసులు పెట్టడం ప్రస్తుతం జిల్లాలో హాట్ టాపిక్.
మూడేళ్లుగా వైరాలో ఆధిపత్యపోరు
ఎన్నికల్లో గెలుపోటములు నేతల జాతకాలను మార్చేస్తాయి. ఉమ్మడి ఖమ్మంజిల్లా వైరాలోనూ అదే జరిగింది. ఇక్కడ ఎమ్మెల్యే రాములు నాయక్. 2018లో ఆయన ఇండిపెండెంట్‌గా గెలిచారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి మదన్‌లాల్ ఓడిపోయారు. అప్పటి వరకు వైరాలో మదన్‌లాల్ ఏం చెబితే అదే నడిచింది. ఆ ఓటమితో సీన్ రివర్స్. ఓడినా టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో పెత్తనం చేయొచ్చని అనుకున్నారు మదన్‌లాల్. కానీ.. రాముల్ నాయక్ గులాబీ కండువా కప్పుకోవడంతో మాజీ ఎమ్మెల్యే ఆశలకు గండి పడింది. ఎమ్మెల్యే రాములు నాయక్, మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్ మధ్య ఆధిపత్యపోరు మొదలైంది. అది మూడేళ్లుగా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు కేసులు పెట్టుకునే వరకు వెళ్లడంతో వైరాలో వైరం తీవ్రస్థాయికి చేరిందనే చర్చ జరుగుతోంది.
మాజీ ఎమ్మెల్యే వర్గాన్ని దూరం పెట్టిన రాములు నాయక్?
ఎమ్మెల్యే రాములు నాయక్ తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని గుర్రుగా ఉంది మదన్‌లాల్ వర్గం. నియోజకవర్గంలో పూర్తిగా పట్టుసాధించే పనిలో ఉన్నారు ఎమ్మెల్యే. ఇదే సమయంలో తన వర్గాన్ని కాపాడుకునే పనిలో పడరాని పాట్లు పడుతున్నారు మదన్‌లాల్. అవకాశం చిక్కితే ఇద్దరు నేతలు వేయని ఎత్తులు లేవు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మదన్‌లాల్ వర్గం సత్తాచాటడంతో ఎమ్మెల్యే శిబిరం ఉలిక్కి పడింది. అప్పటి నుంచి రాములు నాయక్ మరింత స్పీడ్ పెంచేశారట. టీఆర్‌ఎస్ కార్యక్రమాలకు మాజీ ఎమ్మెల్యే వర్గాన్ని దూరం పెడుతున్నట్టు టాక్.
కేసీఆర్ బర్త్‌డే వేడుకల్లో పాల్గొన్నవారిపై కేసు
చివరకు సీఎం కేసీఆర్ బర్త్ డే వేడుకల్లోనూ ఆ వర్గపోరు బయటపడింది. తెలంగాణ అంతటగా ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను టీఆర్‌ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. వైరాలో మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్ వర్గం కూడా అదే చేసింది. కాకపోతే సాయంత్రం అయ్యే సరికి సీఎం కేసీఆర్ బర్త్‌డే వేడుకల్లో పాల్గొన్న వారిపై కేసులు నమోదయ్యాయి. జూలూరుపాడు మండలంలో మదన్‌లాల్‌కు పట్టుంది. అక్కడ గులాబీ దళపతి పుట్టినరోజును ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేశారు మాజీ ఎమ్మెల్యే. అనుకున్నదే తడవుగా జూలూరుపాడు నుంచి ఏన్కూరు వరకు 15 కిలోమీటర్లు ర్యాలీ చేశారు. మదన్‌లాల్‌తోపాటు అధికారపార్టీ కేడర్ మొత్తం పుష్ జోషలో ఉన్న సమయంలో పోలీసుల నుంచి చావు కబురు చల్లగా అందింది.
కేసు నమోదుతో పీక్‌కు చేరిన ఆధిపత్యపోరు
కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి.. కేకు కట్ చేశారనే అభియోగాలతో టీఆర్‌ఎస్ కేడర్‌పై కేసు పెట్టారు పోలీసులు. ఈ ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్ ఉన్నప్పటికీ.. ఆయన్ని కేసు నుంచి మినహాయించారు. ఈ చర్య అధికారపార్టీ శ్రేణులకు షాక్ ఇచ్చింది. ఎమ్మెల్యే రాములు నాయక్ ఒత్తిడి మేరకే ఖాకీలు యాక్షన్‌లోకి వచ్చారని అనుకుంటున్నారట. ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు రాజకీయ ఒత్తిళ్లలో భాగంగా విపక్ష పార్టీలపై కేసులు పెట్టడం సహజం. కానీ.. టీఆర్‌ఎస్ కేడర్‌పై.. అందులోనూ సీఎం బర్త్‌డే వేడుకలు నిర్వహిస్తే FIR కట్టడం సంచలనంగా మారింది. వైరాలో పీక్‌కు చేరిన టీఆర్‌ఎస్ ఆధిపత్యపోరుకు ఈ కేసు అద్దం పడుతుందనే చర్చ మొదలైంది. రానున్న రోజుల్లో ఈ వర్గపోరు ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో అన్న ఆందోళన కేడర్‌లో ఉందట. మరి.. వైరా టీఆర్ఎస్‌ను గాడిలో పెట్టేందుకు పార్టీ పెద్దలు ఎలాంటి మంత్రం వేస్తారో చూడాలి.