గుంటూరు జిల్లా వినుకొండ వైసీపీలో విభేదాలు రచ్చకెక్కుతున్నాయా? ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య మొదలైన రచ్చలో.. ఎంపీ కూడా చేరారా? పంచాయితీ సీఎం దగ్గరకు చేరిందా? అసలు వినుకొండ వైసీపీలో ఏం జరుగుతుంది?
వినుకొండ వైసీపీలో మొదట్లో అంతా బాగానే ఉందా?
వినుకొండ.. ఇప్పుడు గుంటూరు జిల్లాలో ఈ పేరే హాట్ టాపిక్. గత ఎన్నికల్లో వినుకొండ నుంచి వైసీపీ తరఫున పోటీ చేసిన బొల్లా బ్రహ్మనాయుడు గెలిచారు. మొదట్లో వినుకొండ వైసీపీలో అంతా బాగానే ఉన్నా.. కొద్ది నెలలకే విభేదాలు బయటపడ్డాయి. మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లిఖార్జునరావు, ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుల మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. మొదట్లో అన్ని కార్యక్రమాల్లో కలిసి పాల్గొన్న ఈ ఇద్దరూ తర్వాత ఎడముఖం, పెడముఖంగా మారిపోయారు. ఇద్దరూ కలిసి ఏ కార్యక్రమంలోనూ పాల్గొనలేదు. నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయుడు వినుకొండ వస్తేనే మాజీ ఎమ్మెల్యే మక్కెన కనిపించేవారు.
మక్కెనకు ఎంపీ అనుకూలంగా ఉండటంతో బొల్లా ఆగ్రహం
DCC అధ్యక్షుడిగా ఉన్న మక్కెనను వైసీపీలోకి తీసుకురావడంలో నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు పాత్ర ఉంది. మక్కెన రాకను బొల్లా ముందు నుంచీ వ్యతిరేకించారు. తనకు ఎవరి సాయం అవసరం లేదని.. గెలుస్తాననే ధీమాతో ఉండేవారు. అయినా ఎన్నికలకు ముందు మక్కెనను పార్టీలోకి తీసుకొచ్చారు. దీంతో మొదటినుంచి మక్కెన ఎంపీకి అనుకూలంగా ఉండేవారు. ఎమ్మెల్యే బొల్లాతో విబేధాల తర్వాత ఎంపీతో మక్కెన సాన్నిహిత్యం మరింత పెరిగింది.
ఇది గ్రహించిన ఎమ్మెల్యే బొల్లా వినుకొండలో పట్టుపెంచుకునే పనిలో పడ్డారు. అలాగే తమ వర్గాన్ని ఎమ్మెల్యే బొల్లా పట్టించుకోవడం లేదన్నది మక్కెన వర్గం ఆరోపణ. నియోజకవర్గంలోని సమస్యలపై మాజీ ఎమ్మెల్యే మక్కెన నేరుగా ఎంపీతో మాట్లాడడం.. ఎంపీ కూడా ఆయనకు అనుకూలంగా ఉండటంతో ఎమ్మెల్యే బొల్లాకు ఆగ్రహం తెప్పించిందన్న వాదన ఉంది.
శావల్యాపురం మండలంలో జరిగిన ఘటనతో మరింత రచ్చ
ఇటీవల జరిగిన పరిణామాలతో వైసీపీలో విబేధాలు మరోసారి బయటపడ్డాయి. శావల్యాపురం మండలం వేల్పూరులో చనిపోయిన వైసీపీ నేత కుటుంబాన్ని పరామర్శించే కార్యక్రమంలో ఎంపీ, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అది ఎమ్మెల్యే స్వగ్రామం. ఇక్కడే వైసీపీ కార్యకర్త, రైతు అయిన నరేంద్ర ధాన్యం కోనుగోళ్లపై ఎంపీకి ఫిర్యాదు చేశారు. ఎంపీ వెంటనే JCకి ఫోన్ చేసి ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంపై ప్రశ్నించారు. ఇది ఎమ్మెల్యేని మండించిందట. అసలే మక్కెనను వెనకేసుకు వస్తున్నారని, ఎంపీ మీద పీకల దాకా కోపంతోఉన్న ఎమ్మెల్యే బొల్లాకు అక్కడి పరిస్థితి నషాళానికి ఎక్కించిదట. అంతే.. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ తనను చేతకానివాని వాడిగా చిత్రీకరిస్తున్నారని నరేంద్రపై విరుచుకుపడ్డారట ఆ నేత. పైగా నరేంద్ర మాజీ ఎమ్మెల్యే మక్కెన అనుచరుడు. సమస్య తన దృష్టికి తీసుకు రాకుండా నేరుగా ఎంపీకి చెప్పడంపై ఎమ్మెల్యే బొల్లా అసహనంగా ఫీలయ్యారట.
సీఎం ముందు పంచాయితీ పెట్టిన ఎమ్మెల్యే బొల్లా
అది కాస్తా చినికి, చినికి గాలి వానగా మారి పోలీస్ కేసు వరకు వెళ్లింది. నరేంద్రపై తప్పుడు కేసు పెట్టారని ఎంపీ నేరుగా పోలీస్ ఉన్నతాధికారులకు ఫోన్ చేయడం.. విచారణ జరపగడం.. వినుకొండ రూరల్ సీఐ అశోక్‌కుమార్ సస్పెండ్ కావడం చకచకా జరిగిపోయాయి. ఈ ఘటనను తనకు అనుకూలంగా మార్చుకోవడానికి మాజీ ఎమ్మెల్యే మక్కెన వర్గీయులు ప్రయత్నించారని.. అందుకు ఎంపీ కూడా సహకరించారనేది ఎమ్మెల్యే బొల్లా వర్గీయుల ఆరోపణ. దీంతో ఏకంగా సీఎం ముందు పంచాయితీ పెట్టారు ఎమ్మెల్యే బొల్లా.
నేతలు బస్తీమే సవాల్ అంటున్నారా?
ప్రభుత్వాన్ని తిట్టినా ఎంపీ పట్టించుకోలేదని.. తాను తట్టుకోలేకపోయానని సీఎంకి చెప్పారట ఎమ్మెల్యే బొల్లా. అంతేకాదు.. ఎంపీ సస్పెండ్ చేయించిన సీఐకి సీఎం ద్వారా తిరిగి పోస్టింగ్ ఇప్పించుకున్నారట. ఇప్పటి వరకు లోలోన వర్గాలుగా ఉన్న ఈ నేతలు ఇప్పుడు బస్తీమే సవాల్ అంటున్నారట. గొడవ అయితే అయ్యింది శత్రువులు ఎవరో తెలిసిపోయిందని ఎమ్మెల్యే అంటుంటే.. ఇక బహిరంగంగానే వేరు కుంపటి పెట్టడానికి ఆయన ప్రత్యర్థులు రెడీ అయిపోయారట.