ఆ ఇద్దరు నేతలు జిల్లాలో టీడీపీకి కీలకం. కానీ.. ఒకరంటే ఒకరికి గిట్టదు. పార్టీ కష్టకాలంలో ఉన్న టైమ్‌లోనూ ఆధిపత్య పోరాటమే. బడానేతలు తెరవెనక చేస్తున్న కుట్రలతో 3 నియోజకవర్గాల్లో గ్రూపుల గోడవలు తారాస్థాయికి చేరాయి. ఆ నాయకలు ఎవరో.. ఆ నియోజకవర్గాలేంటో..ఈ స్టోరీలో చూద్దాం.
మూడు నియోజకవర్గాల్లో కోల్డ్‌వార్
శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ కంచుకోటలు గత ఎన్నికల్లో మంచులా కరిగిపోయాయి. పది నియోజకవర్గాల్లో సైకిల్‌కు దక్కింది రెండే. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అధికార వైసీపీదే హవా. అయినప్పటికీ జిల్లాలో టీడీపీ కీలక నేతల తీరు మారలేదంటున్నారు తమ్ముళ్లు. పార్టీ అధినాయకత్వం సమాన ప్రాధాన్యం ఇస్తున్నా.. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావుల మధ్య కోల్డ్‌వార్ కొనసాగుతోంది.
పాలకొండ, పాతపట్నం, ఎచ్చెర్లపై టీడీపీలో చర్చ
కళాకు పట్టున్న పాలకొండ, పాతపట్నం, ఎచ్చెర్లలో అచ్చెన్న వర్గానికి చెందిన నాయకులు టికెట్ రేసులో ఉన్నామని చెబుతూ కార్యక్రమాలు చేపడుతున్నారు. టీడీపీ ఇంఛార్జ్‌కు సమాచారం ఇవ్వకుండానే ప్రోగ్రామ్స్ చేస్తున్నారట. ఎచ్చెర్లకు కళా వెంకట్రావే టీడీపీ ఇంచార్జ్. అక్కడ కూడా అచ్చెన్న వర్గంలోని నాయకులు టికెట్ తమకే వస్తుందని సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. పార్టీ నాయకులు కలిశెట్టి అప్పలనాయుడు, చౌదరి బాబ్జీలు.. కళాకు వ్యతిరేకంగా ఓపెన్ స్టేట్‌మెంట్స్ ఇస్తున్నారు. ఈ ఇద్దరూ తెల్లారితే అచ్చెన్న వెనకే కనిపిస్తారన్నది కళా వర్గం చెప్పేమాట.
నియోజకవర్గాల్లో ఎవరి వర్గం వాళ్లదే
పాలకొండలో కళా కుటుంబానికి పట్టుంది. ఇక్కడ నిమ్మక జయకృష్ణ కళా మనిషి. రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయారు. పార్టీ కేడర్‌కు కూడా కళా ఎంత చెబితే అంత. ఈ మధ్య పాలకొండలో పడాల భూదేవిని కింజరాపు కుటుంబం వెనకేసుకొస్తున్నట్టు టాక్. పాతపట్నంలోమాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ పార్టీ ఇంఛార్జ్‌గా ఉన్నారు. ఇక్కడ కలమటకు వ్యతిరేకంగా మామిడి గోవిందం అనే నాయకుడిని అచ్చెన్న వర్గం ప్రోత్సహిస్తోందట.
చంద్రబాబు దృష్టికి మూడు నియోజకవర్గాల పరిస్థితి
ఈ వర్గపోరును చూశాక.. 2024 ఎన్నికల్లో టీడీపీ పరిస్థితి ఏంటా అని ప్రశ్నించుకుంటున్నాయి పార్టీ శ్రేణులు. పార్టీకి నష్టమే అని చెవులు కొరుక్కుంటున్నారట. కంచె చేను మేసిన చందాన పార్టీ అగ్రనాయకులే గ్రూపులను ప్రోత్సహించడం కేడర్‌కు మింగుడుపడటం లేదు. పార్టీలో ఇమడలేక.. బయటకు వెళ్లలేక కొందరు మౌనంగా ఉండిపోతున్నారు. రెండు వర్గాలు ప్రస్తుతం చాలా యాక్టివ్‌గా పనిచేస్తున్నాయి. అవకాశం చిక్కితే ఒకరిపై ఒకరు ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటున్నారు. ఈ మూడు నియోజకవర్గాల పరిస్థితి పార్టీ అధినేత చంద్రబాబు దగ్గరకు వెళ్లిందట. ఆ విషయం తెలిసినప్పటి నుంచి చంద్రబాబు ఏం చెబుతారా? సమస్యను ఎలా కొలిక్కి తెస్తారా అని ఎదురు చూస్తున్నారు టీడీపీ కార్యకర్తలు.