Off The Record: మంత్రి రానీ… ముఖ్యమంత్రి రానీ… వాళ్ళ ముందు బలప్రదర్శనలు జరగాల్సిందేనా? బూతులు తిట్టుకుని, అంగీలు చినిగేలా కొట్టుకుంటే తప్ప అక్కడి కాంగ్రెస్ లీడర్స్‌కు ప్రోగ్రామ్ జరిగిన ఫీల్ రాదా? కుర్చీలు గాల్లోకి లేస్తేనే… కసిగా అవతలోళ్ళని కుమ్మితేనే తప్ప అబ్బ…. కార్యక్రమం బాగా జరిగిందని అనుకోరా? ఏ జిల్లాలో అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి? అధికారంలోకి వచ్చాక కూడా ఎందుకు మార్పు రాలేదు?
Read Also: HYD Bava Murder: బావమర్దులు.. బావ బతుకు కోరతారు.. కానీ హైదరాబాద్‌లో ఓ బావ బలి కోరారు
సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలం అంతంతమాత్రమే. దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాల్లో ఆ పార్టీ చివరిసారిగా గెలిచింది 2009లో. ఇక సిద్దిపేట నియోజకవర్గంలో అయితే 1983లో చివరిసారి కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం ఉంది. అలా… అంత దారుణమైన పరిస్థితుల్లో… ఏళ్లుగా ఈ మూడు నియోజకవర్గాల్లో పార్టీ బలం తగ్గుతూ వస్తోంది. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ గజ్వేల్, దుబ్బాకలో మూడో స్థానంతో, సిద్దిపేటలో మాత్రం రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది పార్టీ. అయితే… ఈ సారి పార్టీ అధికారంలోకి రావడంతో జిల్లా కాంగ్రెస్ నేతలు జోష్‌గా ఉన్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్‌లే తాము ఎమ్మెల్యేలమన్నట్టు ఫీలైపోతున్నారట. అటు ప్రతిపక్ష BRSకు చెందిన మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు గజ్వేల్, సిద్దిపేట ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అలాంటి అగ్రనేతలు ఉన్న నియోజకవర్గాల్లో అధికార పార్టీ చాలా అలర్ట్‌గా ఉండాలి. పుంజుకోవడానికి అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. పార్టీ నేతలు, కార్యకర్తలు కలిసికట్టుగా పని చేస్తేనే అది సాధ్యం. కానీ…లోకల్ కాంగ్రెస్ లీడర్స్ మాత్రం అసలా విషయమే మర్చిపోయినట్టు తెలుస్తోంది. కలిసి ఉంటే కలదు సుఖం అన్న విషయాన్ని వాళ్ళు వదిలేసి చాలా రోజులైందని అంటున్నారు ప్రస్తుత వ్యవహారాలను గమనిస్తున్న వాళ్ళు. పార్టీ అధికారంలోకి రాకముందే.. ఈ మూడు నియోజకవర్గాల్లో గ్రూప్ వార్ ఉండగా.. ఇప్పుడది ఇంకా పెరిగిందట. గతంలో టికెట్లు, నియోజకవర్గంలో పైచేయి కోసం పోటీ పడేవారు. ఇప్పుడు అధికారం వచ్చింది. ఎన్నికల్లో పోటీ చేసిన వారే నియోజకవర్గ ఇంచార్జ్ లుగా ఉన్నారు.
Read Also: Off The Record: ఒక్కరి కోసం బీఆర్ఎస్ ఇద్దరు నేతలను దూరం చేసుకుందా..?
అధికార పార్టీ నాయకులు చెబితే కొన్ని పనులు అవుతున్నాయి. ఇలాంటి సందర్భంలో కూడా గ్రూపు గొడవలు వదలకుండా విభేదాలతో పార్టీని రచ్చకీడుస్తుతున్నారు. జిల్లా పర్యటనకు సీఎం వచ్చినా, మంత్రి వచ్చినా… వీ డోంట్ కేర్. ఎవరైతే మాకేంటి… అంటూ ఆధిపత్య యుద్ధాన్ని కొనసాగిస్తున్నారట. అందుకోసం ఎంతకైనా తెగిస్తాం అన్నట్టుగా ఉంది వాళ్ళ వ్యవహారం. మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉన్న గజ్వేల్ నియోజకవర్గంలో గత డిసెంబర్ 2న రేవంత్ రెడ్డి సీఎం హోదాలో మొదటిసారి ఓ పరిశ్రమ ప్రారంభోత్సవానికి వచ్చారు. సీఎం పర్యటనను విజయవంతం చేయాల్సిన స్థానిక కాంగ్రెస్ నేతలు ఆయన సమక్షంలోనే ముష్టి యుద్ధానికి దిగారు. నర్సారెడ్డి అనుచరులను పరిశ్రమలోనికి రానివ్వలేదని రచ్చ రచ్చ చేశారు. ఫ్లెక్సీలు చింపేశారు. తోపులాటలు జరిగాయి. చివరికి అంతా కలిసి ముఖ్యమంత్రికే చికాకు తెప్పించారు. కొంతకాలం తర్వాత నియోజకవర్గంలో రెండు కాస్తా మూడు వర్గాలు అయ్యాయి. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి అనుచరులం అంటూ మరో గ్రూప్ ఇక్కడ తయారయ్యింది. దీంతో… మూడు రంగుల జెండా పార్టీలో మూడు గ్రూపులు ఫిక్స్ అయ్యాయి.
Read Also: Sattamum Needhiyum: ‘సట్టముం నీతియుం’ సిరీస్‌కి సూపర్ రెస్పాన్స్
తాజాగా జిల్లా ఇంచార్జ్ మంత్రి వివేక్ పర్యటనలో వర్గ విబేధాలు భగ్గుమన్నాయి. మంత్రి ముందే నర్సారెడ్డి, శ్రీకాంత్ రావు వర్గాలు కుమ్ములాటకు దిగాయి. గల్లాలు పట్టుకుని, అంగీలు చినిగేలా కొట్టుకున్నారు అంతా. అంతటితో ఆగకుండా జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డిపై సొంత పార్టీ నేతలే కులం పేరుతో దూషించడాని పోలీస్ కంప్లయింట్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పంచాయితీ గాంధీభవన్‌కు చేరింది. ఇక దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల్లోనూ వర్గ విబేధాలు ఉన్నాయి. దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, శ్రవణ్ కుమార్ రెడ్డి మధ్య ఎప్పటినుంచో విబేధాలు ఉన్నాయి. కొన్ని రోజులుగా శ్రవణ్ కుమార్ రెడ్డి నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాత్రం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఇక హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట నియోజకవర్గంలో పార్టీ అంతంతమాత్రంగా ఉన్నా గ్రూపులు మాత్రం 10కి పైగా ఉన్నాయి. నియోజకవర్గ ఇంచార్జ్ హరికృష్ణ అంటే పార్టీలో సీనియర్లకు పడటం లేదట. ఆయన చేసే పార్టీ కార్యక్రమాలకు ఏదో రకంగా ఆటంకాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. సీనియర్లపై జూనియర్ పెత్తనం ఏంటన్నది వారి వాదన. ఇలా సిద్దిపేట జిల్లాలో ఏ నియోజకవర్గంలో చూసినా కాంగ్రెస్ పార్టీలో గ్రూపుల గోల సర్వసాధారణంగా కనిపిస్తోంది. దీంతో… పార్టీ అధికారంలో వచ్చినా మీరు మారరా..? అంటూ కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులు గుస్సాగా ఉన్నట్టు సమాచారం. నేతల సొంత ప్రయోజనాల కోసం పార్టీని సర్వనాశనం చేస్తున్నారని వాపోతోంది కేడర్. అధిష్టానం ఈ జిల్లాపై స్పెషల్ ఫోకస్ పెట్టి గ్రూపులు కట్టిన వారు, ప్రోత్సహిస్తున్న వాళ్ళకు చెక్ పెట్టాలని కోరుతోంది కేడర్.