ఓడ దాటేదాక ఓడ మల్లన్న.. ఒడ్డు దిగాక బోడి మల్లన్న. ప్రస్తుతం ఆ నగరంలో మున్సిపల్ కార్పొరేటర్ల తీరు అలాగే ఉందట. ఎన్నికల్లో గెలిచేదాకా.. స్థానికులకు అనేక హామీలు గుప్పించారు. ఇప్పుడు అదే ప్రజలు వరదలతో ఇబ్బంది పడుతుంటే.. అంతా గాయబ్. ఎందుకిలా?
వరదల టైమ్‌లో వైసీపీ కార్పొరేటర్లు ఏమయ్యారు?
వరదలకు తిరుపతి మునిగిపోయింది. రోజులు గడుస్తున్నా నగరంలోని చాలా ప్రాంతాలు నీటిలోనే నానుతున్న పరిస్థితి. ప్రజలు హాహాకారాలు పెడుతుంటే.. తిరుపతి మున్సిపల్ కార్పొరేటర్ల తీరు విమర్శలకు దారితీస్తోంది. మొత్తం 50 డివిజన్లలో 48 డివిజన్లు వైసీపీకే దక్కాయి. తొలి కార్పొరేషన్‌ను వైసీపీ తన ఖాతాలో వేసుకుంది. మరి వరదల సమయంలో వైసీపీ కార్పొరేటర్లు ఏమయ్యారు? తమ డివిజన్లలోని ప్రజలు అల్లాడుతుంటే ఎక్కడున్నారు? అని తిరుపతి ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఆదుకోవాలని బాధితులు ఫోన్ చేసినా స్పందన లేదా?
ఎప్పుడూ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి చుట్టూ కనిపించే కార్పొరేటర్లు.. వరదల సమయంలో ఎమ్మెల్యే తిరుగుతుంటే.. ఆయన వెనక కనిపించలేదు. ఈ మధ్యే అధికారం చేపట్టిన కార్పొరేటర్లు ఉత్సాహంగా పనిచేస్తారని అంతా అనుకున్నారు. పార్టీ కేడర్ కూడా అదే ఆశించింది. అలాంటిది ప్రజలు వరదలతో అల్లాడుతుంటే.. కార్పొరేటర్ల అలికిడే లేదు. ముఖ్యంగా 8 డివిజన్ల పరిధిలోని 40 వేల మంది వరదలకు చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారు. తమను ఆదుకోవాలని స్థానికులు ఫోన్ చేసినా కొందరు కార్పొరేటర్ల ఆన్సన్ చేయలేదట. ఇదే విషయాన్ని తమ దగ్గరకు వచ్చిన ఎమ్మెల్యే భూమనకు ఫిర్యాదు చేశారట ప్రజలు.
తూతూ మంత్రంగా మేయర్, డిప్యూటీ మేయర్ పర్యటనలు..!
తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష.. తన సొంత ఆస్పత్రికే పరిమితం అయ్యారన్నది టీడీపీ, జనసేన నేతల ఆరోపణ. వరద ప్రభావిత ప్రాంతాల్లో పెద్దగా పర్యటించలేదని విమర్శిస్తున్నాయి. సొంత డివిజన్‌లోని ప్రజలు వరదలకు అల్లాడుతుంటే కనిపించని మేయర్.. కేంద్ర బృందం పర్యటనలో మాత్రం అన్నీ తానై వ్యవహరించారు. డిప్యూటీ మేయర్‌గా ఉన్న ఎమ్మెల్యే భూమన తనయుడు సైతం ప్రధాన రోడ్డుపై పర్యటించి చేతులు దులుపుకొన్నారనే విమర్శలు ఉన్నాయి.
కొత్తగా కార్పొరేటర్లు అయిన వారికీ ప్రజల గోడు పట్టలేదా?
తిరుపతి పరిధిలోని శ్రీకృష్ణనగర్‌లో వాటర్ ట్యాంక్ భూమిలో నుంచి పైకి రావడం.. చాలా ఇళ్లు భూమిలోకి కుంగిపోవడం.. బీటలు వారడంతో జనాలు భయాందోళన చెందారు. వారికి ధైర్యం చెప్పడానికి.. సహాయ చర్యల వేగం పెంచడానికి కార్పొరేటర్లు చొరవ తీసుకుంటే రాజకీయంగా మైలేజ్ వచ్చేదన్నది అధికారపార్టీ శ్రేణుల వాదన. కొత్తగా కార్పొరేటర్లు అయినవాళ్లకు సైతం ప్రజల గోడు పట్టకపోవడం పార్టీ వర్గాలనే ఆశ్చర్య పరుస్తోందట. మరి.. కష్టకాలంలో గాయబైన కార్పొరేటర్లు ఎప్పుడు తమ పంథాను మార్చుకుంటారో చూడాలి.