Actresses in BJP : హీరోలకు ప్రాధాన్యం ఇవ్వడంతో.. బీజేపీలో ఉన్న అలనాటి హీరోయిన్లు ఫీలవుతున్నారా? తామూ బీజేపీలోనే ఉన్నామని చెప్పుకోవడానికి నానా తంటాలు పడుతున్నారా? పొలిటికల్ లీడర్లుగా ఉనికి చాటుకొనే పనిలో ఉన్నారా? ఈ క్రమంలోనే అలకలు.. పిలుపులు కాషాయ శిబిరంలో చర్చగా మారాయా?
హైదరాబాద్‌కు బీజేపీ అగ్రనేత అమిత్ షా వచ్చారు.. హీరో జూనియర్ ఎన్టీఆర్‌తో సమావేశమై చర్చించారు. ఆ తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు JP నడ్డా భాగ్యనగరానికి వచ్చి మరో హీరో నితిన్‌తో భేటీ అయ్యారు. చాలా రోజుల తర్వాత నటీనటులపై రాజకీయ పార్టీల ఫోకస్ పడింది. ఈ ఇద్దరితో బీజేపీ అగ్రనేతలు సమావేశం అయ్యారు సరే.. ఇప్పటికే పార్టీలో ఉన్న ఇతర నటుల పరిస్థితి ఏంటి? వారిని ఎందుకు పట్టించుకోవడం లేదు? మేమూ బీజేపీలోనే ఉన్నాం అని నటీనటులు చెప్పుకోవాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది? కాషాయ శిబిరంలో హాట్ టాపిక్‌గా ఉన్న ప్రశ్నలివే.
బీజేపీలోకి రీఎంట్రీ ఇచ్చాక విజయశాంతిని పార్టీ జాతీయ కార్యవర్గంలోకి తీసుకున్నారు. జాతీయ కార్యవర్గ సభ్యుల కోటాలో ప్రత్యేక ఆహ్వానితురాలిగా ఉన్నారు రాములమ్మ. బీజేపీలోకి తిరిగొచ్చాక యాక్టివ్‌గా కనిపించిన ఆమె.. తర్వాత గాయబ్. ఇంతలో విజయశాంతి అలకలో ఉన్నారనే ప్రచారం సాగింది. తనకు ఎందుకు పార్టీ బాధ్యతలు అప్పగించడం లేదో.. కార్యక్రమాలకు ఎందుకు పిలవడం లేదో రాష్ట్ర నేతలకే తెలియాలని కామెంట్స్ పాస్ చేశారు కూడా. తర్వాత ఏమైందో ఏమో పార్టీపై ఎలాంటి వ్యాఖ్యలు.. వ్యాఖ్యానాలు లేవు. బీజేపీ యాక్టివిటీస్‌లో చురుకుగానే కనిపిస్తున్నారు రాములమ్మ. మరి.. బీజేపీలోనే ఉన్న నాటి హీరోయిన్లు జీవిత, కవిత పరిస్థితి ఏంటనేదే చర్చ. అప్పట్లో బీజేపీలోనే ఉన్న జీవిత.. తర్వాత వైసీపీకి ప్రచారం చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ పగ్గాలు చేపట్టగానే మళ్లీ కాషాయ పార్టీ ఆఫీసులో ప్రత్యక్షం అయ్యారు. తాను ఎప్పుడూ బీజేపీని వదలలేదని.. కొన్ని కారణాల వల్లే వైసీపీ అధినేత జగన్‌కు మద్దతిచ్చామని బండి సంజయ్‌కు జీవిత చెప్పినట్టు సమాచారం. తెలంగాణ బీజేపీ కార్యక్రమాల్లో పాల్గొంటామని.. ఏదన్నా ఉంటే ఆహ్వానించాలని జీవిత కోరారట. అక్కడ నుంచి పిలుపు రాకపోతే.. ఆమె ఫోన్ చేసి కనుక్కుని వస్తున్నారట.
ఏపీ బీజేపీ కమిటీలో పదవి ఉన్నప్పటికీ.. మరో నటి కవిత మాత్రం వ్యక్తిగత కారణాలతో పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇటీవల తెలంగాణ బీజేపీ కార్యక్రమాల్లో పాల్గొంటానని పార్టీ నేతలకు విన్నవించారట. తాను హైదరాబాద్‌లోనే ఉంటున్నాను కాబట్టి.. ఇక్కడే పార్టీ ప్రొగ్రామ్స్‌లో పాల్గొంటానని చెప్పారట కవిత. అలా అడిగిందే తడవుగా బండి సంజయ్ నాలుగో విడత ప్రారంభ సభలో ప్రత్యక్షం అయ్యారామె. ఏకంగా వేదికపైకి వచ్చి కూర్చున్నారు. దీంతో సినీ నటులను ఎవరు పిలిచారు అనే చర్చ సాగింది. జీవిత, కవితలకు తెలంగాణ బీజేపీలో ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు. ప్రొటోకాల్ పదవులు లేవు. కాకపోతే వచ్చారు కాబట్టి సభలో గౌరవించామన్నది బీజేపీ నేతల మాట. గత ఎన్నికల్లో గుంటూరు జిల్లాలో బీజేపీ తరఫున పోటీ చేసిన మరో హీరోయిన్ మాధవీలత. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు కానీ.. ఇప్పుడు పార్టీలో ఉన్నారో లేదో చెప్పలేమంటోంది బీజేపీ శిబిరం. ఇటీవల ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో బాపుబొమ్మ దివ్యవాణి సమావేశం అయ్యారు. ఈటల బీజేపీ చేరికల కమిటీకి ఛైర్మన్ కావడంతో.. ఆమె కాషాయ కండువా కప్పుకొంటారని ప్రచారం నడుస్తోంది. వీళ్లందరి సేవలను పార్టీ ఏ విధంగా ఉపయోగించుకుంటుంది. పార్టీలో చేర్చుకుని బాధ్యతలు అప్పగిస్తుందా లేక చేరిన వాళ్లే జీవిత, కవితల్లా పార్టీ ఆఫీసుకు ఫోన్ చేసి కార్యక్రమాలకు వెళ్తారో చూడాలి.