కలిసికట్టుగా పనిచేయాల్సిన టైంలో అక్కడ గులాబీ నేతలు తన్నులాటలు, తలకపోతలతో టైంపాస్ చేస్తున్నారా? జిల్లా అధ్యక్షుడికి, నియోజకవర్గ ఇన్ఛార్జ్‌లకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందా? చివరికి బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులను కూడా నియమించుకోలేని దుస్థితి ఏ జిల్లాలో ఉంది? అక్కడున్న ప్రత్యేక పరిస్థితులు ఏంటి?.
భద్రాద్రి జిల్లా గులాబీ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. జిల్లా అధ్యక్షుడి మీద ముగ్గురు నేతలు విరుచుకుపడుతున్నారు. అదీకూడా… తమ ఫీలింగ్స్‌ని ఏ మాత్రం దాచుకోకుండా… ఓపెన్ వార్ డిక్లేర్ చేయడం పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. కొత్తగూడెం, ఇల్లెందు, అశ్వారావు పేట మండల అధ్యక్షుల ఎంపిక వివాదం చిచ్చు రాజేసిందట. ఇప్పటికే… జిల్లాలో పార్టీ పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటే… ఇప్పుడు ఈ వర్గపోరు పుట్టి ముంచే ప్రమాదం కనిపిస్తోందని కేడర్ కంగారు పడుతోంది. పార్టీ అధికారంలో లేని సమయంలో కలుపుగోలుగా ఉండాల్సిన వాళ్ళు కీచులాడుకుని మరీ దిగజారుస్తున్నారన్నది కింది స్థాయిలో ఉన్న అభిప్రాయం. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా భద్రాచలం నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ గెలిచింది. అయితే… గెలిచాక కాంగ్రెస్ గూటికి చేరిపోయారు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. దాంతో… పార్టీ ఫిరాయింపుల క్రమంలో ఉప ఎన్నిక అంటూ జరిగితే… తానే పోటీ చేస్తానంటున్నారు బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎంఎల్ఎ రేగా కాంతారావు. కానీ… పార్టీ ఇన్ఛార్జ్‌ని మాత్రం నియమించకపోవడంతో… టిక్కెట్ రేగాకా, మరొకరికా అన్నది అర్ధంకాని పరిస్థితి.
ఈ క్రమంలో పరస్పర విమర్శలతో వీధికెక్కుతున్నారు పార్టీ నాయకులు. ఓవైపు స్థానిక ఎన్నికలకు అన్ని పార్టీలు పరుగులు పెడుతుంటే… మా వాళ్ళు మాత్రం కీచులాటలతో టైంపాస్ చేస్తున్నారంటూ భద్రాచలం బీఆర్‌ఎస్ కేడర్ అసహనంగా ఉందట. అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కొద్ది రోజుల క్రితం ఏకంగా ప్రెస్‌మీట్ పెట్టిమరీ.. పార్టీలో పరిస్తితి దారుణంగా ఉందని, నేతలను గుర్తించడం లేదని ఆరోపించారు. కాగా… వర్గ విభేదాలతో మూడేళ్లుగా అశ్వారావు పేట మండల అధ్యక్షుడిని నియమించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అటు ఇల్లెందు, కొత్తగూడెం నియోజకవర్గాల్లో మండల, పట్టణ అధ్యక్షుల ఎంపిక నియోజకవర్గ ఇన్ఛార్జ్‌లు మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షుడి మధ్య వివాదం రేపింది. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లకు సంబంధం లేకుండానే జిల్లా అధ్యక్షులను నియమించడం వాళ్ళ ఆగ్రహానికి కారణం అయ్యింది. ఇల్లెందు పట్టణ అధ్యక్ష పదవికి రేగా కాంతారావు ఒకరిని నియమించగా…..వెంటనే మాజీ ఎమ్మెల్యే హరిప్రియ పేరుమీద మరొకరిని నియమిస్తున్నట్టు మరో ప్రకటన వచ్చింది. ఇల్లెందులో ఉన్న రెండు వర్గాలు చెరొకరిని పట్టణ అద్యక్షులుగా ప్రకటించాయి. అలాగే కొత్తగూడెం నియోజకవర్గంలోని చుంచుపల్లి, సుజాతనగర్ మండలాలకు పార్టీ అధ్యక్షులను జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ప్రకటించారు. ఇది కూడ వివాస్పదం అయ్యింది.
Also Read: Mini Projector Tips: మినీ ప్రొజెక్టర్ కొంటున్నారా?.. ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే!
మాజీ మంత్రి, సీనియర్ అయిన వనమా వెంకటేశ్వర రావుకు సంబందం లేకుండానే వీటిని ప్రకటించడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ఎటు చూసినా…. వర్గ విభేదాలతో భద్రాద్రి బీఆర్‌ఎస్‌లో అయోమయ పరిస్థితులు ఉన్నాయి. ఆ గొడవ అలా కొనసాగుతుండగానే…తాజాగా రేగా కాంతారావు సోషల్ మీడియా వేదికగా చేసిన మరోప్రకటనతో నేతల్లో ఆగ్రహం కట్టలు తెచుకుందట. నియోజకవర్గ ఇన్ఛార్జ్‌లకు పేరు ప్రతిపాదించే అధికారం మాత్రమే ఉంటుందని, తుది నిర్ణయం మాత్రం జిల్లా అధ్యక్షుడిదే కాబట్టి…అనవసరంగా పార్టీని డిస్ట్రబ్ చేయడం మాని స్థానిక ఎన్నికలపై దృష్టి పెట్టాలన్నది ఆయన ప్రకటన సారాంశం. దీంతో… ఆయనేంటి మాకు వార్నింగ్ ఇచ్చేదేంటని మాట్లాడుతున్నారట నియోజకవర్గ స్థాయి నాయకులు. మరోవైపున పార్టీ అధిష్టానం కూడా జిల్లాలో ఉన్న పరిస్థితిని తెలుసుకుని చక్కదిద్దే ప్రయత్నం చేయడం లేదన్న అసంతృప్తి పెరుగుతోంది. దీన్ని ఇలాగే వదిలేస్తే భద్రాద్రి జిల్లాలో గులాబీ రెక్కలు వేటికవే ఊడిపోవడం ఖాయమన్న వాదన బలపడుతోంది.