గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ 48 డివిజన్లు గెల్చుకుంది. GHMC ఎన్నికల ద్వారా సిటీలో కాషాయం పార్టీకి సానుకూల వాతావరణం వచ్చిందన్నది కమలనాథుల అభిప్రాయం. అయితే ఎన్నికలు అయ్యి దాదాపు 15 నెలలు కావస్తోంది. రోజులు గడిచిపోతున్నాయి కానీ.. GHMCలో బీజేపీ ఫ్లోర్ లీడర్ ఎవరో పార్టీ తేల్చలేదు. పార్టీ పరంగా కార్పొరేటర్లకు ఇచ్చే పదవులపైనా ఉలుకు.. పలుకు లేదు. ఈ పదవుల కోసమే కొందరు కాచుకుని ఉన్నారు.
GHMCలో బీజేపీలో ఫ్లోర్ లీడర్ అంటే.. పార్టీలోనూ మంచి గుర్తింపు వస్తుందనే లెక్కల్లో ఉన్నారు కార్పొరేటర్లు. ఇందుకోసం ఎవరి స్థాయిలో వాళ్లు పార్టీ రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకుల దగ్గర లాబీయింగ్ కూడా చేస్తున్నారు. కానీ.. పార్టీ నాయకత్వం ఈ విషయాన్ని తేల్చడం లేదు. నెలలు గడిచిపోతున్నా బీజేపీ దృష్టిపెట్టకపోవడం కూడా కొత్త అనుమానాలకు తావిస్తున్న పరిస్థితి ఉంది. పదవి ఆశిస్తున్నవారిలో అసంతృప్తితోపాటు.. ఫ్లోర్ లీడర్ పోస్టును ఎందుకు ఖాళీగా ఉంచారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది.
ఉన్న బీజేపీ కార్పొరేటర్లలో ఒకరిని ఫ్లోర్ లీడర్‌గా కూడా ఎంపిక చేయలేని పరిస్థితిలో పార్టీ నాయకత్వం ఉందా అన్నది కాషాయ శిబిరంలో జరుగుతున్న చర్చ. ఒకవేళ ఫ్లోర్ లీడర్‌ను నియమిస్తే.. ఇప్పటికే హైదరాబాద్ సిటీలో ఉన్న బీజేపీ కీలక నాయకులకు పోటీ వస్తారనే భయం ఉందేమోనని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
ఈ అంశంపై బీజేపీ సీనియర్ల అభిప్రాయం మరోలా ఉందట. ఆ ఫ్లోర్ లీడర్‌ను ఎంపిక చేసేస్తే.. సిటీలో బీజేపీ ఎదుగుదలకు పనికి వస్తారని.. నగరంలో పార్టీ యాక్టివిటీ చేయాలంటే మరింత వెసులుబాటు చిక్కుతుందనేది సీనియర్ల వాదన. అన్ని స్థాయిల్లోనూ నాయకత్వాన్ని ప్రోత్సహించిస్తే.. పార్టీకి కేడర్‌కు మధ్య గ్యాప్ రాదని సూచిస్తున్నారట. తర్వాతి తరాన్ని ఎంకరైజ్ చేయకపోతే ఎలా అన్నది వాళ్ల ప్రశ్న. ఎవరిని ఫ్లోర్ లీడర్‌గా ప్రకటించినా.. ఇంకో పవర్ సెంటర్ అవుతారని అనుకోవడం పొరపాటని.. ఇది మంచి సంప్రదాయం కాదని హితవు పలుకుతున్నారట కమలనాథులు.
ప్రస్తుతం GHMCలోని బీజేపీ కార్పొరేటర్లు ఎవరికి వారుగా ఉన్నారు. ఐక్యంగా పోరాటాలు చేయడం లేదు. అదే ఒక ఫ్లోర్ లీడర్ ఉంటే.. వాళ్లందరిని సమన్వయం చేసుకునే అవకాశం చిక్కుతుందని.. పార్టీ విషయాలు కార్పొరేటర్లకు చేరవేయడానికి ఈజీ అవుతుందని చెబుతున్నారు. GHMC పరిధిలో బీజేపీ ఇంకా బలపడాలంటే పార్టీ ఆలోచన కూడా మారాలన్నది పార్టీలో వినిపిస్తున్న టాక్. అయితే ఫ్లోర్ లీడర్ నియామకంపై ఏకాభిప్రాయం కుదరకే పెండింగ్‌లో పెట్టారన్నది కొందరి వాదన. అదే నిజమైతే ఎంతకాలం పెండింగ్ పెడతారని ప్రశ్నించేవాళ్లూ ఉన్నారు.
బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు గతంలో ఇదే అంశాన్ని పార్టీ సంస్థాగత ప్రధానకార్యదర్శి దృష్టికి తీసుకెళ్లారు. పదవులు ఖాళీగా ఉంచొద్దని పార్టీ జాతీయ నాయకత్వం చెప్పినా ఎందుకు నియమించడం లేదని ఆయన ప్రశ్నించారట. GHMCలో ముగ్గురు కార్పొరేటర్లు ఉన్న కాంగ్రెస్ ఈ విషయంలో క్లారిటీతో ముందుకెళ్తుంటే.. బీజేపీకి ఏమైందే దానికి పార్టీలో సమాధానం లేదట.